ఇంటర్వ్యూలో Shocking విషయాలు బయటపెట్టిన సుబ్రమణ్య స్వామి

ABN , First Publish Date - 2021-10-01T18:39:51+05:30 IST

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆంధ్రజ్యోతిపై వేసిన కేసులో అసలు నిజం బయటపెట్టారు.

ఇంటర్వ్యూలో Shocking విషయాలు బయటపెట్టిన సుబ్రమణ్య స్వామి

  • జగన్ కోరిక మేరకే ఆంధ్రజ్యోతిపై కేసు పెట్టా


హైదరాబాద్ : బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆంధ్రజ్యోతిపై వేసిన కేసులో అసలు నిజం బయటపెట్టారు. తాను సీఎం జగన్ కోరిక మేరకే ఆంధ్రజ్యోతిపై కేసు పెట్టినట్లు స్పష్టం చేశారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను వెంకన్నపై భక్తితో కాదు.. జగనన్నపై భక్తితో కేసు వేసినట్లు తెలిపారు. 2019లో టీటీడీ పంచాంగం కోసం వెబ్ సైట్‌లో వెతికితే అన్యమత పదం ప్రత్యక్షమైంది. అది తప్పని, సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. అయితే తప్పును వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతిపైనే టీటీడీ కేసు పెట్టింది. రూ. వంద కోట్లకు పరువునష్టం దావా వేసింది. టీటీడీకి మద్దతుగా  రంగంలోకి దిగిన సుబ్రహ్మణ్యం స్వామి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చి తాను కూడా ఆంధ్రజ్యోతిపై కేసు వేస్తున్నట్లు ప్రకటించారు.


అంతటి స్వామి భక్తి ప్రదర్శించిన సుబ్రహ్మణ్యస్వామి తిరుమలకు వచ్చి వెంకన్నను మాత్రం దర్శించకపోవడం అప్పట్లో అనేక అనుమానాలకు తావిచ్చింది. టీటీడీ పెట్టిన కేసులో పోలీసులు వేగంగా విచారణ జరపడంలేదంటూ సుబ్రహ్మణ్యస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. తాము తమ పని పూర్తి చేశామని, చార్జిషీటు కూడా దాఖలు చేశామని పోలీసులు చెప్పడంతో ఆ పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. దానికి కూడా స్వామి వక్రబాష్యం చెబుతూ సంబంధంలేని అంశాన్ని ప్రస్తావించి.. తన విజయం అంటూ ట్వీట్ చేశారు.


ఆ తర్వాత ఆయన ఇదే అంశంపై ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 36 నిముషాలపాటు సాగిన ఇంటర్వ్యూలో 18 నిముషాలకుపైగా ఆంధ్రజ్యోతి గురించే మాట్లాడారు. ఇదే క్రమంలో అసలు విషయం బయటపెట్టారు. జగన్ రెడ్డికి తాను తెలుసునని, ఆయన తండ్రికి కూడా బాగా తెలుసని అన్నారు. ‘‘దయచేసి మమ్మల్ని కాపాడండి అని జగన్ ఒక మెసేజ్ పంపించారని.. ఖచ్చితంగా ఇవే పదాలు కాదు కానీ మనం కంట్రోల్ చేయగలమా? మీరేమైనా చేయగలరా?’’ అని అడిగారని స్వయంగా సుబ్రహ్మణ్యస్వామే ఆ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఆయన అంతకుముందు తిరుపతిలో చెప్పినట్లుగా వెంకన్న భక్తుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదన్నమాట. ‘సేవ్ చేయగలరా? ఆంధ్రజ్యోతిని కంట్రోల్ చేయగలమా?’ అని జగన్ అడిగిన మీదటనే సుబ్రహ్మణ్యస్వామి రంగంలోకి దిగారని స్పష్టమవుతోంది.

Updated Date - 2021-10-01T18:39:51+05:30 IST