ఒకటే బస్తా!

ABN , First Publish Date - 2021-06-21T04:40:05+05:30 IST

జిల్లాలో అనేక మంది రైతులు విత్తనాల కోసం పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం అరకొరగా సరఫరా చేయడంతో.. ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో వరిసాగు లక్ష్యం 2.38 లక్షల హెక్టార్లని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ ఏడాది కరోనా కష్టాల నడుమ సాగుకు సమాయత్తమవుతున్న రైతులకు ప్రభుత్వం నుంచి విత్తనాలకు అదనంగా రాయితీలు వస్తాయని.... తమకు కావలసిన విత్తనాలు పంపిణీ చేస్తారని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఖరీఫ్‌లో విత్తన యాతన తప్పేలా లేదు.

ఒకటే బస్తా!
బూర్జపాడులో రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న దృశ్యం

 రాయితీ విత్తనాలు ఎకరానికే పరిమితం

ఎక్కువ కావాలంటే బహిరంగ మార్కెట్లే గతి

పెరిగిన ధరలతో రైతులపై ఆర్థిక భారం

(ఇచ్ఛాపురం రూరల్‌)

జిల్లాలో అనేక మంది రైతులు విత్తనాల కోసం పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం అరకొరగా సరఫరా చేయడంతో.. ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో వరిసాగు లక్ష్యం 2.38 లక్షల హెక్టార్లని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ ఏడాది కరోనా కష్టాల నడుమ సాగుకు సమాయత్తమవుతున్న రైతులకు ప్రభుత్వం నుంచి విత్తనాలకు అదనంగా రాయితీలు వస్తాయని.... తమకు కావలసిన విత్తనాలు పంపిణీ చేస్తారని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఖరీఫ్‌లో విత్తన యాతన తప్పేలా లేదు. ఈ ఏడాది సాగుకు నిర్ణయించిన లక్ష్యం ప్రకారం వరి విత్తనాలు 1.57 లక్షల క్వింటాళ్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. 77,200 క్వింటాళ్లను రాయితీపై సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది. మిగతా 80 వేల క్వింటాళ్లు పూర్తి ధరలకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏటా పట్టాదారు పాసు పుస్తకం చూపిస్తే అందులో ఉన్న భూమి ఆధారంగా కావలసిన విత్తనాలు ఇచ్చేవారు. పెద్దగా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పని ఉండేది కాదు. పది ఎకరాలు పైబడి ఉన్న రైతులే బహిరంగ మార్కెట్లో విత్తనాలు కొనుగోలు చేసేవారు. కానీ ఈసారి చిన్న రైతులకు కూడా విత్తనాలు పూర్తి స్థాయిలో దొరికే పరిస్థితి లేదు. 


ఎకరానికి ఒక బస్తా మాత్రమే

రైతుకు 1.90 ఎకరాలు ఉన్నా... ప్రస్తుతం ఒక బస్తా విత్తనాలు (30 కిలోలు) మాత్రమే అందిస్తున్నారు. ఇవి ఎకరానికి మాత్రమే సరిపోతాయి. పైగా గతంలో కాకుండా విత్తనాలు కావాలంటే ముందుగా సచివాలయాల వద్ద పేర్లు నమోదు చేసుకుని డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే విత్తనాలు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. వీటి ఆధారంగా సచివాలయాలకు వ్యవసాయశాఖ విత్తనాలు పంపిస్తుంది. ఏపీసీడ్స్‌ ద్వారా వచ్చే విత్తనాలను అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఆధ్వర్యంలో అందిస్తారు. అంటే గతం మాదిరి కాకుండా ఎంతమంది రైతులు డబ్బులు చెల్లిస్తే వారికి మాత్రమే విత్తనాలు సచివాలయాలకు పంపిస్తారు. 


పెరిగిన విత్తన ధరలు : 

ఈ ఏడాది కర్ఫ్యూతో ఆర్థిక ఇబ్బందులు చవిచూస్తున్నామని... ప్రభుత్వం విత్తనాలు ధర పెంచడంతో మరిన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న విత్తనాలు గత ఏడాది కన్నా 17 నుంచి 20 శాతం వరకు ధరలు పెరిగాయి. ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు చాలక ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధరల నియంత్రణపై అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.


రాయితీ పోనూ ధరలు ఇలా..

విత్తనం రకం,  పరిమాణం(కిలోల్లో). గతేడాది రూ.  ఈ ఏడాది రూ.     భారం

శ్రీధృతి             30               692.40        834.30          141.90

స్వర్ణ               30               699.60        845.10          145.50

సోనామసూరి      30               696.60        827.40          130.80

ఇంద్ర              30               699.60        845.10          145.50 

అమర             30               699.60        845.10          145.50 

శ్రీకాకుళం సన్నాలు 30               706.50        835.20          128.70 

సాంబమసూరి     30               597.50        702.50          150.00     


రైతులందరికీ  అందజేస్తాం 

ప్రతి సంవత్సరంలాగే రైతులకు 75 శాతం విత్తనాలు సరఫరా చేస్తున్నాం. మిగతా విత్తనాలు రైతులు సొంతగా సమకుర్చుకుంటున్నారు. రవాణా, ఇతర ఖర్చులు పెరగడం వల్ల ఆ మాత్రం పెంపు సాధారణం. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా చేయూత ఇస్తోంది.

- కె.శ్రీధర్‌, జేడీ, వ్యవసాయశాఖ, శ్రీకాకుళం

Updated Date - 2021-06-21T04:40:05+05:30 IST