విజయం నాదే: టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి

ABN , First Publish Date - 2021-04-16T07:44:59+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీకి..

విజయం నాదే: టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి

తిరుపతి(ఆంధ్రజ్యోతి): తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీకి సానుకూల వాతావరణం కనిపిస్తోందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి అభిప్రాయపడ్డారు. ప్రజల్లో మార్పు మొదలైందన్న ఆమె ప్రచారంలో వివిధ ప్రాంతాల నుంచి తన దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారానికి తన వంతు కృషి ఎలా ఉండబోతోంది అన్న అంశాలపై ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ‘తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌తో కలసి విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నాం. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, గడిచిన రెండేళ్ల వైసీపీ పాలనలో వైఫల్యాలు, ధరలను అదుపుచేయలేని పరిస్థితి ప్రజల దృష్టికి తెచ్చాం. వారు కూడా పలు సమస్యలను నా దృష్టికి తెచ్చారు.


తిరుపతిలో అంతర్జాతీయ రైల్వేస్టేషన్‌, అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రకటనలకే పరిమితమయ్యాయన్న ఆవేదన ప్రజల నుంచి వ్యక్తమైంది. శ్రీకాళహస్తి-నడికుడి రైల్వేలైను పనులు వేగవంతం చేయాలని, నేలపట్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. వెంకటగిరిలో చేనేత కార్మికులకు వర్క్‌షెడ్లు, టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. సర్వేపల్లి పరిధిలోని కృష్ణపట్నం పోర్టు, సత్యవేడు పరిధిలోని శ్రీసిటీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదనే ఆవేదన ఆ ప్రాంత యువకుల నుంచి వ్యక్తం అయ్యింది. వైసీపీకి 22మంది ఎంపీలు ఉన్నా ఇన్నాళ్లూ వీటిపై దృష్టి పెట్టలేదు. నన్ను గెలిపిస్తే వీటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా పోరాడతా’ అని పనబాక లక్ష్మి చెప్పారు.

Updated Date - 2021-04-16T07:44:59+05:30 IST