ఆహా.. సాహా!

ABN , First Publish Date - 2020-10-28T09:19:30+05:30 IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. బ్యాట్‌తోనూ, బంతితో ఢిల్లీ క్యాపిటల్స్‌ను బెంబేలెత్తించింది. వృద్ధిమాన్‌ సాహా, డేవిడ్‌ వార్నర్‌ ఆకాశమే

ఆహా.. సాహా!

అదరగొట్టిన వార్నర్‌, మనీష్‌

ఢిల్లీపై సన్‌రైజర్స్‌ సమష్టి విజయం


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. బ్యాట్‌తోనూ,  బంతితో ఢిల్లీ క్యాపిటల్స్‌ను బెంబేలెత్తించింది. వృద్ధిమాన్‌ సాహా, డేవిడ్‌ వార్నర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. ప్రత్యర్థి ముందు భారీ స్కోరు ఉంచింది. వీరిద్దరి దెబ్బకు లీగ్‌లో నిలకడగా రాణిస్తున్న పేసర్‌ రబాడ సైతం దిక్కులు చూడాల్సి వచ్చింది. అయితే, ఢిల్లీ బౌలర్లు విఫలమైన చోట రషీద్‌ మాయాజాలంతో సన్‌రైజర్స్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకొంది. వరుసగా మూడో ఓటమితో పాయింట్ల పట్టికలో ఢిల్లీ మూడో స్థానానికి పడిపోగా.. ఈ విజయంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సన్‌రైజర్స్‌ సజీవంగా ఉంచుకొంది. 



దుబాయ్‌: వార్నర్‌ సేన దెబ్బకు ఢిల్లీ తల్లడిల్లింది. వృద్ధిమాన్‌ సాహా (45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87), వార్నర్‌ (34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) అర్ధ శతకాల విధ్వంసానికి బౌలర్ల ప్రదర్శన తోడవడంతో.. ఐపీఎల్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 88 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 219/2తో భారీ స్కోరు చేసింది. అశ్విన్‌, నోకియా చెరో వికెట్‌ పడగొట్టారు. ఛేదనలో రషీద్‌ ఖాన్‌ (4-0-7-3) మాయాజాలానికి ఢిల్లీ 19 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. రిషభ్‌ పంత్‌ (36) టాప్‌ స్కోరర్‌. సందీప్‌, నటరాజన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సాహా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 


పెవిలియన్‌కు క్యూ: భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ ముందుగానే చేతులెత్తేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచడంతో.. క్యాపిటల్స్‌ ఏదశలోనూ మ్యాచ్‌లోకి రాలేదు. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడంతో క్యాపిటల్స్‌ పతనం ఆరంభమైంది. సందీప్‌ బౌలింగ్‌లో ఫ్లిక్‌ చేసే క్రమంలో బంతి ఎడ్జ్‌ తీసుకోవడంతో వార్నర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లో ప్రమాదకర స్టొయినిస్‌ (5)ను నదీమ్‌ పెవిలియన్‌ చేర్చాడు. అయితే, మరో ఓపెనర్‌ రహానె (26), హెట్‌మయర్‌ (16) జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. అదనుచూసి ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డును నడిపించారు. ఆరో ఓవర్‌లో హోల్డర్‌ బౌలింగ్‌లో హెట్‌మయర్‌ 4,4 బాదగా రహానె సిక్స్‌ కొట్టడంతో ఆ ఓవర్‌లో 20 పరుగులు లభించాయి. ఆ తర్వాతి ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన రషీద్‌ డబుల్‌ వికెట్లతో ఢిల్లీని కోలుకోలేని దెబ్బతీశాడు. తొలి బంతికే హెట్‌మయర్‌ను బౌల్డ్‌ చేసిన రషీద్‌.. ఐదో ఒంతికి రహానెను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 54/4తో టాపార్డర్‌ వికెట్లను చేజార్చుకున్న ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (7) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరగ్గా.. అక్షర్‌ పటేల్‌ (1)ను రషీద్‌ క్యాచ్‌ అవుట్‌ చేశాడు. రబాడ (3)ను నటరాజన్‌ బౌల్డ్‌ చేయగా.. పంత్‌ను సందీప్‌ పెవిలియన్‌ చేర్చాడు. అశ్విన్‌ (7)ను హోల్డర్‌ వెనక్కిపంపగా.. నోకియా (1)ను అవుట్‌ చేసిన నటరాజన్‌ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ముగించాడు. 


సాహా, వార్నర్‌ ఊచకోత: వృద్ధిమాన్‌ సాహా క్లాస్‌ ఆటకు డేవిడ్‌ వార్నర్‌ విధ్వంసం తోడవడంతో సన్‌రైజర్స్‌ భారీస్కోరు చేసింది. తొలి వికెట్‌కు వీరిద్దరూ 107 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపారు. ఆఖర్లో మనీష్‌ పాండే (31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 44 నాటౌట్‌) కూడా ఓ చేయి వేయడంతో హైదరాబాద్‌ స్కోరు 200 పరుగుల మార్క్‌ దాటింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే అరంభాన్నిచ్చారు. ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడడంతో స్కోరు బోర్డు రేసు గుర్రంలా పరుగులు పెట్టింది. బెయిర్‌ స్టో గైర్హాజరీలో వార్నర్‌కు జోడీగా దిగిన సాహా.. తొలి ఓవర్‌లోనే ఫోర్‌ బాదాడు. అశ్విన్‌ వేసిన 3వ ఓవర్‌లో వార్నర్‌ సిక్స్‌తో భారీ షాట్లకు తెరలేపాడు. ఆరో ఓవర్‌లో రబాడ బౌలింగ్‌లో 4,4,6,4,4తో శివాలెత్తిన వార్నర్‌ మొత్తం 22 పరుగులు పిండుకోవడంతోపాటు అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్‌ వికెట్‌ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. అయితే, జోరుమీదున్న వార్నర్‌ను అశ్విన్‌ క్యాచ్‌ అవుట్‌ చేసి ఢిల్లీకి బ్రేకిచ్చాడు. కానీ, మనీష్‌ పాండేతో కలసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించిన సాహా.. రెండో వికెట్‌కు 29 బంతుల్లో 63 పరుగులు జోడించాడు. 11వ ఓవర్‌లో ఫోర్‌తో వృద్ధిమాన్‌ అర్ధ శతకం సాధించాడు. ఎడాపెడా షాట్లతో విరుచుకుపడుతున్న సాహాను నోకియా క్యాచ్‌ అవుట్‌ చేశాడు. డెత్‌ ఓవర్లలో బ్యాట్‌ ఝుళిపించిన పాండే.. కేన్‌ విలియమ్సన్‌ (11 నాటౌట్‌)తో కలసి మూడో వికెట్‌కు అజేయంగా 49 పరుగులు జోడించి జట్టు భారీస్కోరుకు దోహదం చేశాడు. 


వార్నర్‌.. సూపర్‌

పంత్‌ అవుట్‌ విషయంలో బర్త్‌డే బాయ్‌ డేవిడ్‌ వార్నర్‌ అద్భుతంగా డీఆర్‌ఎ్‌సను ఉపయోగించుకున్నాడు. సందీప్‌ శర్మ వైడ్‌ బంతిని వేయగా.. పంత్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు గోస్వామి ఆ బంతిని అందుకున్నాడు. బ్యాట్‌ తగిలిన శబ్దం రావడంతో ఫీల్డర్లు అప్పీలు చేసినా.. అంపైర్‌ తిరస్కరించాడు. దీంతో వైడ్‌ లేదా అవుట్‌ కోసం వార్నర్‌ రివ్యూ అడిగాడు. బ్యాట్‌కు బంతి తగిలినట్టు కనిపించడంతో థర్డ్‌ అంపైర్‌ అవుట్‌ ఇచ్చాడు. అంపైర్‌ కూడా తెల్లబోయాడు. దీంతో వార్నర్‌ ఆల్‌టైమ్‌ బెస్ట్‌ రివ్యూ అడిగాడని కామెంటేటర్లు కూడా ప్రశంసించారు.  


ఓ బ్యాట్స్‌మన్‌ (వార్నర్‌) పవర్‌ప్లేలోపలే అర్ధ సెంచరీ సాధించడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. ఓవరాల్‌గా ఆరోసారి.


ఈ సీజన్‌లో రషీద్‌ ఖాన్‌ (4-0-7-3) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు


ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ ఆలౌటవడం ఇదే మొదటిసారి. 


స్కోరు బోర్డు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్‌ (సి) అక్షర్‌ పటేల్‌ (బి) అశ్విన్‌ 66, వృద్ధిమాన్‌ సాహా (సి) శ్రేయాస్‌ (బి) నోకియా 87, మనీష్‌ పాండే (నాటౌట్‌) 44, కేన్‌ విలియమ్సన్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 219/2; వికెట్ల పతనం: 1-107, 2-170; బౌలింగ్‌: నోకియా 4-0-37-1, రబాడ 4-0-54-0, అశ్విన్‌ 3-0-35-1, అక్షర్‌ పటేల్‌ 4-0-36-0, తుషార్‌ దేశ్‌పాండే 3-0-35-0, స్టొయినిస్‌ 2-0-15-0.

 

ఢిల్లీ క్యాపిటల్స్‌: రహానె (ఎల్బీ) రషీద్‌ 26, ధవన్‌ (సి) వార్నర్‌ (బి) సందీప్‌ 0, స్టొయినిస్‌ (సి) వార్నర్‌ (బి) నదీమ్‌ 5, హెట్‌మయెర్‌ (బి) రషీద్‌ 16, రిషభ్‌ పంత్‌ (సి) గోస్వామి (బి) సందీప్‌ 36, శ్రేయాస్‌ అయ్యర్‌ (సి) విలియమ్సన్‌ (బి) శంకర్‌ 7, అక్షర్‌ పటేల్‌ (సి) పరాగ్‌ (బి) రషీద్‌ 1, రబాడ (బి) నటరాజన్‌ 3, ఆర్‌.అశ్విన్‌ (సి) సమద్‌ (బి) హోల్డర్‌ 7, దేశ్‌పాండే (నాటౌట్‌) 20, నోకియా (సి) పరాగ్‌ (బి) నటరాజన్‌ 1, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 19 ఓవర్లలో 131 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-1, 2-14, 3-54, 4-55, 5-78, 6-83, 7-103, 8-103, 9-125; బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-27-2, నదీమ్‌ 1-0-8-1, హోల్డర్‌ 4-0-46-1, రషీద్‌ ఖాన్‌ 4-0-7-3, నటరాజన్‌ 4-0-26-2, విజయ్‌ శంకర్‌ 1.5-0-11-1, వార్నర్‌ 0.1-0-2-0.

Updated Date - 2020-10-28T09:19:30+05:30 IST