Sep 19 2021 @ 00:04AM

వాళ్లకు సంస్కారం నేర్పితే ఇలాంటివి జరగవు

సండే సెలబ్రిటి

ఒకప్పుడు గ్లామర్‌డాల్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. అయితే ఇప్పుడు ఆమె తీరే వేరు. ‘పింక్‌’ తో సరికొత్త అవతారమెత్తిన ఆమె.. ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తోంది. బాలీవుడ్‌లో మంచి కథానాయికగా పేరు తెచ్చుకుంది. వైవిధ్యమైన పాత్రలు, సందేశాత్మక చిత్రాల్నే ఎంచుకుంటోంది. ముఖ్యంగా బలమైన మహిళా పాత్ర ఉంటే తాప్సీని ఫస్ట్‌ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. చాన్నాళ్ల తర్వాత ఓ తెలుగు సినిమా చేస్తోందామె. అదే ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. ఈ సందర్భంగా తన సినిమా విశేషాలనూ, నిర్మాతగా తన ప్రయాణాన్నీ తాప్సీ ‘నవ్య’తో మాట్లాడింది. 


హాయ్‌ తాప్సీ.. ఎలా ఉన్నారు? 

బాగున్నానండీ. 


రెండేళ్ల  తర్వాత తెలుగులో మీ సినిమా 

విడుదలైంది.


అవునండీ. ‘గేమ్‌ ఓవర్‌’ తర్వాత వచ్చిన సినిమా ఇదే. గతేడాది నేను నటి ంచిన వాటిల్లో హిందీ చిత్రం ‘థప్పడ్‌’ ఒకటే రిలీజయింది. 


ఇంతకు ముందు తెలుగులో మీరు కొన్ని థ్రిల్లర్స్‌ చేశారు. హారర్‌ బేస్‌డ్‌లో ‘ఆనందోబ్రహ్మ’ చేశారు. వాటితో ‘అనబెల్‌..’ సినిమాకు ఏదైనా సారూప్యత ఉందా?

గతంలో ‘ఆనందోబ్రహ్మ’, ‘కాంచన 2’ చేశాను. చేసిన జానర్‌లో మళ్లీ చిత్రాలు చేయడం నాకు ఇష్టం లేదు. ‘కాంచన 2’కు ముందు రాఘవ గారు హారర్‌ కామెడీ స్టోరీ వినిపించారు. కానీ హారర్‌ కామెడీ చేయాలనుకోవడం లేదని చెప్పాను. అయితే ‘అనబెల్‌...’ హారర్‌ కామెడీ కాదు. భయపెట్టే సన్నివేశాలు సినిమాలో లేవు. అందుకే ఆ సినిమా చేద్దామని అనుకున్నాను. ఇదొక ఫాంటసీ మూవీ. దర్శకుడు దీపక్‌ నాకు స్ర్కిప్ట్‌ వినిపించారు. అందులో హారర్‌ ఏమీ లేదు. రీ ఇన్‌కార్నేషన్‌, ఫాంటసీ, కామెడీ ఉంది. మంచి కథ. నాకు స్ర్కిప్ట్‌ బాగా నచ్చింది. అందుకే ఆ స్టోరీకి నో చెప్పలేకపోయాను. ఒక ఏడాదిలో దక్షిణాదిన ఒక్క సినిమా మాత్రమే చేయగలను. అందుకే స్ర్కిప్ట్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాను.  


ఒక సినిమాలో రెండు వైవిధ్యమైన పాత్రలు చేయడం కష్టం కదా? లుక్‌, నటన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

ఇది కొంచెం కష్టమనే చెప్పాలి. ఒకసారి అనబెల్‌ పాత్రలో నటించి, మళ్లీ వెనక్కు వచ్చి రుద్ర పాత్రలో చేయాలంటే కష్టం. సెట్‌లో వెంటవెంటనే ఫోకస్‌ షిఫ్ట్‌ చేయాలంటే కష్టం. అందుకే  రెండు పాత్రల్లో సమాంతరంగా నటించలేదు. దీపక్‌ కూడా ముందు సెట్‌లో అనబెల్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేశాకే, రుద్ర పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెట్టేవారు. 


సేతుపతితో పని చేయడం ఎలా అనిపించింది? కాన్సెప్ట్‌ ఇంప్రువైజేషన్‌, షూటింగ్‌కు సంబంఽధించిన చర్చలు జరిగేవా?

ప్రతి సన్నివేశానికి ముందు మా ఇద్దరి మధ్య చాలా డిస్కషన్స్‌ జరిగేవి. మేం ఎలా చేయాలి? దర్శకుడు మా నుంచి ఎలాంటి నటన కోరుకుంటున్నారు? అనే కోణంలో సాగేవి. కొన్నిసార్లు సన్నివేశం మరింత మెరుగ్గా రావడానికి సెట్‌లో యూనిట్‌ సలహాలు స్వీకరించి, మార్పులు చేసేవాళ్లం.  


అనబెల్‌, రుద్ర... రెండు పాత్రల్లో మీకు ఏది బాగా నచ్చింది? ఏది కష్టమనిపించింది?

అనబెల్‌ పాత్ర నాకు బాగా నచ్చింది. వెరీ స్ట్రాంగ్‌ అండ్‌ ఎలిగెంట్‌ క్యారెక్టర్‌. రెగ్యులర్‌ హీరోయిన్‌ పాత్రలా ఉండదు. తన లుక్స్‌, డ్రెస్సింగ్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది. మానసికంగా కూడా బలంగా ఉంటుంది. రుద్ర  పాత్రలో కూడా కొంచెం కష్టం ఉంది. డ్రమెటిక్‌ క్యారెక్టర్‌. ప్రతిభావంతులైన కమెడియన్లు ఉండడం వల్ల వారి ఎనర్జీ లెవల్స్‌కు తగ్గట్టు నటించాల్సి వచ్చింది. రుద్ర పాత్ర పోషణలో ఛాలెంజింగ్‌గా అనిపించింది. అదే రుద్ర పాత్రను మరింత ఎలివేట్‌ చేసింది. 


‘బ్లర్‌’తో కొత్తగా నిర్మాతగానూ ప్రయాణం ఆరంభించారు. ఆ అనుభవాలు చెప్పండి? 

నటిగా సమయానికి సెట్‌కు వెళ్లి నటించి వస్తే సరిపోయేది. కానీ నిర్మాతగా మనం అందరికంటే ముందే సెట్‌కు వెళ్లాలి. నటించడం అయిపోయాక నిర్మాతగా సినిమా పని ఎంతవరకూ పూర్తయింది, క్వాలిటీ అవుట్‌పుట్‌ వస్తుందా? బడ్జెట్‌లో పని పూర్తయిందా? అనేది అక్కడికక్కడే సమీక్షించుకోవాలి. ప్రాంజల్‌కు నిర్మాతగా 20 ఏళ్ల అనుభవం ఉంది. అన్ని పనులు ఆయనే చక్కగా హ్యాండిల్‌ చేసేవారు. 


నిర్మాతగా మారాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? 

నేను నిర్మాతను అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం నటించడం వరకే నా పని. సినిమాకు సంబంధించిన మిగతా విషయాలను నా పనికాదు అని పట్టించుకునేదాన్ని కాదు. కానీ నిర్మాత మారాక  ప్రతిదానికి బాధ్యత తీసుకోవాలి.. అందర్నీ కలుపుకుంటూ వర్క్‌ చేయాలి. సినిమాపైన అందరికంటే ప్రొడ్యూసర్‌కు ఎక్కువ నియంత్రణ ఉంటుంది. అదీకాక ప్రాంజల్‌ నాకు మంచి స్నేహితుడు. అతని సూచన మేరకు సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించాను. మంచి అనుభవం కలిగిన పార్టనర్‌ దొరకడంతో ముందడుగు వేశాను. 


నిర్మాత అంటే ఒత్తిడి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు ఏమన్నారు?

నా వృత్తిపరమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల జోక్యం ఉండదు. నేను వాళ్లని సలహా అడగను. ఏ నిర్ణయమైనా నా సొంతంగానే తీసుకుంటాను. 


తెలుగులో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సినిమా చేస్తున్నారు. షూటింగ్‌ ఎంతవరకూ వచ్చింది?

నా పాత్రకు సంబంధించి ఇంకా మూడు రోజుల షూటింగ్‌ మిగిలి ఉంది. ఇది కూడా స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే తొలి చిత్రం తరహాలో ఉంటుంది. ఇన్వెస్టిగేషన్‌, ఇంటెలిజెంట్‌ ఫిల్మ్‌. తొలి సినిమాకే వెరీ ఇంటెలిజెంట్‌ స్ర్కిప్ట్‌ రాశాడు. 


మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. సామాజిక అంశాల మీద స్పందిస్తుంటారు. ముఖ్యంగా మహిళా హక్కుల మీద. ‘థప్పడ్‌’ తరహాలో ఏదైనా సినిమా నిర్మించే ఆలోచన ఉందా? 

చాలావరకూ బలమైన వ్యక్తిత్వమున్న మహిళా పాత్రలు చేశాను. ఇప్పుడు ఆ తరహా కథాంశాలతో అవకాశం వస్తే సినిమాలు నిర్మిస్తాను. 


హత్యాచార ఘటనలపై మీరు గతంలో స్పందించారు. ఇప్పటికీ పరిస్థితులు పెద్దగా మారలేదు. దీనిపై మీ స్పందన. 

నేను నా గురించి, నా కుటుంబానికి సంబంధించినంత వరకూ బాధ్యత తీసుకోగలను. ఇంట్లో అబ్బాయిలు ఉంటే ఆడిపిల్లలను గౌరవించడం నేర్పగలను. మన కుటుంబంలోని ఆడపిల్లల బాధ్యత మనమే తీసుకోవాలి. ప్రజల్లో కొంత అవగాహన కల్పించగలను. కానీ ప్రతి ఒక్కళ్లూ వాళ్ల కుటుంబ సభ్యులకు సంస్కారం నేర్పితే ఈ తరహా ఘటనలు జరగవు.

 

ఇప్పుడు ఓటీటీ చాలా పెద్ద మార్కెట్‌. థియేటర్లకు సమాంతరంగా ఓటీటీలో సినిమాలు విడుదలవుతున్నాయి. భవిష్యత్తులో ఓటీటీలతో థియేటర్లకు ముప్పు ఉందా?

కొత్త సాంకేతికత వచ్చిన ప్రతిసారి ఈ మాటే వినిపిస్తుంది. సీడీ, డివీడీలు వచ్చినప్పుడు థియేటర్లు మూతపడతాయన్నారు. ఇప్పుడు ఓటీటీ వచ్చింది. ఓ కొత్త తరహా అనుభూతి కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. లాక్‌డౌన్‌లో టైమ్‌పాస్‌కు టీవీలు, ఓటీటీలో సినిమాలు చూస్తారు. థియేటర్‌లో సినిమా చూడడాన్ని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు. 


సినిమాలతో పోల్చితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో దర్శకుల సృజనకు ఎక్కువ అవకాశం ఉంది కదా? 

‘ఈ సినిమాను చూడొచ్చు’ అని సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇస్తే మీరు థియేటర్‌కు వెళ్లి చూస్తారు. అదే ఓటీటీ అయితే మీరు ఇంట్లో పిల్లలను నియంత్రించాలి. ఏం చూడాలి, చూడకూడదనేది మీ ఛాయిస్‌. అలాగని ఓటీటీలో వచ్చేది అంతా రాంగ్‌ కంటెంట్‌ కాదు. అలాంటి కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు థియేటర్లలో అయినా చూడరు. అయితే రాంగ్‌ కంటెంట్‌ చూడాలనుకునేవారు ఓటీటీ లేకపోయినా ఆగరు. మరో దారి చూసుకుంటారు. రాంగ్‌ కంటెంట్‌  ఓటీటీకి మాత్రమే పరిమితమైనది కాదు.


మీరు ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి చెప్పండి?

‘రష్మీరాకెట్‌’ దసరాకు విడుదలవుతుంది. తర్వాత  ‘లూప్‌లపేటా’,  ‘దొబారా’, మిథాలి రాజ్‌ బయోపిక్‌ ‘శభాష్‌ మిథు’, ‘బ్లర్‌’ చిత్రాలు వరుసగా 

విడుదలవుతాయి. 

చిత్రజ్యోతి డెస్క్‌


ప్రాంజల్‌ నాకు మంచి స్నేహితుడు. అతని సూచన మేరకు సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించాను. మంచి అనుభవం కలిగిన పార్టనర్‌ దొరకడంతో నిర్మాతగా ముందడుగు వేశాను.