ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై సందేహాలున్నాయి: సుబ్రహ్మణ్యం స్వామి

ABN , First Publish Date - 2021-12-09T19:33:36+05:30 IST

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై సందేహాలున్నాయి: సుబ్రహ్మణ్యం స్వామి

ఉడుపి: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవడంపై సందేహాలు ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. ఈ హెలికాప్టర్‌గా చెప్తూ ప్రచారమవుతున్న వీడియోను తాను అత్యంత నమ్మదగిన వర్గాల ద్వారా సరిచూశానని, అది వాస్తవానికి సిరియన్ వైమానిక దళానికి చెందినదని, సీడీఎస్ ప్రయాణిస్తున్నది కాదని తెలిపారు. పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ఏం చెబుతారో చూడాలని అన్నారు. 


సుబ్రహ్మణ్యం స్వామి గురువారం ఇచ్చిన ట్వీట్లలో, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరికొందరు సీనియర్ మిలిటరీ అధికారులు ఎలా మరణించారనేదానిపై సందేహాలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం తప్పనిసరిగా ఓ బయటి వ్యక్తి చేత విచారణ జరిపించాలని, సుప్రీంకోర్టు జడ్జి వంటివారి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 


సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ అని చెప్తూ ఓ వీడియో ప్రచారంలో ఉందని, ఆ హెలికాప్టర్ పొగమంచు, మేఘాలు వంటివి లేనటువంటి ఆకాశంలో ప్రయాణిస్తూ,  కాలిపోతున్నట్లు ఈ వీడియోలో ఉందని, దీని గురించి తాను అత్యంత నమ్మదగిన వర్గాల ద్వారా సరి చూశానని తెలిపారు. ఈ వీడియోలోని హెలికాప్టర్ వాస్తవానికి సిరియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందినదని, సీడీఎస్ ప్రయాణిస్తున్నది కాదని పేర్కొన్నారు. 


సుబ్రహ్మణ్యం స్వామి బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ, ఈ సంఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. దేశ భద్రతకు ఇది చాలా పెద్ద హెచ్చరిక అని పేర్కొన్నారు. ఈ సంఘటనపై తుది నివేదిక ఇంకా రాలేదని, ఇప్పటికిప్పుడు ఏం చెప్పాలన్నా కష్టమని అన్నారు. అయితే తమిళనాడు వంటి సురక్షిత ప్రాంతంలో ఓ సైనిక హెలికాప్టర్ పేలిందని, అలా కనిపిస్తోందని అన్నారు. దీనిపై చాలా చాలా కట్టుదిట్టమైన దర్యాప్తు జరగాలని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి వంటివారి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-12-09T19:33:36+05:30 IST