పేదలపై ప్రేమ ఉంటే గ్యాస్‌పై సబ్సిడీ ఇవ్వండి

ABN , First Publish Date - 2021-10-26T08:45:40+05:30 IST

బీజేపీ ప్రభుత్వానికి పేదలపై ప్రేమ ఉంటే గ్యాస్‌ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. రూ.500 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర ను రూ.1000కి పెంచింది.. సబ్సిడీ ఎగ్గొట్టింది బీజేపీ కాదా?

పేదలపై ప్రేమ ఉంటే గ్యాస్‌పై సబ్సిడీ ఇవ్వండి

  •  బీజేపీ నేతలు చెబుతున్నవన్నీ అబద్ధాలే
  • దళితబంధుపై అనుమానాలు అవసరం లేదు: మంత్రి హరీశ్‌


వీణవంక/కమలాపూర్‌/ఇల్లందకుంట, అక్టోబరు 25: బీజేపీ ప్రభుత్వానికి పేదలపై ప్రేమ ఉంటే గ్యాస్‌ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. రూ.500 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర ను రూ.1000కి పెంచింది.. సబ్సిడీ ఎగ్గొట్టింది బీజేపీ కాదా?అని నిలదీశారు. బీజేపీకి ఓటు వేయడమంటే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. కరీంనగర్‌ జిల్లాలోని వీణవంక, చల్లూరు, ఇల్లందకుంటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీణవంకలో సమావేశం పెట్టి బీజేపీ నాయకులు చెప్పినవన్నీ తొండి మాటలేనని విమర్శించారు. ఒకే నెలలో 18 సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయని విమర్శించారు. క్రూడాయిల్‌ ధరలు పెరగడం వల్ల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయం టూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమేనా? అని నిలదీశారు.


పెట్రోల్‌, డీజిల్‌ ధరలో రూ.32లు కేంద్రానికి పోతున్నాయని, ఇది రైతులపై భారం మోపడం కాదా? అని ప్రశ్నించారు. గ్యాస్‌ సిలిండర్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.291 వస్తాయంటూ దొంగ మాటలు చెప్పిన ఈటల.. నిరూపించాలని తాను సవాల్‌ విసిరే సరికి పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర నవంబరు 2న రూ.1,250 కానుందని, మరో ఏడాదైతే రూ.2వేలు అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ కిట్‌లో కేంద్రం రూ.5వేలు ఇస్తుందని అంటున్నారని, అదే నిజమైతే ఇతర రాష్ట్రాల్లో ఆ పథకం ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. ఈటలది నోరేనా? మోరీనా? అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. మంత్రిగా ఉండి ఈటల హైదరాబాద్‌లో మెడికల్‌ కాలేజీ కట్టుకున్నాడు కానీ.. హుజూరాబాద్‌కు ఒక్క డిగ్రీ కాలేజీ తేలేకపోయారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వాళ్లు కావాలా? గల్లీలో ఉండి పనిచేసే వాళ్లు కావాలా? తేల్చుకోవాలన్నారు. దళితబంధు పథకాన్ని గ్రౌండింగ్‌ చేయకపోతే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు. కాగా, కమలాపూర్‌లో గ్యాస్‌ బండకు దండం పెట్టు.. బీజేపీని బొంద పెట్టు నినాదంతో డమ్మీ సిలిండర్లతో టీఆర్‌ఎస్‌ ప్రచారం నిర్వహించింది.

Updated Date - 2021-10-26T08:45:40+05:30 IST