నాసిరకం..

ABN , First Publish Date - 2020-05-29T10:08:33+05:30 IST

సబ్సిడీ వేరుశనగ విత్తనాలు నాసిరకంగా ఉన్నా.. రైతులకు బలవంతంగా మోసంతో అంటగట్టే కుతంత్రం రచించారన్న ..

నాసిరకం..

అంటగట్టే కుతంత్రం!

విత్తన పంపిణీలో వింత నిబంధనలు

నాసిరకంగా ఉన్నా.. వెనక్కి పంపకుండా తెరవెనుక పావులు

ఒక్కసారిగా 974 క్వింటాళ్ల వేరుశనగ తేలటంతో ఉలికిపాటు

ఏఓలకు నాసిరకం విత్తనాన్ని నేరుగా వెనక్కి పంపే అధికారులు కట్‌

రైతులు ప్రశ్నిస్తే సర్ది చెప్పాలంటూ హుకుం

శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందం ఏర్పాటు

నివ్వెరపోతున్న వ్యవసాయాధికారులు


అనంతపురం వ్యవసాయం, మే 28: సబ్సిడీ వేరుశనగ విత్తనాలు నాసిరకంగా ఉన్నా.. రైతులకు బలవంతంగా మోసంతో అంటగట్టే కుతంత్రం రచించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాసిరకం విత్తన వేరుశనగను తొక్కిపెట్టేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలున్నాయి. అందుకు గట్టిగానే వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. విత్తన సరఫరా ఏజెన్సీ పంపిన వేరుశనగను పరిశీలించి, స్టాక్‌ను తీసుకునే బాధ్యత మండల వ్యవసాయాధికారిదే. నాణ్యత లేకుంటే కారణాలు తెలియజేసి వెనక్కి పంపాల్సింది కూడా వారే. పంపిణీ కేంద్రాల నుంచి విత్తనం తీసుకున్న రైతులు ఎవరైనా నాణ్యంగా లేవని భావిస్తే తిరిగి ఇతర బస్తాలు ఇవ్వాల్సిందే. విత్తన పంపిణీలో ఇటీవల ఒక్కసారిగా 974 క్వింటాళ్ల వేరుశనగ నాసిరకంగా తేలటంతో ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలిగిన యత్రాంగం అందుకు విరుద్ధంగా కొత్త నిబంధనలు తెరపైకి తేవటం విస్మయం కలిగిస్తోంది. విత్తన నాణ్యతను పరిశీలించి, తిరస్కరించే అధికారాన్ని మండల వ్యవసాయాధికారులకు లేకుండా చేయటం గమనార్హం.


ఆ మేరకు ఆదేశాలు జారీ చేయటం శోచనీయం. జిల్లాకు సరఫరా చేసే విత్తన వేరుశనగ నాణ్యతను వ్యవసాయ శాస్త్రవేత్తలు మాత్రమే పరిశీలించేలా నిర్ణయించారు. అందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందంలోని శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యంగా లేవని ధ్రువీకరిస్తేనే విత్తన వేరుశనగను వెనక్కి పంపేలా కొత్త నిబంధనలు తెచ్చారు. ఈ పరిణామంతో వ్యవసాయాధికారులు నివ్వెరపోతున్నారు. నాసిరకం విత్తనాలను గుర్తించటమే పాపంగా భావించటం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విచిత్ర నిబంధనలతో నాసిరకం విత్తన వేరుశనగపై మాట్లాడేందుకే వ్యవసాయాధికారులు జంకుతున్నారు. గతంలో నాసిరకం విత్తనాలు ఎక్కడైనా వస్తే వెనక్కివ్వాలని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ప్రకటిస్తూ వచ్చారు. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా నాసిరకం విత్తనాల మాటే ఎత్తకుండా కొత్త నిబంధనలు అమలు చేసి, వ్యవసాయాధికారుల అధికారాలకు కళ్లెం వేయటం ఏ మేరకు సమంజసమన్న వాదనలు వినిపిస్తున్నాయి.


రైతులు ప్రశ్నిస్తే సర్ది చెప్పాలంటూ హుకుం

ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాకు 3.34 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించారు. ఇప్పటిదాకా 1.89 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా సరఫరా చేస్తున్న విత్తన వేరుశనగలో కొన్ని ఏజెన్సీల నుంచి నాసిరకంగా వస్తూనే ఉన్నాయి. వాటిని రైతులకు పంపిణీ చేసిన తర్వాత తమకు ఇచ్చిన కాయలు నాసిరకంగా ఉన్నాయని స్వయంగా వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినా తిరిగి మరో బస్తాలు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎవరైనా రైతులు ప్రశ్నించినా బాగా మొలకెత్తుతాయని సర్దిచెప్పి పంపాలంటూ వ్యవసాయాధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది.


రైతులకు సర్దిచెప్పలేకపోతే వ్యవసాయాధికారులుగా పనికిరారనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు భావించాల్సి వస్తుందన్న సంకేతాలను పరోక్షంగా పంపుతున్నట్లు సమాచారం. దీంతో తమ మండలాల పరిధిలో పదుల సంఖ్యలో రైతులు నాసిరకం విత్తనాలపై ఫిర్యాదులు చేస్తున్నా.. ఏమీ చేయలేని స్థితిలో కొందరు వ్యవసాయాధికారులు కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. నేరుగా జేడీఏ కార్యాలయ వర్గాలకు తెలియజేసినా ఫలితం లేకపోవటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రధాన విత్తన సరఫరా సంస్థతోపాటు సేకరణ ఏజెన్సీల జిమ్మిక్కుల్లో భాగంగానే ఇదంతా సాగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాసిరకం మాటే బయటకు రాకుండా  చేసేందుకు పెద్ద పన్నాగమే పన్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నాసిరకం విత్తన కాయలను తొక్కిపెట్టడంమాని, కరువు రైతులకు నాణ్యమైన వాటిని అందించేందుకు వ్యవసాయాధికారులు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించాల్సి ఉంది. ఏ మేరకు చొరవ చూపుతారో వేచిచూడాల్సిందే.

Updated Date - 2020-05-29T10:08:33+05:30 IST