సుబ్బరాయుడి అంతిమయాత్ర

ABN , First Publish Date - 2021-06-14T05:48:44+05:30 IST

ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బరాయుడు(60) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందాడు.

సుబ్బరాయుడి అంతిమయాత్ర

  1. కలిసి నడిచిన ఆత్మబంధువులు 
  2. తలకొరివి పెట్టిన కూతురు
  3. భయంతో బంధువులు దూరం


ఓర్వకల్లు, జూన్‌ 13: ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బరాయుడు(60) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందాడు. లేనిపోని భయాలతో అంత్యక్రియలకు బంధువులలో ఒకరు మినహా ఎవరూ రాలేదు. ఆయనకు భార్య, కూతురు తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఓర్వకల్లు ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా టీకొట్టు నడిపేవాడు. ఈ కారణంగా జర్నలిస్టులు, పోలీసులు, ఇతర శాఖల అధికారులు, స్థానికులతో బంధం పెరిగింది. టీకొట్టు సుబ్బరాయుడు మృతి చెందాడని తెలియగానే అందరూ స్పందించారు. ఆయన భార్య సుబ్బమ్మ, కూతురు ప్రేమ సుధకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ఎవరికి వారు తోచినంత చందా వేసుకుని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మేళతాళాల నడుమ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. పట్టణానికి చెందిన కురువ జయన్న, మన్సూర్‌, ఇస్మాయిల్‌, తలారి జయన్న భుజం ఇచ్చారు. కూతురు ప్రేమ సుధ తల కొరివి పెట్టారు. అంత్యక్రియలకు ఓర్వకల్లు ఎస్‌ఐ మల్లికార్జున, పోలీసులు, రెవెన్యూ అధికారులు, నాయకులు శంకర్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, రంగనాథ గౌడు, పెద్దయ్య, జయన్న, ఇరుగూ పొరుగువారు హాజరయ్యారు. సుబ్బరాయుడుది పేద కుటుంబం. దాదాపు 30 ఏళ్ల నుంచి టీకొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కూతురును బాగా చదివించాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు విన్నవించారు.

Updated Date - 2021-06-14T05:48:44+05:30 IST