విజయీభవ

ABN , First Publish Date - 2022-10-05T05:34:06+05:30 IST

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయ దశమి వేడుకలకు జిల్లా ముస్తాబైంది. ఇప్పటికే సొంతూళ్లకు చేరుకున్న ఆడపడుచులతో ఇళ్లన్నీ సందడిగా మారాయి.

విజయీభవ
రద్దీగా మారిన జిల్లాకేంద్రంలోని ప్రకాశంబజార్‌

 చెడుపై విజయం.. విజయదశమి 

 నేటి దసరా సంబురాలకు జిల్లా ముస్తాబు

 ఆలయాల్లో శమీ పూజలకు సర్వంసిద్ధం

నల్లగొండ కల్చరల్‌, అక్టోబరు 4: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయ దశమి వేడుకలకు జిల్లా ముస్తాబైంది. ఇప్పటికే సొంతూళ్లకు చేరుకున్న ఆడపడుచులతో ఇళ్లన్నీ సందడిగా మారాయి. అన్ని ఆలయాలను విద్యుత్‌ దీపాలు, తీరొక్క పూలతో అందంగా ముస్తాబు చేశారు. బుధవారం దసరాను పురస్కరించుకొని ఆయా దేవాలయాల్లో ఆయుఽధ, శమీవృక్ష, వాహన పూజలు సంప్రదాయరీతిలో కొనసాగనున్నాయి. 5 నుంచి 25 ఫీట్ల ఎత్తయిన రావణాసుర విగ్రహాలను దసరా వేడుకల్లో దహనం చేయనున్నారు. ఇందుకోసం ప్రధాన కూడళ్లలో ఏర్పాట్లు చేశారు. పండుగ కొనుగోళ్లతో మంగళవారం జిల్లాకేంద్రంతోపాటు అన్నీ ప్రాంతాల్లోని మార్కెట్లు కిక్కిరిశాయి. పండుగ ప్రయాణాల నేపథ్యంలో రహదారులపై ట్రాఫిక్‌ పెరిగింది. మద్యం విక్రయాలు, ఊహించనంతగా పెరగ్గా, మాంసం, చికెన్‌ సెంటర్లలో కూడా భారీగా కొనుగోళ్లు ఉండనుండడంతో నిర్వాహకులు కూడా అంతేస్థాయిలో మాంసం ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నారు. 


కొనుగోళ్లతో సందడే సందడి 

దసరా పండుగను పురస్కరించుకొని జిల్లాల్లోని మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. మూడు, నాలుగు రోజులుగా ఎక్కడ చూసినా దుకాణాలన్నీ బిజీగా మారాయి. కొన్ని దుకాణాల యజమానులు డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. వస్త్ర దుకాణాలు, లేడీస్‌ ఎంపోరియంలు, కిరాణ దుకాణాలు, బాణాసంచా దుకాణాలు సరికొత్త స్టాక్‌తో దర్శనమిస్తున్నాయి. దసరా, దీపావళి సీజన్‌కావడంతో ప్రతీరోజు లక్షల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. జిల్లాకేంద్రంలోని ప్రకాశంబజార్‌, వస్త్రలత బజార్‌, ఎస్పీటీ, ఎల్‌పీటీ మార్కెట్లలో వ్యాపారసంస్థలు కొనుగోళ్లతో బిజీగా మారాయి. ఎన్జీ కళాశాల మైదానంలో టపాకాయల రిటైల్‌ హోల్‌సేల్‌ దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారు. 


గొప్ప సంప్రదాయం మనది : గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ 

దసరా పండుగ రోజున పాలపిట్టను దర్శించుకొని పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే గొప్ప సంప్రదాయం మనది. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకుంటూ అలయ్‌ బలయ్‌ తీసుకుంటూ ప్రేమాభిమానాలను చాటుకోడం మంచి ఆనవాయితీ. ప్రజలందరు ఆనందంగా పండుగను జరుపుకోవాలి.


విజయదశమి స్ఫూర్తి కొనసాగాలి : గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి

విజయాలకు ప్రతిబింబంగా జరుపుకునే విజయదశమి స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగాలి.  తెలంగాణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నేతృత్యంలో ప్రభుత్వం సాధించిన విజయాలు దేశప్రగతికి దిక్సూచి కావాలి. దేశాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వం అవసరం. 


ఆనందంగా జరుపుకోవాలి : కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, నల్లగొండ

దసరా పండుగను ఆనందంగా జరుపుకొని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవనం సాగించాలి. దసరా రోజున ప్రజలు జమ్మిచెట్టుకు పూజలు చేసే సంస్కృతి తెలంగాణ ప్రజలకు ఉంది. పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలి. ఎలాంటి అల్లర్లు జరగకుండా జాగ్రత్త వహించాలి. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు.

Updated Date - 2022-10-05T05:34:06+05:30 IST