భీమా కొరెగావ్ కేసులో సుధ భరద్వాజ్‌కు చుక్కెదురు

ABN , First Publish Date - 2020-05-30T01:26:21+05:30 IST

భీమా-కొరెగావ్ కేసులో నిందితురాలు సుధ భరద్వాజ్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ

భీమా కొరెగావ్ కేసులో సుధ భరద్వాజ్‌కు చుక్కెదురు

ముంబై : భీమా-కొరెగావ్ కేసులో నిందితురాలు సుధ భరద్వాజ్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టులో శుక్రవారం చుక్కెదురైంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో తనకు తాత్కాలిక బెయిలు మంజూరు చేయాలని ఆమె చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. 


2018 జనవరి 1న భీమా కొరెగావ్‌లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. దీనికి సంబంధించి దాదాపు 58 కేసులు నమోదయ్యాయి. 162 మందిని నిందితులుగా చేర్చారు. సుధ భరద్వాజ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 


భీమా-కొరెగావ్ యుద్ధం జరిగి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2018 జనవరి 1న కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. ఫలితంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది గాయపడ్డారు. 


ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుధ భరద్వాజ్ తనకు తాత్కాలిక బెయిలు మంజూరు చేయాలని స్పెషల్ ఎన్ఐఏ కోర్టును కోరారు.   కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో తనకు తాత్కాలిక బెయిలు మంజూరు చేయాలని కోరారు. 


అయితే ఎన్ఐఏ ఆమె బెయిలు దరఖాస్తుపై అభ్యంతరం తెలిపింది. ఆెమె ప్రాణాపాయకరమైన వ్యాధితో బాధపడటం లేదని తెలిపింది. వైద్య నివేదికల ప్రకారం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. దీంతో స్పెషల్ ఎన్ఐఏ కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేయడానికి తిరస్కరించింది. 


ఎల్గార్ పరిషత్‌ 2017 డిసెంబరు 31న నిర్వహించిన సమావేశంలో సుధ భరద్వాజ్ తదితర పౌర హక్కుల ఉద్యమకారులు పాల్గొని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, ఆ మర్నాడు హింసాత్మక సంఘటనలు జరిగాయని పుణే పోలీసులు కేసు నమోదు చేశారు. 


ఎల్గార్ పరిషత్‌కు మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఆరోపించారు.  ఆమెతోపాటు మరో 10 మంది పౌర హక్కుల ఉద్యమకారులపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తు ఎన్ఐఏకు బదిలీ అయింది.


Updated Date - 2020-05-30T01:26:21+05:30 IST