అరుణతార అస్తమయం

ABN , First Publish Date - 2021-04-17T05:56:39+05:30 IST

సీపీఐ రాష్ట్ర నాయకులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు(71) గుండెపోటుతో గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

అరుణతార అస్తమయం

మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు గుండెపోటుతో  హఠాన్మరణం

నగరంలో సీపీఐకి బలమైన లీడర్‌ 

బెజవాడ మొదటి ఫ్లై ఓవర్‌ ఆయన కృషే 

చివర్లో పార్టీకి దూరంగా ఉన్నా.. ప్రజాసమస్యలపై గళం  

విజయవాడ(అజిత్‌సింగ్‌ నగర్‌), ఏప్రిల్‌ 16: సీపీఐ రాష్ట్ర నాయకులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు(71) గుండెపోటుతో గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు నగర ప్రముఖులు నివాళులర్పించారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మూడు పర్యాయాలు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఒకసారి సీపీఐ ఫ్లోర్‌ లీడర్‌గా, రెండు పర్యాయాలు డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1994లో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. బెజవాడ అభివృద్ధికి సుబ్బరాజు ఎమ్మెల్యేగా ఉండగా విశేష కృషి చేశారు. కొండ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించి మెట్లు, మంచినీటి వ్యవస్థ, డ్రెయిన్లు, రోడ్లు వంటి సదుపాయాలు కల్పించారు. కొండ ప్రాంతాలలో ఆయన అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలే ఇప్పటికీ కనిపిస్తాయి. కేవలం తన నియోజకవర్గమే కాకుండా నగరం అంతటా తనదైన ముద్ర వేశారు. ఆయన హయాంలోనే అజిత్‌సింగ్‌నగర్‌ ప్లైఓవర్‌ నిర్మాణం జరిగింది. ఇప్పుడు సింగ్‌నగర్‌ ప్రాంతవాసులు ఎటునుంచి ఎటైనా రాకపోకలు సాగించటానికి నాటి సుబ్బరాజు ఆలోచనలే కారణం. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఆయన హయాంలోనే పెద్ద ఎత్తున జరిగాయి. రైల్వే స్థలాలను పేదలకు ఇంటి పట్టాలుగా ఇప్పించిన ఘనత కూడా ఆయనదే. అందుకే బెజవాడలో ఆయన పేరుతో సుబ్బరాజు నగర్‌ ఏర్పాటైంది. రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో సుబ్బరాజు నగర్‌ ఉంది. నగరంలో అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోపాటు రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. సీపీఐ నగర కార్యదర్శిగా నగరంపై పార్టీ పట్టును ఏర్పర్చుకున్నారు. బెజవాడ అంటే వామపక్షాల గడ్డగా తీర్చిదిద్దిన వారిలో సీపీఐ పరంగా సుబ్బరాజు ఒకరు. నగరంలో సీపీఐని ఒక క్రమశిక్షణతో ముందుకు తీసుకువెళ్లిన వ్యక్తి సుబ్బరాజు. పార్టీలో అంతర్గత పరిణామాల నేపథ్యంలో, కొంత కాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. స్వతంత్రంగా ఉంటున్నప్పటికీ.. నగరంలో ప్రజా సమస్యలపై తన గళం వినిపించేవారు 

 ఇళ్ల పట్టాలు ఇప్పించినందుకు ‘సుబ్బరాజు నగర్‌’ 

కాకర్లపూడి సుబ్బరాజు పేరుతో నగరంలో ‘సుబ్బరాజు నగర్‌’ ఏర్పాటైంది. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను సుబ్బరాజు కల్పిం చేవారు. సుబ్బరాజు కృషికి నిదర్శనంగా ప్రస్తుత రాజరాజేశ్వరి పేట ప్రాంతంలోనే రైల్వే ట్రాక్‌ సమీపంలో సుబ్బరాజు నగర్‌ ఏర్పాటైంది.      

 ఇస్కఫ్‌ జాతీయ కార్యదర్శిగా 65 దేశాలలో పర్యటనలు  

 సుబ్బరాజు దాదాపుగా 65 దేశాలకుపైగా పర్యటించారు. అక్కడి అభివృద్ధి నమూనాలను అధ్యయనం చేశారు. ఇండియన్‌ సొసైటీ ఫర్‌ కల్చరల్‌ కో ఆపరేషన్‌ అండ్‌ ఫ్రెండ్‌షిప్‌ (ఇస్కఫ్‌) జాతీయ ప్రధాన కార్యదర్శిగా చాలాకాలం పనిచేశారు. ఇస్కఫ్‌ అనేది అప్పటి సోవియట్‌ యూనియన్‌కు స్నేహపూర్వకంగా మెలిగే వారి కోసం ఏర్పాటు చేసిన సంస్థ. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా శాఖలు ఉండేవి. బెజవాడలో అనేక మందిని ఇస్కఫ్‌లో సభ్యులుగా సుబ్బరాజు చేర్పించారు. మేధావులు, నైపుణ్యత కలిగిన వారు, వామపక్ష భావజాలం ఉన్న ప్రొఫెసర్లు వంటి వారిని ఇస్కఫ్‌లోకి తీసుకు వచ్చేవారు.  

 పలువురి సంతాపం  

సుబ్బరాజు మరణవార్త తెలిసిన వెంటనే సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, జిల్లా, నగర కార్యదర్శులు అక్కినేని వనజ, దోనేపూడి శంకర్‌, సీపీఎం రాష్ట్ర నేతలు సీహెచ్‌. బాబూరావు, కృష్ణ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, మాజీ మేయర్‌ జంధ్యాల శంకర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ సామంతపూడి నరసరాజు, మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పి. దుర్గావాని, పార్టీలకతీతంగా పలువురు నాయకులు, నగర ప్రముఖులు.. సుబ్బరాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పంచారు. 

నేడు అంత్యక్రియలు

సుబ్బరాజు అంత్యక్రియలు ముత్యాలపాండులోని శ్మశానవాటికలో శనివారం నిర్వహించనున్నట్లు సీపీఐ నేతలు తెలిపారు. సుబ్బరాజు కుమారుడు అమెరికా నుండి శనివారం నగరానికి వస్తున్నారు. శనివారం ఉదయం సుబ్బరాజు బౌతికకాయం సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌ వద్ద ఉంచి, మధ్యాహ్నం లోటస్‌ల్యాండ్‌ మార్క్‌లోని స్వగృహానికి తరలించి, అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర బయలుదేరుతుందని పార్టీ నేతలు ప్రకటించారు.

సుబ్బరాజు, సుబ్బారావు మృతికి బచ్చుల సంతాపం

విజయవాడ సిటీ : సీపీఐ సీనియర్‌ నాయకుడు కాకర్లపూడి సుబ్బరాజు, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు మృతికి టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు శుక్రవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.  

 ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు

 కాకర్లపూడి సుబ్బరాజు మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని, గ్రంథాలయాల పరిరక్షణకు సుబ్బరాజు చేసిన కృషి ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు అన్నారు. రాష్ట్ర కన్వీనర్‌ కోన దేవదాసు, అధికార ప్రతినిధి బీరం వెంకట రమణ, ప్రధానకార్యదర్శి  చంద్రశేఖర్‌, కోశాధికారి బసవేశ్వరరావు పాల్గొని సుబ్బరాజుకు నివాళులర్పించారు.                 

సుబ్బరాజు ఆకస్మిక మరణంపై ఐజేయూ జాతీయ ఉపాఽధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి చందు జానార్ధన్‌, కృష్ణాఅర్బన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు చలపతిరావు, వసంత్‌ ఒక ప్రకటనలో  సంతాపం వ్యక్తం చేశారు.   



Updated Date - 2021-04-17T05:56:39+05:30 IST