జిల్లాలో విజయవంతంగా ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’

ABN , First Publish Date - 2021-08-05T05:12:00+05:30 IST

జిల్లాల్లో జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన 7వ విడత ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని ఎస్పీ రాజేశ్‌చంద్ర పేర్కొన్నారు.

జిల్లాలో విజయవంతంగా ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’
జిల్లాకు వచ్చిన కేంద్ర బలగాలతో మాట్లాడుతున్న ఎస్పీ

ఆదిలాబాద్‌టౌన్‌, ఆగస్టు 4: జిల్లాల్లో జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన 7వ విడత ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని ఎస్పీ రాజేశ్‌చంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఎస్పీ పర్యవేక్షణలో టీసీపీయూ, ఉట్నూర్‌, ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి అధికారులు ఐసీపీఎస్‌, లేబర్‌ ఆఫీసర్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, డబ్ల్యూసీడీ అండ్‌ ఎస్సీ అధికారుల సహకారంతో జూలై 1న ఆపరేషన్‌ ముస్కాన్‌ బృందం తన కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. రెండు సబ్‌ డివిజన్ల పరిధిలో ఎస్సై నేతృత్వంలో పట్టణాలు, మండల కేంద్రాలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి 72 మంది పిల్లలను సురక్షితంగా రక్షించారన్నారు. అదే విధంగా పట్టణంలో 30 ప్రాంతాల్లో దాడులు, తనిఖీలు నిర్వహించి 42 మంది బాల బాలికలకు విముక్తి కలిగించడం జరిగిందన్నారు. చిన్నారుల్లో 11 మంది పదేళ్ల లోపు వయస్సు వారు కాగా, మిగతా 11 నుంచి 18ఏళ్ల వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ ముస్కాన్‌లో డీసీపీవో రాజేంద్రప్రసాద్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారి వెంకటస్వామి, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

జిల్లాలో ర్యాపిడ్‌యాక్షన్‌ ఫోర్స్‌ బలగాల పర్యటన

జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలు పర్యటించి శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాయాని ఎస్పీ రాజేశ్‌చంద్ర పేర్కొన్నారు. బుఽదవారం జిల్లాకు రెండు కంపెనీల బలగాలు చేరుకుని ఇన్‌చార్జి డిప్యూటీ కమాండర్‌ అలోక్‌కుమార్‌ క్యాంపు కార్యాలయంలో ఎస్పీని కలిసి రిపోర్టు చేశారు. అనంతరం బలగాలకు స్థానిక పోలీసు శిక్షణ కేంద్రంలో వసతి కల్పించారు.  ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 9 వరకు జిల్లలోని అన్ని మండల కేంద్రాల్లో గల సమస్యాత్మాక ప్రాంతాల్లో పర్యటన షెడ్యూలు ఖరారు చేసినట్లు తెలిపారు. మొదటి రోజు స్థానిక వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని సమస్యాత్మాక ప్రాంతాల్లో ప్లాగ్‌ మార్చి చేస్తూ పర్యటిస్తారన్నారు. రెండో రోజు ఇచ్చోడ, నేరడిగొండ మండల కేంద్రాల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రార్థన స్థలాల వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తారన్నారు. 3 రోజు ఉట్నూర్‌, నార్నూర్‌ మండల కేంద్రంలోని సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో నేరుగా కలిసి సమస్యలను తెలుసుకుంటారని వివరించారు. 4వ రోజు బోథ్‌, బజార్‌హత్నూర్‌ మండల కేంద్రాల్లో పర్యటించి అన్నివర్గాల ప్రజలతో సమావేశమై మాట్లాడుతారని చివరి రోజున ఇంద్రవెల్లి, గుడిహత్నూర్‌ మండలాల్లో పర్యటించి గ్రామ మతపెద్దలతో కలిసి శాంతి భద్రతల పరిరక్షణ, స్థానిక సమస్యలపై చర్చిస్తూ అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి పర్యటన వివరాలను ప్రజలకు వివరిస్తారన్నారు. సమావేశంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ మల్లేష్‌, ఆర్‌ఏఎఫ్‌ ఇన్‌స్పెక్టర్లు సీకే రెడ్డి, వంద మంది కేంద్ర బలగాలు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-05T05:12:00+05:30 IST