ధారావిలో మరోమారు కరోనా బ్లాస్ట్?

ABN , First Publish Date - 2020-09-26T15:41:49+05:30 IST

ధారావి... ఈ పేరు వినగానే వేల గుడిసెలు కలిగిన మురికివాడ ప్రాంతం కళ్లముందు కదలాడుతుంటుంది. ఆసియాలోనే అత్యంత పెద్దదైన ఈ మురికివాడలో ఏకంగా 10 లక్షలకు మించిన ప్రజలు ఉంటున్నారు. గడచిన ఏప్రిల్‌లో ఇక్కడ తొలిసారి...

ధారావిలో మరోమారు కరోనా బ్లాస్ట్?

ముంబై: ధారావి... ఈ పేరు వినగానే వేల గుడిసెలు కలిగిన మురికివాడ ప్రాంతం కళ్లముందు కదలాడుతుంటుంది. ఆసియాలోనే అత్యంత పెద్దదైన ఈ మురికివాడలో ఏకంగా 10 లక్షలకు మించిన ప్రజలు ఉంటున్నారు. గడచిన ఏప్రిల్‌లో ఇక్కడ తొలిసారి కరోనా వ్యాపించింది. అయితే జూన్ నాటికి ఈ ప్రాంతంలో కరోనా వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది. దీంతో కరోనాను అరికట్టడంలో ధారావి మోడల్‌గా నిలిచిందంటూ వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు ఈ పరిస్థితులకు భిన్నంగా ఇక్కడ మరోమారు కరానా విజృంభిస్తోంది. ధారావిలో కరోనా కేసులు మూడు వేలను దాటాయి. ప్రస్తుతం 180 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అడ్డదిడ్డంగా ఉండే గల్లీలు, చిన్నచిన్న ఇళ్లు, ఒక్కో ఇంటిలో ఐదుగురారుగురు నివాసం, తగిన వసతి సౌకర్యాలు లేకపోవడం మొదలైనవన్నీ ఇక్కడ సర్వసాధారణం. ధారావిలో 26 ఏళ్లుగా క్లినిక్ నడిపిస్తున్న డాక్టర్ మనోజ్ జైన్ మాట్లాడుతూ ధారావిలో ఏప్రిల్ ఒకటిన తొలి కరోనా కేసు నమోదయ్యిందని, దీని తరువాత ఇక్కడ కరోనా విజృంభించి, పలువురు మృతి చెందారన్నారు. అలాగే హార్ట్ ఎటాక్‌తో కూడా కొంతమంది మరణించారన్నారు.


ఏప్రిల్ 7న ఐదుగురు వైద్యుల బృందం ఇక్కడ కరోనా కట్టడికి చర్యలు ప్రారంభించిందని, ధారావిలోని ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ టెస్టులు చేశార్నారు. తరువాత 25 మంది వైద్యులు జతకూడి ఇటువంటి సేవలు ప్రారంభించారు. స్థానికులకు కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. దీంతో కరోనా వైరస్ కొద్దిగా అదుపులోకి వచ్చింది. దీనికితోడు అదే సమయంలో ఇక్కడివారు తమ గ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో ఇక్కడి జనాభా గణనీయంగా తగ్గింది. అయితే ఇప్పుడు వారంతా తిరిగి రావడానికి తోడు, ఇక్కడివారిలో కరోనా అంటే భయం తగ్గిందన్నారు. దీంతో చాలామంది కరోనా నియమనిబంధనలను పాటించడం మానివేశారన్నారు. మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగం మొదలైనవాటిపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో మరోమారు కరోనా విజృంభిస్తున్నదని మనోజ్ జైన్ తెలిపారు.

Updated Date - 2020-09-26T15:41:49+05:30 IST