ఆకస్మిక మరణమా.. గుండె జబ్బు కావొచ్చు!

ABN , First Publish Date - 2022-09-29T16:37:17+05:30 IST

ఇటీవల కాలంలో ఆకస్మిక మరణాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అవుతున్నాయి. వీటికి కరోనానే

ఆకస్మిక మరణమా.. గుండె జబ్బు కావొచ్చు!

నేడు వరల్డ్ హార్ట్‌డే


అన్నింటికీ కరోనానే కారణం కాదు

కొవిడ్‌ అనంతర పరిశోధనల్లో.. 20 రకాల గుండె సమస్యలు గుర్తింపు

80 శాతం పూడికలున్నా వాటితో నిర్ధారించలేం

స్టాటిన్‌, యాస్ర్పిన్‌ అనవసర వాడకం ప్రమాదకరం

‘ఆంధ్రజ్యోతి’తో రమేశ్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ రమేశ్‌బాబు


(విజయవాడ-ఆంధ్రజ్యోతి): ఇటీవల కాలంలో ఆకస్మిక మరణాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అవుతున్నాయి. వీటికి కరోనానే కారణమని చాలామంది భావిస్తున్నారు. ఈ భావన సరికాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆకస్మిక మరణాలకు గురవుతున్న వారిలో 10-15 ఏళ్ల నుంచి గుండె జబ్బు నిగూఢంగా ఉండటమే కారణమని విశ్లేషిస్తున్నారు ప్రముఖ గుండె వైద్య నిపుణులు, రమేశ్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ పి.రమేశ్‌ బాబు. సెప్టెంబరు 29న ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని గుండెపై కొవిడ్‌ అనంతర ప్రభావం, ఆకస్మిక మరణాలు వంటి అంశాలపై రమేశ్‌బాబు ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. 


గుండెపై కొవిడ్‌ అనంతర ప్రభావం

మొదటి, రెండో దశ కొవిడ్‌ వ్యాప్తి సమయంలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోవడం వల్ల గుండెపై ఎక్కువ ప్రభావం పడింది. కొవిడ్‌ ప్రభావంపై జరిగిన పరిశోధనల్లో 20 రకాల గుండె సమస్యలను గుర్తించారు. గుండె దడలాంటి చిన్నపాటి సమస్యల నుంచి గుండెకు రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యం తగ్గిపోవడం వంటి తీవ్ర సమస్యలూ వీటిలో ఉన్నాయి. కొవిడ్‌ సమయంలో, ఆ తర్వాత కూడా చాలామందిలో మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి టాక్టోసుబో కార్డియోమయోపతికి దారితీస్తోంది. దీన్నే స్ట్రెస్‌ కార్డియోమయోపతి అని బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌ అని కూడా అంటారు. దీని కారణంగా గుండెలో రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. సాధారణంగా కొవిడ్‌ తర్వాత నెల పాటు అలసట, తీవ్రమైన దగ్గు, డయేరియా, అబ్డామినల్‌ పెయిన్‌ వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆ లక్షణాలు నెల రోజులపైబడి ఏడాది వరకు కొనసాగితే వాటిని లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలుగా పరిగణిస్తారు. ఈ లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి మందులు వాడటం మంచిది.


టెలీమెడిసన్‌కు ప్రాధాన్యత 

మన శరీరంలో ఏ భాగానికి జబ్బు చేసినా తక్షణ చికిత్స అందకపోయినా ప్రాణాలకు వచ్చే నష్టం ఉండదు. కానీ, గుండె విషయంలో మాత్రం సెకన్లు కూడా చాలా కీలకం. అందుకే గుండెకు ప్లాటినం మినిట్స్‌.. గోల్డెన్‌ అవర్‌ ట్రీట్‌మెంట్‌ ముఖ్యం. భారత్‌ వంటి పెద్ద దేశాల్లో ఆగమేఘాలపై వైద్యం అందడం చాలా కష్టమైన విషయం. అందుకే టెలీమెడిసిన్‌ సేవలను అభివృద్ధి చేసుకోవడం మనలాంటి దేశాలకు శ్రీరామరక్ష. చాతీనొప్పిని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. నొప్పి స్వల్పంగా వచ్చినా దాని తీవ్రత ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది. అందుకే చాతీనొప్పి వచ్చిన 15 నిమిషాల్లో వైద్యులను సంప్రదించడం ముఖ్యం. ఫస్ట్‌ ఎయిడ్‌ సౌకర్యం ఉన్న అంబులెన్సుల్లో వెంటనే ఆస్పత్రికి చేరుకోవాలి. వీలైతే దారిలోనే ఈసీజీని తీసి వైద్యుడికి పంపితే మంచిది. మధుమేహం, బీపీ, అధిక కొలెస్ర్టాల్‌ ఉన్నవారు.. కనీసం 2 నెలలకు ఓసారైనా వైద్యుడిని సంప్రదించాలి. కానీ చాలామంది అలా చేయరు. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే టెలీ మెడిసిన్‌ అత్యుత్తమ మార్గం.


అధిక బరువు తగ్గేందుకు..

బరువు తగ్గేందుకు ప్రస్తుతం కీటో డైట్‌ లాంటివి ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. కానీ బరువు తగ్గేందుకు మన పెద్దలు పూర్వం నుంచీ ఓ అత్యుత్తమ విధానాన్ని పాటించేవారు. మన తాతల తరాన్ని చూస్తే సాయంత్రం 6-7 గంటలకే భోజనం ముగించేవారు. మరుసటి రోజు ఉదయం 11-12 గంటల సమయంలో మళ్లీ భోజనం చేసేవారు. దీన్నే ప్రస్తుతం ఇంటర్మీటెంట్‌ పాస్టింగ్‌ అంటున్నారు. ఇది మంచి ఆహారపు అలవాటు. రోజులో 12 గంటలు కానీ 16 గంటలు కానీ అసలు అహారం ఏదీ తీసుకోకుండా మిగిలిన 12 లేదా 8 గంటల్లో ఆహారాన్ని రెండుసార్లుగా తీసుకోవడం బరువు తగ్గడానికి అత్యంత సులువైన, సురక్షితమైన ఆహార విధానం. అలాగే.. ప్లాంట్‌ బేస్డ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌.. ఉదాహరణకు అవకాడో, నట్స్‌ (బాదం, వాల్‌నట్స్‌ వంటివి), బటర్‌, చీజ్‌, లేత కొబ్బరి లాంటివి శరీరానికి ఉపయోగం. కోడిగుడ్డులో పసుపు సొనను చాలా మంది తినరు. కానీ వారానికి రెండు లేదా మూడు సార్లు దాన్ని తీసుకుంటే మంచిది. అతి.. మితి అన్నవి రెండూ మంచిది కాదు. సమతుల ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం.


కొవిడ్‌ అనంతర ఆకస్మిక మరణాలు

ఆకస్మిక మరణాలకు కొవిడ్‌ కారణమని చాలామంది భావిస్తుంటారు. కానీ, కొన్ని దశాబ్దాలుగా నిత్యం కొన్ని వేలమంది ఆకస్మిక మరణాలకు గురవుతున్నారు. గతంలో వాటికి అంత ప్రచారం ఉండేది కాదు. కొవిడ్‌ తర్వాత అవి విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఇలాంటి మరణాలకు కారణం 10-15 ఏళ్లుగా వారిలో గుండెజబ్బు నిగూఢంగా ఉండటమే. కొవిడ్‌ ముందు, తర్వాత చాలామంది గుండె పనితీరును విశ్లేషించుకునేందుకు ఈసీజీ, 2డీ ఈకో, థ్రెడ్‌మిల్‌ టెస్ట్‌ వంటి సంప్రదాయ పరీక్షలు చేయించుకుని అంతా బాగుందని అనుకుంటున్నారు. వాస్తవానికి ఈ పరీక్షలకూ కొన్ని పరిమితులున్నాయి. గుండె రక్తనాళాల్లో 80 శాతం పూడికలు ఉన్నా వాటి ద్వారా గుర్తించడం కష్టం. కాల్షియం స్కోర్‌ టెస్ట్‌, సీటీ యాంజియోగ్రామ్‌ ద్వారానే గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయా లేదా అన్నది గుర్తించే అవకాశం ఉంటుంది. సీటీ యాంజియోగ్రామ్‌ సురక్షితమైనది. కచ్చితత్వంతో కూడినది. బీపీ, మధుమేహంతో బాధపడేవారు, 30 ఏళ్లు పైబడి.. కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉన్నవారు తరచూ గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిది. స్టాటిన్‌ టాబ్లెట్స్‌ అనవసరంగా వాడటం మధుమేహానికి కారణమవుతుంది. యాస్ర్పిన్‌ టాబ్లెట్స్‌ అనవసర వాడకం అంతర్గత బ్లీడింగ్‌కి కారణమవుతాయి. అది పక్షవాతానికి దారితీసే అవకాశం ఉంది. ఇవన్నీ గుండె సంబంధిత సమస్యలున్నవారు మాత్రమే వైద్యుల సూచన మేరకు వాడటం మంచిది. సొంత వైద్యం ఇతర సమస్యలకు దారితీయవచ్చు. 

Updated Date - 2022-09-29T16:37:17+05:30 IST