సుధాకర్‌ కేసులో.. నర్సీపట్నం ఎమ్మెల్యే వాంగ్మూలం

ABN , First Publish Date - 2020-06-06T09:28:15+05:30 IST

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంపై సీబీఐ అధికారులు నర్సీపట్నంలో రెండో రోజు కూడా విచారణ కొనసాగించారు. విశాఖ నుంచి వచ్చిన ఇద్దరు సీబీఐ అధికారుల బృందం శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌, మున్సిపల్‌

సుధాకర్‌ కేసులో.. నర్సీపట్నం ఎమ్మెల్యే వాంగ్మూలం

  • రెండోరోజూ కొనసాగిన సీబీఐ విచారణ


నర్సీపట్నం, జూన్‌ 5: డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంపై సీబీఐ అధికారులు నర్సీపట్నంలో రెండో రోజు కూడా విచారణ కొనసాగించారు. విశాఖ నుంచి వచ్చిన ఇద్దరు సీబీఐ అధికారుల బృందం శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ తోట కృష్ణవేణి, ఆర్డీవో కేఎల్‌ శివజ్యోతిలను వేర్వేరుగా విచారించి.. వాంగ్మూలాలు తీసుకుంది. మున్సిపల్‌ కార్యాలయంలో మరికొందరు సిబ్బందిని కూడా ప్రశ్నించారు. సుధాకర్‌ ఏప్రిల్‌ 6న ఇదే కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసేందుకు దారితీసిన పరిస్థితులపైనా సీబీఐ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. అనంతరం వారు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లారు. సుమారు మూడు గంటలపాటు అక్కడే ఉన్నారు. ఆర్డీవో వాంగ్మూలాన్ని నమోదుచేశారు. సాయంత్రం పట్టణ శివార్లలోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. ఏప్రిల్‌ 6న మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా పలు విషయాల గురించి దాదాపు 3 గంటలపాటు ప్రశ్నించి, వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. డాక్టర్‌ సుధాకర్‌ను ఎమ్మెల్యే తన ఇంటికి పిలిపించుకుని బలవంతంగా క్షమాపణ పత్రాన్ని రాయించుకున్నారన్న ప్రచారంపైనా ఆయన్ను వివరణ అడిగినట్లు తెలిసింది. తర్వాత నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి వెళ్లి గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ గౌతమినాయుడును కూడా ప్రశ్నించినట్లు సమాచారం. సీబీఐ బృందం మొదటి రోజు గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 6 గంటలపాటు ఏరియా ఆస్పత్రిలోనే విచారణ జరిపింది. ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలవేణిదేవి వాంగ్మూలాన్ని నమోదుచేసింది. డ్రగ్‌ స్టోర్స్‌, ఆపరేషన్‌ థియేటర్‌ రికార్డులు, డాక్టర్‌ సుధాకర్‌కు సంబంధించిన వృత్తిపరమైన పైళ్లు కొన్నింటిని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సుధాకర్‌ వ్యవహారశైలిపై కొందరు వైద్య ఉద్యోగులను కూడా ప్రశ్నించినట్లు సమాచారం.

Updated Date - 2020-06-06T09:28:15+05:30 IST