సీనియర్ సిటిజన్ల మాదిరిగా తమకు కార్డులు జారీ చేయాలని ప్రధాని మోదీని కోరుతున్న సుధా చంద్రన్

మయూరి సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన నటి సుధా చంద్రన్. భరతనాట్యం డ్యాన్సర్ అయిన ఆమె ఒక ప్రమాదంలో తన కాలును కొల్పోయింది. అనంతరం కృత్రిమంగా కాలును అమర్చుకుని తిరిగి ప్రదర్శనలిచ్చింది. ఆమె జీవిత చరిత్ర ఎందరిలో స్ఫూర్తిని నింపుతుందని సింగితం శ్రీనివాసరావు తలచి మయూరి సినిమాను తెరకెక్కించారు. 


తాజాగా ఆమెకు ఎయిర్ పోర్టులో అవమానం జరిగింది. ఆమె అమర్చుకున్న కృత్రిమ కాలును తొలగించాల్సిందిగా భద్రతా సిబ్బంది కోరారు. ఎయిర్ పోర్టులోని భద్రత సంస్థలు కృత్రిమ అవయవాలను అమర్చుకున్నవారిని ప్రశ్నలతో వేధిస్తున్నాయని ఆమె చెప్పింది. ఎయిర్ పోర్టుకు వెళ్లిన ప్రతిసారి ఈ విధంగానే జరుగుతుందని చెబుతోంది. అందువల్ల సీనియర్ సిటిజన్స్‌కు ఇచ్చే కార్డు మాదిరిగానే తమకు అటువంటి వాటిని జారీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరింది.


ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ..‘‘ గుడ్ ఈవినింగ్. ఇది చాలా వ్యక్తిగత విషయం. ప్రధాని, కేంద్రప్రభుత్వానికి ఒక విషయం తెలపాలనుకుంటున్నాను. నేను సుధా చంద్రన్. నటిని, ప్రొఫెషనల్ డ్యాన్సర్‌ని.  కృత్రిమ కాలును అమర్చుకుని ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదర్శనలిచ్చి దేశం గర్వపడేలా చేశాను. నేను వృత్తి రీత్యా  అనేక చోట్లకు ప్రయాణించాల్సి ఉంటుంది. ఎయిర్ పోర్టులోని భద్రతా సిబ్బంది ప్రతిసారి నన్ను ఆపుతున్నారు. నా కృత్రిమ కాలును తీసి చూపెట్టామని అడుగుతున్నారు. ఈటీడీ(ఎక్స్ ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్)‌తో చెక్ చేయమని అడగగా వారు అందుకు అంగీకరించడం లేదు. మన సమాజంలో ఒక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా.  సీనియర్ సిటిజన్స్‌కు ఇచ్చిన మాదిరిగానే మాకు ఒక కార్డును జారీ చేస్తే బాగుంటుంది. ప్రతిసారి ఇలా ప్రశ్నలతో వేధించడం బాగాలేదు. మీరు దీనిపైన ఒక చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను ’’ అని వివరించింది  


ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభించింది. టీవీ నటుడు అయిన కరణ్ బొహ్రా కూడా స్పందించారు. తన పూర్తి మద్దతును ఆమెకు తెలుపుతున్నట్టు ఆయన కామెంట్ చేశారు.Advertisement