ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన.. ఎరువుల దుకాణాల్లో.. ఆకస్మిక తనిఖీలు

ABN , First Publish Date - 2020-08-15T15:13:11+05:30 IST

జిల్లావ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం ఎరువుల దుకాణాలు, గిడ్డంగులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో యూరియా.. ఏదయా అనే కథనంపై అధికారులు స్పందించారు. జేసీ దినేష్‌కుమార్‌ పలు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన.. ఎరువుల దుకాణాల్లో.. ఆకస్మిక తనిఖీలు

నివేదికలు అందజేయాలని జేసీ ఆదేశం

చోబ్రోలులో అమ్మకాలు నిలిపివేత


గుంటూరు (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం ఎరువుల దుకాణాలు, గిడ్డంగులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో యూరియా.. ఏదయా అనే కథనంపై అధికారులు స్పందించారు. జేసీ దినేష్‌కుమార్‌ పలు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. తనిఖీలు చేసి నివేదికలు అందజేయాలని ఆదేశించడంతో ఆకస్మిక తనిఖీలు చేశారు. జిల్లాలో ఉన్న ఎరువుల నిల్వలు, అమ్మకాలపై జేడీ విజయభారతి జేసీకి నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా జేడీ విజయభారతి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 17వేల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు చెప్పారు.  ఎక్కడైనా ఎరువులను అధిక ధరలకు అమ్మినా, యూరియా కావాలంటే ఇతర ఎరువులను కొనాలన్న నిబంధన పెట్టినా రైతులు 8886614102 నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామన్నారు. 


జిల్లాలో సొసైటీలకు ఎరువుల కేటాయింపు, యూరియా కొరతపై డీసీసీబీ చైర్మన్‌ సీతారామంజనేయులు బ్యాంకు ప్రధాన కార్యాలయంలో సీఈవో, ఇతర అధికారులతో సమీక్షించారు. తెనాలి పట్టణంలోని మారీసుపేట ఎరువుల షాపుల్లో మండల వ్యవసాయాధికారి పి.వెంకటనరసయ్య శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. వినుకొండ పట్టణంలోని ఎరువుల షాపుల్లో మండల వ్యవసాయాధికారి వరలక్ష్మి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.  పొన్నూరు మండలంలోని పలు ఎరువులు దుకాణాలను ఏవో బి.ఆడమ్‌ బాబు తనిఖీ చేశారు. చేబ్రోలు మండలంలో నారాకోడూరు, వడ్లమూడి గ్రామాల్లో ఎరువులు దుకాణాలను ఏఈఏ తిరుమలాదేవి తనిఖీ చేశారు. ఫారమ్‌-0 నమోదు చేయని కారణంగా రూ.6,99,712 విలువ కలిగిన ఎరువులు అమ్మకాలను నిలిపివేశారు. 


ఎరువుల కేటాయింపులు పెంచాలి: కేంద్ర మంత్రులకు ఎంపీ జయదేవ్‌ లేఖ

రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరత ఏర్పడిన కారణంగా  కేటాయింపులు పెంచాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమార్‌, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడలకు ఎంపీ గల్లా జయదేవ్‌ లేఖ రాశారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు, యూరియా, కాంప్లెక్స్‌, డీఏపీ కావాలంటే సూక్ష్మ ఎరువులు కొనాల్సిందేనని లింక్‌ పెడుతున్నట్లు కేంద్ర మంత్రులకు లేఖ ద్వారా తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. 

Updated Date - 2020-08-15T15:13:11+05:30 IST