అలాంటి మార్పే మనవద్దా రావాలి..!

ABN , First Publish Date - 2022-07-06T09:04:48+05:30 IST

ట్రాన్స్‌ మహిళలు అనగానే ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద యాచకులుగానో, శుభకార్యాల్లో డబ్బులు డిమాండ్‌ చేసే వ్యక్తులుగానో భావిస్తాం.

అలాంటి మార్పే మనవద్దా రావాలి..!

ట్రాన్స్‌ మహిళలు అనగానే ట్రాఫిక్‌  సిగ్నళ్ల వద్ద యాచకులుగానో, శుభకార్యాల్లో డబ్బులు డిమాండ్‌ చేసే వ్యక్తులుగానో భావిస్తాం. సమాజం నుంచి తిరస్కృతికి లోనైన వ్యక్తులనే విషయాన్నే మర్చిపోతాం. కానీ ‘తామూ మనుషులమే’ అని నినదిస్తున్నారు ట్రాన్స్‌ మహిళ రచన ముద్రబోయిన. ఆమె యూఎస్‌ ఎంబసీ నుంచి ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్‌ షిప్‌ ప్రోగ్రాంతో పాటు, రెండు సార్లు క్యాలిఫోర్నియా స్టేట్‌ వర్సిటీ ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకున్నారు. అంతర్జాతీయ వేదికపై ట్రాన్స్‌ వ్యక్తుల హక్కుల గళాన్ని వినిపస్తున్న రచన ఉద్యమ జీవితానుభవాలను  


‘నవ్య’ తో పంచుకున్నారిలా..! 

‘ఒక ట్రాన్స్‌ మహిళగా ఈ సమాజం నుంచి సమానత్వమే కాదు, సమభావాన్ని కూడా ఆశిస్తున్నాను. అందుకోసమే ఇరవై ఏళ్లుగా హక్కుల ఉద్యమంతో మమేకమై, అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో నా గొంతు వినిపిస్తున్నాను. ప్రస్తుతం క్యాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు అమెరికాలో ఉన్నాను. ‘ప్రైడ్‌ మంత్‌’ సందర్భంగా ఇక్కడ రోజూ సంబరాలే.! చిన్న కెఫే మొదలు పెద్ద హోటల్‌ వరకూ....ప్రతిచోటా రెయింబో జెండాల రెపరెపలే.! ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధంలేని వ్యక్తులు కూడా దీన్నొక పండుగలా జరుపుకోవడం అమెరికాలో చూస్తున్నాను. లైంగికత ఆధారంగా కాకుండా మనుషులను సమభావంతో చూసే దృక్పథం ఆ దేశంలోని ట్యాక్సీ డ్రైవర్లు మొదలు స్టేట్‌ గవర్నర్ల వరకు... చాలామందిలో కనిపిస్తుంది. ఇలాంటి మార్పే మనవద్దా రావాలి. భారత్‌లోని ట్రాన్స్‌ కమ్యూనిటీ స్థితిగతులపై క్యాలిఫోర్నియా యూనివర్సిటీ అంతర్జాతీయ అధ్యయన  కేంద్రానికి ఇప్పుడు నేనొక పరిశోధనా పత్రాన్ని రాశాను. మూడేళ్ల కిందట అదే విశ్వవిద్యాలయంలో ఉపన్యసించి, అరుదైన గౌరవాన్ని అందుకున్నాను. అంతకు ముందు యూఎస్‌ ఎంబసీ ‘ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్‌ షిప్‌ ప్రోగ్రాం’(ఐవీఎల్పీ)కి నన్ను ఎంపిక చేసింది. అప్పుడు అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో పర్యటించి, ట్రాన్స్‌ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లమీద వివిధ చర్చాగోష్ఠుల్లో పాల్గొన్నాను. ఆ పర్యటన నా ఆలోచనలను మరింత విస్తృతం చేసింది. 


మార్పు మొదలైంది...

ట్రాన్స్‌ మహిళల్లో చాలామంది భిక్షాటన, సెక్స్‌వృత్తి కాకుండా స్వశక్తితో బతికేందుకే ఇష్టపడుతున్నారు. ఏలూరులో ఒకరు వాటర్‌ ప్లాంట్‌ నడుపుతుంటే, హైదరాబాద్‌లో మరో ముగ్గురు వేర్వేరుగా హోటళ్లు నిర్వహిస్తున్నారు. అలాగే కుట్టుమిషన్‌, రొట్టెల తయారీ, కిరాణాకొట్టు తదితర చిరువ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారు. నా మనుమరాలు రూత్‌ మెడిసిన్‌ పూర్తి చేసి, ఇప్పుడు ఒక ఆస్పత్రిలో డాక్టరుగా పనిచేస్తోంది. ఇలా ఒకరా, ఇద్దరా... రకరకాల వృత్తుల్లో రాణిస్తున్నవారు తెలుగు రాష్ట్రాల్లో బోలెడు మంది కనిపిస్తున్నారు. ఇంకొందరు యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. అయితే, మరిన్ని విద్యా, ఉపాధి అవకాశాలు మావాళ్లకు ఉన్నప్పుడే పూర్తి మార్పు సాధ్యమవుతుంది. ఆంధ్రాలో గత ప్రభుత్వం ట్రాన్స్‌ కమ్యూనిటీ సంక్షేమానికి రూ.20 కోట్లు కేటాయించడం దేశంలోనే ఒక విప్లవాత్మకమైన చర్య. ఆ తర్వాత పంజాబ్‌ గవర్నమెంట్‌ కొంత ప్రయత్నించింది. ట్రాన్స్‌ వ్యక్తులకు ఇళ్లు కేటాయించడం, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించడంతో పాటు సంక్షేమానికి ప్రత్యేక పాలసీని తీసుకురావడంలో కేరళ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. అనన్యకుమారి మరణానంతరం అక్కడి ప్రభుత్వం శస్త్రచికిత్సలపై ప్రత్యేక కమిటీ నియామకం మీద నా నుంచి సలహాలు తీసుకున్నారు. అలా మరొకరు మరణించకుండా కేరళ ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురానుంది కూడా. ప్రతినెలా ఫించను, రేషన్‌తో పాటు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించమని తెలంగాణ ప్రభుత్వాన్నీ కోరాం. దురదృష్టవశాత్తూ, ప్రభుత్వాలు మమ్మల్ని ఓటు బ్యాంకుగా మినహా, మనుషులుగా గుర్తించడం లేదనేదే మా బాధంతా.! 


మా బాగోగులు చూసేదెవరు...

ట్రాన్స్‌వ్యక్తులుగా మాలోని ప్రతి ఒక్కరికి గౌరవంగా తలెత్తుకొని బతకాలని ఉంటుంది. కానీ ఈ వ్యవస్థ మాకు ఆ అవకాశం ఇవ్వడంలేదనేదే మా బాధంతా. ప్రతి వస్తువు కొనుగోలు ద్వారా మేమంతా పరోక్షంగా పన్ను కడుతున్నాం. మాలో  ఆదాయపన్ను కడుతున్నవారూ కొందరున్నారు. మరి, మా బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా.! అమెరికాలోని ప్రతి రాష్ట్రం ట్రాన్స్‌ కమ్యూనిటీ సంక్షేమానికి ఏటా భారీగా నిధులు కేటాయిస్తుంది. మరికొన్ని దేశాల్లో అయితే ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కూడా అమలవుతున్నాయి. అదే మన దేశంలో... ట్రాన్స్‌ మహిళ అనగానే అడ్మిషన్‌ను రద్దు చేస్తున్న విద్యాలయాలున్నాయి. మమ్మల్ని సాటి మనుషులుగా చూడలేని దౌర్భాగ్య పరిస్థితి. ట్రాన్స్‌ కమ్యూనిటి సంక్షేమానికి ఒక ప్రత్యేక విధానం ఉండాలి. సమాజానికి ఆవలగా ఉన్నవ్యక్తులను తిరిగి కలిపే ప్రయత్నాలు సాగాలి. అప్పుడే ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద యాచకులుగా, అడ్డాలో సెక్స్‌వర్కర్లుగా ట్రాన్స్‌ వ్యక్తులు కనిపించరు. ఆ మార్పు కోసమే నా పోరాటం. 

కె. వెంకటేశ్‌


ఒకరికొకరు వరసలతో...

మాదైన అస్తిత్వంతో బతకాలనుకున్నప్పుడు మొదట మాకు ఇంటి నుంచే ఘర్షణ ఎదురవుతుంది. చాలాసందర్భాల్లో కుటుంబంలో స్థానం దొరకదు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఒకరికొకరం తోడుగా ట్రాన్స్‌ కమ్యూనిటీ అంతా కలిసి మెలిసి బతుకుతాం. అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ, అక్క, చెల్లి వంటి వరసలతో పిలుచుకుంటాం. అదే ట్రాన్స్‌ మగవాళ్లను అయితే నాన్న, పెదనాన్న, బాబాయి అంటాం. గురుశిష్య పరంపర కూడా కొనసాగుతుంటుంది. 


నా జీవితం-ఉద్యమం

నేను డిగ్రీ పూర్తి అయ్యాక నాదైన అస్తిత్వంలోకి వచ్చాను. అలాంటి సమయంలో ఇంట్లో ఉండటం కాస్త ఇబ్బంది కనుక, బయటకొచ్చి పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ రెండు పీజీలు చదివాను. అయితే, మా కుటుంబం నన్ను ఎన్నడూ తిరస్కరించలేదు. అమ్మ, నాన్న చనిపోయాక కూడా ఆ లోటు తెలియకుండా మా అక్క, చెల్లి నన్ను చూసుకుంటున్నారు. వాళ్లు నన్ను చూసి గర్వపడుతున్నామని అంటుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణ ప్రాజెక్టులో అడ్వకసీ ఆఫీ్‌సగా కొన్నివందలమందికి శిక్షణ ఇచ్చాను. ట్రాన్స్‌ వ్యక్తుల పట్ల మిగతా వాళ్లకున్న సందేహాలు నివృత్తి చేసేందుకు ‘ట్రాన్స్‌ విజన్‌’ యూట్యూబ్‌ చానల్‌ ద్వారా రకరకాల కార్యక్రమాలు నిర్వహించాను. అందుకుగాను ‘లాడ్లీ’ మీడియా అవార్డు అందుకున్నాను. కరోనా సమయంలో ‘సేవ్‌ ఇండియన్‌ ట్రాన్స్‌ లైఫ్స్‌’ క్యాంపెయిన్‌ ద్వారా దేశవ్యాప్తంగా కొన్నివందల మందికి సహాయం చేయగలిగాం. ‘పరివార్‌ బే ఏరియా’ సంస్థతో పాటు మరికొన్ని ఎన్జీవోల సహకారంతో పాతికమందికి జీవనోపాధి చూపించాం.  ‘తెలంగాణ మహిళా ట్రాన్స్‌జెండర్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ’లోనూ భాగస్వామినయ్యాను. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ పోరాటం, రైతు ఉద్యమాల్లోనూ పాల్గొన్నాను. నా అభిప్రాయాలను, ఆలోచనలను ‘టెడెక్స్‌ టాక్స్‌’లోనూ పంచుకున్నాను. 

Updated Date - 2022-07-06T09:04:48+05:30 IST