సబ్సిడీ గ్యాస్‌ బండ రూ.695.5

ABN , First Publish Date - 2020-12-03T09:05:38+05:30 IST

సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50 పెరిగింది. హైదరాబాద్‌ లో ఇదివరకు సబ్సిడీ సిలిండర్‌ ధర రూ. 646.5 ఉండగా, ఇప్పుడు రూ. 696.5కు చేరింది.

సబ్సిడీ గ్యాస్‌ బండ రూ.695.5

రూ.50 పెంచిన చమురు సంస్థలు

వినియోగదారుడి మీద భారం ఉండదు

పెంపు సొమ్ము తిరిగి వెనక్కి.. ఇక నుంచి ఖాతాలో రూ.94


హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50 పెరిగింది. హైదరాబాద్‌ లో ఇదివరకు సబ్సిడీ సిలిండర్‌ ధర రూ. 646.5 ఉండగా, ఇప్పుడు రూ. 696.5కు చేరింది. ఢిల్లీలో ఇప్పటివరకు రూ.594 ఉండగా రూ. 644 కు చేరినట్లు చమురు సంస్థలు బుధవారం ప్రకటించాయి. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. సాధారణంగా నెలకోసారి గ్యాస్‌ సిలండర్‌ ధరలను చమురు కంపెనీలు సవరిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో గడిచిన తొమ్మిది నెలలుగా వంటగ్యాస్‌ ధర పెరగలేదు. నవంబరు నెలాఖరు రోజున కూడా గ్యాస్‌ ధరలను సవరించక పోవటంతో డిసెంబరు నెలకు కూడా పాతధరలే వర్తిస్తాయాని డీలర్లు, వినియోగదారులు భావించారు. కానీ బుధవారం ఉదయం సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను కంపెనీలు పెంచాయి. అయితే పెరిగిన ధరతో డిబీటీ (డైరెక్ట్‌ బెన్ఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) వినియోగదారులకు ఎలాంటి భారం పడే అవకాశంలేదు.


నవంబరు నెలాఖరు వరకు సిలిండర్‌ ధర రూ. 646.5 ఉన్నపుడు సబ్సిడీ కింద డీబీటీ వినియోగదారులకు రూ. 44 తిరిగి ఖాతాలో పడేవి. ఇప్పుడు రూ. 696.5కి సిలిండర్‌ ధర పెరిగిన నేపథ్యంలో రూ. 94 సబ్సిడీ రూపంలో తిరిగి రానుంది.  రాష్ట్రవ్యాప్తంగా 1.17 కోట్ల వంట గ్యాస్‌ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 95 శాతం డీబీటీ హోల్డర్లే ఉన్నారు. వీరికి సిలిండర్‌ ధర పెరిగినా సబ్సిడీ వస్తుంది. మిగిలిన 5 శాతం నాన్‌ డీబీటీదారులు మాత్రం మొత్తం ధరకు(రూ. 696.50) వంట గ్యాస్‌ సిలిండర్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాగా 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 54.5 పెంచారు. దీంతో ఢిల్లీలో ఈ గ్యాస్‌ ధర రూ. 1,296కు చేరుకుంది. 

Updated Date - 2020-12-03T09:05:38+05:30 IST