Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తే విజయాలు మీవెంటే

నిజామాబాద్‌అర్బన్‌, డిసెంబరు 4: దివ్యాంగులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, ఎందులోనూ ఎవరికన్నా తక్కువకాదని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జిల్లా మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, మేయర్‌ నీతూ కిరణ్‌తో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి నుంచి ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సమస్యలపై వచ్చిన దివ్యాంగుల సమస్యలు మొదట విన్న తర్వాతనే ఇతరుల సమస్యలను వినాలని, అందుకు ఉత్తర్వులు జారీచేయాలని కలెక్టర్‌ను మంత్రి కోరారు. దివ్యాంగులను అవమానపర్చే విధంగా ఎవరు మాట్లాడిన మొదట ఫిర్యాదు స్వీకరించి విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇది కూడా వెంటనే అమలు కావాలన్నారు. జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు సూచన మేరకు ప్రతి కార్యాలయంలో దివ్యాంగుల రెండు కుర్చీలను రిజర్వ్‌చేసి పెట్టాలన్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులను ప్రోత్సహిస్తూ విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు అనేక పథకాలను వారికి రిజర్వేషన్లు ఇస్తున్నట్లు తెలిపారు. అంతకముందు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ కొణిజేట్టి రోశయ్య అకాల మృతిపట్ల మంత్రి, తదితరులు సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం సూపర్‌వైజర్‌లకు, అంగన్‌వాడీ టీచర్లకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, దివ్యాంగులకు బ్యాటరితో నడిచే వీల్‌ చైర్స్‌, ఎలక్ర్టానిక్‌ ట్రై సైకిళ్లను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు సూదం లక్ష్మి, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌, ఈగ గంగారెడ్డి, డీసీపీ అర్వింద్‌బాబు, డీపీవో జయసుధ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి ఝాన్సీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement