ఈ ఏడాదైనా అందేనా!?

ABN , First Publish Date - 2022-06-30T03:45:15+05:30 IST

జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో అధికంగా బోర్ల కింద వివిధ పంటలు సాగు చేస్తారు. వీటికి బిందు, తుంపర్ల సేద్యం పరికరాలపై ఎక్కువుగా ఆధారపడుతారు.

ఈ ఏడాదైనా అందేనా!?
సాగు చేసిన బత్తాయి తోట

రాయితీపై బిందు, తుంపర్ల పరికరాలు

కొనసాగుతున్న రిజిస్ట్రేషన్‌

రెండేళ్లుగా రైతుల ఎదురుచూపు

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 29: జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో అధికంగా బోర్ల కింద వివిధ పంటలు సాగు చేస్తారు. వీటికి బిందు, తుంపర్ల సేద్యం పరికరాలపై ఎక్కువుగా ఆధారపడుతారు. గత ప్రభుత్వం ఈ పరికరాలను రాయితీపై అందించి సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించింది. అయితే రెండేళ్లుగా ఏపీఎంఐపీ(ఏపీ మైక్రో ఇరిగేషన్‌ సంస్థ) ద్వారా రైతులకు ఎలాంటి రాయితీ పరికరాలు అందలేదు. ఈ సారైనా వస్తాయా, రావోనని రైతులు నిరాశతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం బిందు, తుంపర్ల పరికరాలు అవసరమైన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది. దీంతో పలువురు రైతులు బిందు, తుంపర పరికరాల కోసం ఆర్‌బీకేల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వాటిని త్వరితగతిన అందజేస్తే ప్రయోజనం చేకూరుతుందని పలువురు రైతులు అంటున్నారు. 

6,900 హెక్టార్ల లక్ష్యం

జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6,900 హెక్టార్లకు బిందు, తుంపర సేద్యం పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్థేశించినట్లు అఽధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఆర్‌బీకేల్లో 3002 హెక్టార్లకు సంబంధించి 2,520 మంది రైతులు పరికరాల కోసం పొలం పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకంతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. బోర్ల కింద సాగు చేసే పంటల్లో ప్రధానంగా బత్తాయి, నిమ్మ, బొప్పాయి, దానిమ్మ, మామిడి, మిరప, టమోటా, పసుపు వంటి పంటలకు ఈ పరికరాలు ఉపయోగిస్తారు. రెండేళ్లుగా ప్రభుత్వం వీటిని అందజేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది ప్రభుత్వం అందజేసేందుకు సుముఖత వ్యక్తం చేసినందున త్వరితగతిన అందజేయాలని రైతులు కోరుతున్నారు. 

పెరిగిన పండ్ల తోటల పెంపకం

మెట్ట ప్రాంతాల్లో ఇటీవల పండ్లతోటల సాగు విస్తీర్ణం పెరిగింది. రెండేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో అధికంగా బత్తాయి, బొప్పాయి, నిమ్మ, మామిడి తోటల పెంపకం చేపట్టారు. రెండేళ్లుగా బిందు, తుంపర సేద్య పరికరాలు ప్రభుత్వం నిలిపివేయడంతో ఆయా మొక్కలకు నీరు పట్టేందుకు రైతులు అవస్థలు పడడంతో పాటు ఖర్చులు పెరిగి పెట్టుబడులు అధికంగా అవుతున్నాయని వాపోతున్నారు. పరికరాలు ఉంటే నీటి ఆదాతోపాటు రైతులకు ఖర్చులు తగ్గి అంతర పంటల సాగు వైపు మొగ్గు చూపి ఆదాయ బాటలో నడిచే అవకాశముంది. 

త్వరలో అందజేస్తాం

బిందు, తుంపర్ల సేద్యం పరికరాలు త్వరలో అందజేస్తాం. జిల్లాలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 2,520 మంది రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఏడు కంపెనీలు పరికరాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆయా కంపెనీల సిబ్బంది తోటలను పరిశీలించి ప్రతిపాదనలు వేసిన అనంతరం రైతు చెల్లించాల్సిన వాటా డీడీ రూపంలో చెల్లిస్తే పరికరాలు అందజేస్తాం. 

- సుభానీ, ఏపీఎంఐపీ పీడీ


Updated Date - 2022-06-30T03:45:15+05:30 IST