మహనీయుడు డాక్టర్‌ కాకర్ల

ABN , First Publish Date - 2021-04-17T06:00:13+05:30 IST

ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందటంతో ఆయన స్వగ్రామమైన పెదముత్తేవిలో విషాదఛాయలు అలముకున్నాయి.

మహనీయుడు డాక్టర్‌ కాకర్ల

చల్లపల్లి, కూచిపూడి, ఏప్రిల్‌ 16 : ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందటంతో ఆయన స్వగ్రామమైన పెదముత్తేవిలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యులు, గ్రామస్థులు, సన్నిహితులు ఆయనతో తమకున్న అనుంబంధాన్ని నెమరువేసుకుంటూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. మారుమూల కుగ్రామంలో పుట్టి దేశ, విదేశాల్లో పేరు గడించిన సుబ్బారావు తమ ఊరివ్యక్తి కావటం గర్వకారణంగా ఉందని, ఆ మహనీయుడి మరణం తమ గ్రామానికి తీరని లోటని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాకర్లకు తీరని కోరిక.. 

మొవ్వ మండలం పెదముత్తేవికి చెందిన కాకర్ల సుబ్బారావు పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లి రాజా హైస్కూల్‌లో జరిగింది. దివిసీమ.. దివితాలూకా అంటే కాకర్లకు ప్రత్యేక అభిమానం ఉండేది. పెదముత్తేవిలో ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఆహ్వానించినా ఆయన హాజరయ్యేవారు. చల్లపల్లి ప్రాంతంలో మంచి ఆసుపత్రి నిర్మించాలన్నది సుబ్బారావు చిరకావాంఛ. చాలాసార్లు ఆ ప్రయత్నం చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.    

 బందరుతో విడదీయరాని సంబంధం 

మచిలీపట్నం టౌన్‌ : పద్మశ్రీ డా కాకర్ల సుబ్బారావుకు బందరుతో విడదీయరాని సంబంధం ఉంది. పుస్తకాలు కొనుక్కునేందుకు బందరు వచ్చేవారు. తండ్రి వద్ద రామాయణం, మహాభారతంలోని పద్యాలను బాల్యంలో నేర్చుకోవడం వల్ల బందరులో జరిగే పద్యాల పోటీలలో ప్రథమ బహుమతి సాధించేవారు. వివేకానంద మందిరం, హిందూ కళాశాలలో జరిగే పద్యాల పోటీల్లో మూడేళ్లపాటు వరుసగా పద్యాల పోటీల్లో బహుమతులు సాధించినట్టు ఇక్కడి పెద్దలు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. బందరులో గ్రాడ్యుయేషన్‌ చదివే రోజులలోనే ఆయనకు మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చింది. దీంతో ఆయన బందరును వదిలిపెట్టారు. 

గ్రామానికి గుర్తింపు తెచ్చారు 

కుగ్రామంలో పుట్టినప్పటికీ వైద్యవృత్తిలో ఎనలేని సేవలందించి సుబ్బారావు మా గ్రామానికి మంచి గుర్తింపు తెచ్చారు. ఎప్పుడు ఫోన్‌లో సంభాషించినా గ్రామస్థుల గురించి, గ్రామం గురించి అడిగి తెలుసుకునేవారు. 

 - కాకర్ల శివకుమార్‌, మాజీ సర్పంచ్‌

తెలుగుజాతికి తీరనిలోటు

 కాకర్ల సుబ్బారావు మృతి తెలుగుజాతికి తీరనిలోటు. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు అమెరికాలో నిధులు వసూలు చేసి పంపించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ కాకర్ల సేవలను కొనియాడారు. పోలియో పరికరాల తయారీలో వారు అందించిన సహకారాన్ని ప్రస్తుతించారు.  

- మండలి బుద్ధప్రసాద్‌, మాజీ ఉపసభాపతి

దివితాలూకాపై కాకర్లకు అభిమానం

  దివితాలూకా వారంటే కాకర్లకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. చల్లపల్లి రాజా హైస్కూల్‌లో ఆయన చదువుకోవటం నాతోపాటు ఆ విద్యాసంస్థలో చదువుకున్న వారందరికీ గర్వకారణమే.

-మిక్కిలినేని పాపారావు, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం, చల్లపల్లి

 గొప్ప వ్యక్తిని కోల్పోయాం

దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించిన పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు దివితాలూకా వాసి కావటం ఈ ప్రాంత వాసులందరికీ గర్వకారణం. కాకర్ల మరణంతో గొప్ప వ్యక్తిని కోల్పోయాం. 

- గొర్రెపాటి వెంకట రామకృష్ణ, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ 

నిమ్స్‌ అభివృద్ధి కాకర్ల వల్లే..

ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అమెరికాలో ఉన్న కాకర్ల సుబ్బారావును హైదారాబాదుకు పిలిపించారు. హైదరాబాదులో నిమ్స్‌ ఆసుపత్రి అభివృద్ధి కాకర్ల పుణ్యమే.  

- గొర్రెపాటి గోపీచంద్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు      

 ఒక్క రూపాయి గౌరవవేతనంతో వైద్యం

కేవలం ఒక్క రూపాయి గౌరవవేతనంతో ‘వైద్యో నారాయణో హరి’ అనే నానుడిని నిజం చేసిన వ్యక్తి కాకర్ల సుబ్బారావు. ఆయన దివిసీమకు మహనీయుడు.    

-వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రి 

మా కళాశాల విద్యార్థి కావడం గర్వకారణం 

 డాక్టర్‌ కాకర్ల మా కళాశాల విద్యార్థి కావడం ఎంతో గర్వకారణం. ఒక మంచి వైద్యునిగా, ప్రొఫెసర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందిన సుబ్బారావుకు పద్మశ్రీ అవార్డు ఇచ్చినప్పుడు మా కళాశాలలో ఉత్సవం జరిపాం.  

- డా కె పంకజ్‌ కుమార్‌, ప్రిన్సిపాల్‌, హిందూ కళాశాల


Updated Date - 2021-04-17T06:00:13+05:30 IST