షరతులకు లోబడి.. బ్యాంకులు చెప్పినట్టల్లా సర్కారువారి ఆట

ABN , First Publish Date - 2022-05-14T08:00:07+05:30 IST

షరతులకు లోబడి.. బ్యాంకులు చెప్పినట్టల్లా సర్కారువారి ఆట

షరతులకు లోబడి.. బ్యాంకులు చెప్పినట్టల్లా సర్కారువారి ఆట

రుణాల కోసం దారుణాలు

ప్రజల కోసం కాదు.. బ్యాంకుల కోసం నిర్ణయాలు

బ్యాంకులు ఎలా కోరితే అలా జీవోలు జారీ

ధాన్యం, రొయ్యలపై ఫీజు పెంపు అందుకే

గతంలో మద్యం ఆదాయం మళ్లింపు

బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు చట్టబద్ధత


అప్పులు ఇచ్చేందుకు అక్కడెక్కడో ఉన్న ప్రపంచ బ్యాంకు షరతులు పెడితే... ఇదేమి ఘోరమని వాపోయాం! ప్రపంచ బ్యాంకు చేతిలో ప్రభుత్వాలు కీలుబొమ్మల్లా తయారవుతాయని ఆందోళన చెందాం! కానీ... ఏపీ సర్కారు అప్పుల కోసం ఇక్కడి బ్యాంకులకే దాసోహం అంటోంది. ‘రుణం ఇస్తే చాలు... మీరు ఎన్ని దారుణాలకు పాల్పడమన్నా మాకు సమ్మతమే’ అని తలూపుతోంది. చివరికి... బ్యాంకులు పెట్టిన షరతులకు లోబడి జనంపై భారం మోపుతోంది. బ్యాంకులతో కుదిరిన ఒప్పందాల మేరకు ఎడాపెడా జీవోలూ జారీ చేస్తోంది. ప్రజల కోసం కాకుండా... అప్పుల కోసం బ్యాంకులు చెప్పినట్టల్లా నిర్ణయాలు తీసుకుంటోంది.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

జగనన్నకు అప్పుల మీద ఆశ! బ్యాంకర్లకు వడ్డీల మీద ఆశ! ఇద్దరూ కలిసి... రాష్ట్రాన్ని ఆర్థికంగా ఛిన్నాభిన్నం చేసేస్తున్నారు.   అప్పు దొరికితే చాలు... ఎలాంటి షరతులకైనా సరే అని జగన్‌ సర్కారు తలూపుతోంది. వడ్డీలు వస్తేచాలు... నిబంధనలు, రుణ పరిమితులతో సంబ ంధం లేకుండా ‘షరతులకు లోబడి’ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయి. ఆ షరతుల వల్ల రాష్ట్రానికి, భవిష్యత్‌ తరాలకు జరిగే నష్టాన్ని పట్టించుకోకుండా... రాష్ట్రంలోని ఆస్తులను, ఖజానాను ప్రభుత్వం దోచిపెడుతోంది. ఈ క్రమంలో... రైతులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, చివరికి మందుబాబులనూ వదలకుండా ఫీజులు, పన్నుల బాదుడుతో బెంబేలెత్తిస్తోంది.


బ్యాంకులు చెప్పిన మేరకే...

ఇటీవల వరి ధాన్యం, రొయ్యలు, చేపల కొనుగోలుపై ప్రభుత్వం మార్కెట్‌ ఫీజును భారీగా పెంచింది. ధాన్యంపై గతంలో 1 శాతం ఉండగా ప్రస్తుతం దాన్ని  2కి పెంచింది. రొయ్యలు, చేపల విక్రయాలపై ఉన్న 0.25 శాతం మార్కెట్‌ ఫీజును ఏకంగా 1 శాతానికి పెంచారు. దీనివల్ల ఖజానాకు రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఇది.. అప్పుల కోసం యూనియన్‌ బ్యాంక్‌ షరతులకు లోబడి వేసిన బాదుడు! పదేళ్లపాటు అదనపు ఫీజు వసూలు చేసి, దానిని ప్రత్యేక నిధిగా చూపించి... రూ.1600 కోట్ల రుణం తీసుకోవడమే ప్రభుత్వ ‘పథకం’. ఇది అంతటితో ఆగలేదు! భవిష్యత్తులో ఆ బ్యాంకుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ఆర్‌బీఐ లేదా కేంద్రం అడిగితే సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం మరో జీవో ఇచ్చింది. వసూలైన మార్కెట్‌ ఫీజు ద్వారా ఏ మార్కెట్‌ యార్డును ఎంత ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తారనే వివరాలు ఆ జీవోలో ఉన్నాయి. ‘ఊరికే అప్పు ఇచ్చేస్తే మాకు ఇబ్బంది. ఆ అప్పుతో ఏం చేస్తామో చెబుతూ జీవో ఇవ్వండి’ అనేదే ఆ షరతు! ఇలా బ్యాంకు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడటం ఇదే మొదటిసారి కాదు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.40వేల కోట్లు రుణం తెచ్చుకోవడానికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎలా చెబితే అలా ఆడారు. మద్యం ఆదాయం నేరుగా ఖజానాకు వెళ్లాల్సి ఉన్నా... స్పెషల్‌ మార్జిన్‌ పేరిట రెండు ముక్కలు చేసి ఎక్కువ మొత్తాన్ని కార్పొరేషన్‌ ఖాతాకు మళ్లిస్తూ జీవో ఇచ్చారు. మేనేజర్‌గా ఉన్న బేవరేజెస్‌ కార్పొరేషన్‌ను ప్రభుత్వం మద్యం వ్యాపారానికి ‘యజమాని’ని చేసేసింది. 


కేంద్రం, ఆర్‌బీఐ హెచ్చరికలు బేఖాతర్‌....

దేశంలో బడా బ్యాంకు ఎస్‌బీఐ మొదట్లో రాష్ట్ర సర్కారుకు యథాశక్తి రుణ సహాయం చేసింది. ఇతర బ్యాంకులతో ఒక కన్సార్షియం ఏర్పాటు చేసి, దానికి నేతృత్వం వహించి... రాష్ట్రానికి రూ.25వేల కోట్ల అప్పులిప్పించింది. ఆ తర్వాత తప్పు గ్రహించి రుణ ప్రవాహం నిలిపివేసింది. మద్యంపై వచ్చే ఆదాయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఏపీఎ్‌సడీసీకి ఎస్ర్కో చేయడాన్ని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగం, ఆర్‌బీఐ తప్పు బట్టాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీల మీద కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలకు అప్పులివ్వకూడదని హెచ్చరించాయి.  దీంతో రాష్ట్రం గ్యారెంటీలు ఇచ్చినా బ్యాంకులు అప్పులివ్వడంలేదు. కానీ... బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంకులు ఇస్తూనే ఉన్నాయి. 


ఎందుకింత ప్రేమంటే... 

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంకులు రాష్ట్రానికి అడ్డగోలు అప్పులు ఇవ్వడానికి బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్‌ సర్కార్‌ పీడీ ఖాతాల పేరుతో కేంద్ర పథకాల నిధులను దారి మళ్లిస్తోంది. దానికి అడ్డుకట్ట వేయడానికి ఒక్కో పథకానికి ఒక్కో బ్యాంకు ఖాతా తెరవాలని, అలా చేస్తేనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం షరతులు విధించింది. ఈ లెక్కన రాష్ట్రం 135 ఖాతాలు తెరవాలి. ఇందులోకి రూ.20వేల కోట్ల దాకా నిధులు వస్తాయి. ఆయా పథకాలకు సం బంధించి రాష్ట్రం కూడా మ్యాచింగ్‌ గ్రాంట్‌ విడుదల చేయాలి. అయితే... ‘135 ఖాతాలు మీ దగ్గరే తెరుస్తాం. కేంద్రం ఇచ్చే నిధులనే మీకు గ్యారెంటీ గా చూపిస్తాం. మేం విడుదల చేయాల్సిన మ్యా చింగ్‌ గ్రాంట్‌ రూ.8వేల కోట్లు  రుణంగా ఇవ్వండి’ అని రాష్ట్రం ఎస్‌బీఐని కోరింది. ఈ ప్రతిపాదనను ఎస్‌బీఐ తిరస్కరించింది. దీంతో ప్రభుత్వం యూనియన్‌ బ్యాంకును సంప్రదించగా ‘ఓకే’ చెప్పేసింది. రూ.8వేల కోట్లను ఓడీ రూపంలో ఇచ్చేందుకు ఒప్పుకొన్నట్లు తెలిసింది. కానీ... భవిష్యత్తులో తన కు ఇబ్బందులు రాని విధమైన పద్ధతిలో ‘షరతు లు’ విధించి, ఆ మేరకు జీవోలు ఇవ్వాలని స్పష్టం చేస్తోంది. దీంతో సర్కారు బ్యాంకు చెప్పినట్టల్లా ఆడుతోంది. ఇక,.. రాష్ట్రంలో మద్యం వ్యాపారం మొత్తాన్ని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా బీవోబీ బ్యాంకు తన గుప్పిట్లోకి తీసుకుంది. అంటే, ఏటా ఖజానాకు వెళ్లాల్సిన రూ.25వేల కోట్ల ఆదాయాన్ని తన బ్యాంకుకు మళ్లించుకునేలా జీవోలు, చట్టసవరణలు,. కొత్త చట్టాలు చేయించుకుంది.

Read more