‘ప్రోత్సాహక’ కథల్లో నిజమెంత?

ABN , First Publish Date - 2020-06-30T09:07:44+05:30 IST

గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో పరిశ్రమలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈలు)కు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు

‘ప్రోత్సాహక’ కథల్లో  నిజమెంత?

  • టీడీపీ హయాంలోనూ 3,650 కోట్లు చెల్లింపు
  • 14,500 కోట్ల రెవెన్యూ లోటున్నా సాయం
  • పరిశ్రమలు, ఎంఎ‌స్‌ఎంఈలు, ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లకు చేయూత
  • ఎస్సీలకిచ్చే రాయితీలు బీసీలకూ వర్తింపు
  • దేశంలో ఏ ప్రభుత్వమూ ఇలాఇవ్వలేదు
  • కానీ ఇప్పుడు తామే చేస్తున్నామని జగన్‌ సర్కారు గొప్పలు
  • రూ.కోట్ల ఖర్చుతో పత్రికా ప్రకటనలు
  • చంద్రబాబు ఏమీ ఇవ్వలేదని ప్రచారం
  • పారిశ్రామిక వర్గాల్లో చర్చ

అమరావతి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో పరిశ్రమలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎ‌స్‌ఎంఈలు)కు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వలేదని.. ఆ పెండింగ్‌ బిల్లులు సహా ఎంఎ్‌సఎంఈలకు రెండు విడతల్లో సుమారు రూ.960 కోట్లు చెల్లిస్తున్నామంటూ పత్రికల్లో ప్రకటనలు. అది కూడా ఒకసారి కాదు. ఇస్తామని ఒకసారి.. .తొలి సగం ఇచ్చాక మరోసారి.. మలి సగానికి ఇంకోసారి కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చింది జగన్‌ ప్రభుత్వం. అయితే అది చెబుతున్న విషయం వాస్తవం కాదని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 2014-19 మధ్య  కూడా రూ.3,675 కోట్లను 28,083 పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాయితీల కింద చెల్లించారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమల రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంలో కూడా ఈ పారిశ్రామిక రాయితీల చెల్లింపు విషయాన్ని ప్రస్తావించారు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.3,675 కోట్లు చెల్లించిందని, ఇంకా రూ.2,800 కోట్లు చెల్లించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రకటనలు, ప్రచారం ద్వారా గతంలో టీడీపీ ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఏమీ చెల్లించనట్లుగా.. తామే ఆ పెండింగ్‌ బకాయిలు చెల్లిస్తున్నట్లుగా చెప్పడం సరికాదని పారిశ్రామిక వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.


రూ.14,500 కోట్ల లోటు బడ్జెట్‌ ఉన్నా...

ప్రభుత్వం అన్నది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వాన్ని నడిపించే రాజకీయ పార్టీలు మారొచ్చు కానీ ప్రభుత్వం మాత్రం శాశ్వతం. ఒక ప్రభుత్వ హయాంలో చేసిన పనులు, చేయాల్సిన చెల్లింపులకు ఆ తర్వాత  వచ్చే సర్కారు కూడా బాధ్యత వహిస్తుంది. సాధారణంగా ఇలాంటి బాధ్యతలు, చెల్లింపుల కొనసాగింపు ఎప్పుడూ ఉంటుంది. గతంలో సమైక్యాంధ్రలో చెల్లించాల్సిన పారిశ్రామిక ప్రోత్సాహక బకాయిలను.. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది. అలా ఉన్న పాత బకాయిలు, కొత్తవి కూడా కొన్ని కలిపి రూ.3,675 కోట్లను చెల్లించింది. వాస్తవానికి రాష్ట్ర విభజన అనంతరం రూ.14,500 కోట్ల తీవ్ర రెవెన్యూ లోటుతో నవ్యాంధ్ర ప్రయాణం ప్రారంభమైంది.


అయినా ప్రభుత్వ నిరంతర బాధ్యత అన్న సూత్రం ప్రకారం టీడీపీ ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాలను చెల్లించింది. కొన్ని పరిశ్రమల ప్రారంభం ఆలస్యం కావడం, లేకుంటే అవసరమైన పత్రాల సమర్పణలో  జాప్యం, వీటికితోడు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంత మొత్తం ప్రోత్సహకాలను పెండింగ్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు వైసీపీ సర్కారు కూడా గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లిస్తోంది. అయితే ఈ సమయంలో ఇస్తున్న ప్రకటనలు చూస్తే.. గత ప్రభుత్వం అసలేమీ ఇవ్వనట్లుగా ఈ ప్రభుత్వమే తొలిసారి ఇచ్చినట్లుగా ఉన్నాయని, అది సరికాదని అంటున్నారు. 


బీసీలకూ ఎస్సీలతో సమానంగా..

మరోవైపు.. టీడీపీ హయాంలో ఎస్సీలకు ఇచ్చిన రాయితీలనే బీసీలకు కూడా వర్తింపజేశారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీల్లో జనరల్‌ కేటగిరీకి కొంతమేర ఇస్తే.. బీసీలకు కొంత ఎక్కువ, ఎస్సీ, ఎస్టీలకు మరికొంత ఎక్కువ ఇస్తారు. అయితే ఎస్సీలకు ఇచ్చినట్లుగానే బీసీలకు కూడా పారిశ్రామిక రాయితీలను గత ప్రభుత్వం ప్రకటించిందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. పారిశ్రామిక పార్కుల్లో భూ కేటాయింపుల్లో ఎస్సీలకు 50 శాతం ధరకే ఇచ్చేవారు. జనరల్‌ కేటగిరీలో కోటి రూపాయలు కట్టాల్సి వస్తే.. ఎస్సీలు రూ.50 లక్షలు చెల్లిస్తే సరిపోయేది. ఇదే రాయితీని గత ప్రభుత్వం బీసీలకు కూడా వర్తింపజేసింది.


భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి రాయితీ ఇవ్వలేదు. ఇంకోవైపు.. నాటి ప్రభుత్వ హయాంలో పలు ప్రధాన పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని, ప్రతి జిల్లాలో అవి కార్యక్రమాలు కూడా ప్రారంభించాయని గుర్తుచేస్తున్నాయి. భూమి, నీరు, విద్యుత్‌, ఇతర వాటిల్లోనూ గత ప్రభుత్వం ప్రోత్సాహకాలిచ్చింది. జగన్‌ సర్కారు ఎంఎ్‌సఎంఈలకు ప్రోత్సాహకాలను పెండింగ్‌లో ఉన్న బకాయిలతో పాటు ఇవ్వడం మంచిదేనని, కానీ గత ప్రభుత్వాలు ఎప్పుడూ అలా చేయనట్లు, తామే చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం, అసత్యాలు చెప్పడం సరికాదంటున్నారు. ఇదే సమయంలో ఈ ప్రోత్సాహకాల విడుదలపై రూ.కోట్లు ఖర్చు చేసి ప్రకటనలలు ఇవ్వడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఫుడ్‌ప్రాసెసింగ్‌ లాంటి రంగాలకు కూడా గత ప్రభుత్వ హయాంలో ఖర్చుచేసిన మొత్తం ఇప్పటి కంటే ఎక్కువేనని అంటున్నారు.

Updated Date - 2020-06-30T09:07:44+05:30 IST