ఆ ఎంపీ రెడ్డి సామాజికవర్గాన్ని కించపరచలేదు: సుధాకర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-05-17T18:19:19+05:30 IST

వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎక్కడా, ఎప్పుడూ పనిగట్టుకొని రెడ్డి సామాజికవర్గాన్ని కించపరచలేదని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఎన్.బీ.సుధాకర్‌రెడ్డి అన్నారు.

ఆ ఎంపీ రెడ్డి సామాజికవర్గాన్ని కించపరచలేదు: సుధాకర్‌రెడ్డి

అమరావతి:  వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎక్కడా, ఎప్పుడూ పనిగట్టుకొని రెడ్డి సామాజికవర్గాన్ని కించపరచలేదని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఎన్.బీ.సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పరిణామాలు చూస్తుంటే, అధికారిక హత్యలకు కుట్రలు జరుగుతున్నాయని.. ఇలాగే జరిగితే పరిపాలనాపరమైన ఉన్మాదం చెలరేగే అవకాశం కనిపిస్తోందన్నారు. రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌తోనే పరిపాలనా తీరు ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.  రఘురామరాజు వ్యాఖ్యల్లో రాజద్రోహం ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అనిపిస్తే ఆయన కమ్మసామాజికవర్గం గురించి అన్నమాటల సంగతేంటి? అని సుధాకర్‌రెడ్డి  ప్రశ్నించారు. ప్రభుత్వం రెడ్లకే ప్రాధాన్యత ఇస్తోందని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడన్నారు. రఘురామకృష్ణంరాజు పాదాలు వాచిపోయేలా కొడితే, అవి దెబ్బలు కావు రంగుపూశారని వైసీపీ నేతలు అంటారా అని సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దై జైలుకు వెళ్తే, ఆయన్ని కూడా కొడితే అంబటి రాంబాబు అలానే సమర్థించుకుంటారా? అని సుధాకర్‌రెడ్డి  ప్రశ్నించారు. ఇందిరాగాంధీ హాయాంలో ప్రత్యర్థులను జైలుకు పంపినా, ఇలా ఎవరినీ కొట్టడం, కొట్టించడం చేయలేదన్నారు. రెడ్డి అనేది కేవలం ఒక టైటిల్ మాత్రమే, జగన్మోహన్‌రెడ్డికి ముందు ఎందరో రెడ్లు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారని సుధాకర్‌రెడ్డి  చెప్పారు.  ఎవరూ కూడా ఈ ముఖ్యమంత్రిలా ప్రవర్తించలేదని తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కమ్మసామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదని సుధాకర్‌రెడ్డి  చెప్పారు.

 

 పోలీసులను అడ్డుపెట్టుకొని జగన్ పాలిస్తున్నాడన్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు, బిళ్ల బంట్రోతులకు పెద్దగా తేడా లేకుండా పోయిందన్నారు. పాలకులు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్మాద లక్షణాలు వీడి, వివేకంతో ప్రవర్తిస్తే వారికే మంచిదని సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు చేయి పైకెత్తి మాట్లాడిన జగన్.. ఇప్పుడెందుకు చేతులు కట్టుకొని మాట్లాడుతున్నారు? అని సుధాకర్‌రెడ్డి  నిలదీశారు. తన బెయిల్ రద్దై, జైలుకు వెళ్తే, దానికి సంబంధించి రఘురామరాజు సహా ఎవరూ సాక్ష్యం చెప్పకూడదనే ఆయనపై ముఖ్యమంత్రి ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారని చెప్పారు. రాజకీయాలంటే స్వార్థానికి, కక్షసాధింపులకు ఉపయోగించుకోవడం  కాదని జగన్ తెలుసుకుంటే మంచిదని సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-05-17T18:19:19+05:30 IST