
వెంకట్ ప్రభు దర్శకత్వంలో అశోక్ సెల్వన్ నటించిన ‘మన్మథ లీలై’ సినిమా ట్రైలర్‌ను సోమవారం రాత్రి రిలీజ్ చేశారు. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ ఒకటిన విడుదల కానుంది. రాక్‌ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కించిన ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, మాటలను వెంకట్ ప్రభు, మణివణ్ణన్ సుబ్రమణిం కలిసి సమకూర్చారు. ఇందులో అశోక్ సెల్వన్ సరసన సంయుక్తా హెగ్డే, రియా సుమన్, స్మృతి వెంకట్ నటించారు. సంగీతం ప్రేమ్‌జీ అమరన్. ‘మానాడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ద్వారా వెంకట్ ప్రభు క్వికీ పేరుతో నిర్మించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ మంజూరు చేసింది. వీపీ వంటి దర్శకుడు నుంచి ఇలాంటి ట్రైలర్‌ను చూసిన సినిమా ప్రేక్షకులు ఒక్కసారి షాక్‌కు గురై మీమ్స్ ప్రారంభించారు. అయితే, ట్రైలర్ రిలీజ్ వేడుకలో దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ, ‘సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ మంజూరు చేసినప్పటికీ 18 యేళ్ళు పైబడిన ప్రతి ఒక్కరూ, ఫ్యామిలీ ఆడియన్స్, ప్రేమికులు, దంపతులు చూడొచ్చు. పూర్తి హాస్య భరితంగా తెరకెక్కించాం. కథలో రెండు భాగాలుం టాయి. పెళ్లి అయిన తర్వాత ఒక వ్యక్తి చేసిన చిన్న పొరపాటు వల్ల అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.. అనే విషయాలను హాస్యభరితంగా తెరకెక్కించాం.
ఒక డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకు ఇద్దరు కుమార్తెలున్నారు. అడల్ట్ కంటెంట్‌తో ఈ సినిమా రూపొందించలేదు. సినిమాల్లో కొన్ని చోట్ల ముద్దు సీన్లు ఉండొచ్చు. అంతమాత్రాన ఇది అడల్ట్ కంటెంట్ సినిమా కాదు. ప్రతి ఒక్కరూ రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునే చిత్రం. సినిమా చూసేటపుడు లేదా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది కదా.. అని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. చాలా ఫన్నీగా తెరకెక్కించాం’ అని వివరించారు. నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడు పూచ్చి మురుగన్ మాట్లాడుతూ, ’చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషిచేస్తాను. ముఖ్యంగా అసంపూర్తిగా మిగిలిపోయిన నడిగర్ సంఘం భవనాన్ని పూర్తి చేస్తాం’ అని చెప్పారు. అలాగే, హీరో అశోక్ సెల్వన్, హీరోయిన్లు, నిర్మాత మురుగానందం తదితరులు నటించారు.