Abn logo
Oct 30 2020 @ 00:48AM

శేషాచల చందనం రక్షణకు పటిష్ఠ వ్యవస్థ

Kaakateeya

అరుదైన ఎర్ర చందనం చెట్లను అంతరించిపోతున్న వృక్ష జాతుల జాబితాలో చేర్చాలి. అలాంటి వృక్ష జాతులను సంరక్షించే చట్టాన్ని వీటి విషయంలో పకడ్బందీగా అమలుపరచాలి. ప్రతి ఎర్ర చందనం వృక్షానికీ జియోటాగ్ వేసి నిరంతరం పరిరక్షించే ఒక పటిష్ఠ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. మొత్తం చెట్లలో ఎన్నిటిని నరికి వేశారు, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఉన్న వాటి సంరక్షించేందుకు చేపడుతున్న చర్యలను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే ఒక సమగ్ర శ్వేత పత్రం విడుదల చేయాలి. చిప్కో ఉద్యమ స్ఫూర్తితో నవ్యాంధ్ర యువత ఈ తరువులను కాపాడాలి.


కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత, సుమారు 4755.99 హెక్టార్లలో విస్తరించిన శేషాచల అడవులలో లభిస్తున్న అరుదైన ఎర్రచందనం చెట్లు సాక్షాత్తు స్వామివారి అంశేనని ఈ ప్రాంత ప్రజల పవిత్ర భావన. ఆంధ్రప్రదేశ్‌ వెలుపల తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఓ 500 హెక్టార్లలో మినహా ఈ వృక్ష సంపద ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ అరుదైన వృక్షాలు అందించే ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చాలా ప్రాంతాలలో వీటిని పెంచే ప్రయత్నం జరిగినా ఆ స్థాయి నాణ్యత రాలేదు. శేషాచల అడవులు మాత్రమే ఈ వృక్షాలు పెరగడానికి అవసరమైన అన్ని అనుకూలతలనూ అందిస్తున్నాయి. ఒక చెట్టు ఎదిగిరావడానికి సుమారు 20 సంవత్సరాలు పడుతుంది. ఈ అరుదైన వృక్ష సంపద స్మగ్లర్ల పాలిట కల్పతరువుగా మారటం విషాదం. సీమ ప్రాంతానికి చెందిన కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల ప్రత్యక్ష, పరోక్ష ఆశీస్సులతో ఇది సాగిపోతున్నది. చైనా, జపాన్, గల్ఫ్ దేశాలలో ఎర్రచందనం, దాని ఉప ఉత్పత్తులను వివిధ రూపాలలో వాడతారు. వాయిద్య పరికరాలు, బొమ్మల తయారీలో వాడతారు. సుగంధ ద్రవ్యంగా, ఔషధంగా ఉపకరిస్తుంది. ఎర్ర చందనం ప్రయోజనాలు లెక్కలేనన్ని. ఫలితంగా ఈ అరుదైన వృక్షజాతికి చెందిన చెట్లకు విదేశాలలో విపరీతమైన గిరాకీ ఉంది. దీనితో స్మగ్లర్ల చూపుపడి సమీప పోర్టుల ద్వారా, లేదా రోడ్డుమార్గం ద్వారా నేపాల్ నుండి ఇతరదేశాలకు తరలిస్తున్నారు.


ఒకప్పుడు చెట్లు నరకడానికి చుట్టుపక్కల గ్రామాల కూలీలను వాడడం జరిగేది. కానీ, వీరిద్వారా స్మగ్లింగ్ సమాచారం బయటకు పొక్కే అవకాశం ఉండడంతో, తమిళనాడు నుండి కూలీలను రప్పించుకుని ఆధునిక కోతయంత్రాలతో పెద్దఎత్తున ఎర్రచందనం చెట్లను నరికి చోరీకి పాల్పడటం, లేదా వాటిని మరింత చిన్నచిన్న ముక్కల రూపంలో తరలించడం నిత్యకృత్యం. దీనిని అరికట్టేలా ప్రభుత్వం మీద వత్తిడి తేవడానికి గతంలో ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న కిషన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం, తదనంతరం పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ ఈ సమస్య ప్రస్తావనకు వచ్చి, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తీసుకురావడం జరిగింది. అనంతరం వచ్చిన ప్రభుత్వం డీఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ నియమించి అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేయడం జరిగింది. ఈ సమయంలో కూబింగ్‌కి వెళ్లిన పోలీసులపైన 20మంది మరణాయుధాలతో ఎదురుదాడి చేస్తే వారు ఎన్‌కౌంటర్‌ కావడం తెలిసిందే. అయినా, కొందరు అధికారుల, రాజకీయ నాయకుల అశీస్సులతో ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే తమకు ఎదురు ఉండదన్న నమ్మకంతో కొందరు స్మగ్లర్లు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు పంచి తమ అనుయాయుల గెలుపునకు కృషి చేశారు కూడా. వారు ఈ కరోనా కాలాన్ని అవకాశంగా మలుచుకుని వినూత్న మార్గాలలో ఎర్ర చందనాన్ని పక్క దేశాలకు తరలించడం జరుగుతున్నది. ఈ అక్రమదందా నిరాటంకంగా జరగడానికి డిఎఫ్ఓ స్థాయి అధికారులను బదిలీచేయించడం, వివిధ ఉన్నతస్థాయి పోస్టులు భర్తీకాకుండా ఖాళీగా ఉంచేలా కుట్రపన్ని, తమ విజయానికి ఆర్థికవనరులు సమకూర్చిన వారి ప్రయోజనాల పరిరక్షణకోసం నాయకులు పాటుపడుతున్నారు. వచ్చే వాటాలతో వీరూ ఆర్థికంగా పరిపుష్ఠం అవుతున్నారు. పై విషయాలన్నింటినీ కేంద్ర హోమ్‌శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డిగారి దృష్టికి తీసుకువస్తూ, నేను, బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వినతి పత్రం సమర్పించిన నేపథ్యంలో సదరు అంశాలపై మంత్రివర్యులు స్వయంగా విలేకరుల సమావేశం పెట్టి, ఆంధ్ర, తమిళనాడు ముఖ్యమంత్రులతో మాట్లాడి, ఉభయ రాష్ట్రాలూ కలసికట్టుగా స్మగ్లింగ్‌ను ఎలా కట్టడి చేయాలో చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకుపోయి దేశ సరిహద్దుల్లో నిఘా విభాగాలు ఎర్రచందనం అక్రమరవాణామీద మరింత దృష్టి పెట్టేలా చూస్తామనీ, కోస్టు గార్డులకు సైతం ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇవ్వడం శుభపరిణామం. 


ఈ అరుదైన వృక్ష జాతిని అంతరించిపోతున్న వృక్ష జాతుల జాబితాలో చేర్చి, అరుదైన వృక్ష జాతుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటవీ గ్రామాల ప్రజలు వంటచెరుకు కోసం వెళ్ళితే పిడి చట్టాలు మోపే పోలీసు అధికారులు స్మగ్లర్ల అరాచకాలను నిలువరించలేకపోవడం గమనార్హం. ప్రతీ చెట్టుకూ జియోటాగ్ వేసి వాటిని నిరంతరం పరిరక్షించే ఒక పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలి. మొత్తం చెట్లలో ఎన్ని నరికివేయబడినాయి, ఎన్ని ఉన్నాయి, వీటి సంరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియచెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే సమగ్రమైన వివరాలతో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. తద్వారా ఈ అరుదైన వృక్షసంపద సంరక్షణ పట్ల తన చిత్తశుద్ధిని, అంకితభావాన్ని ప్రభుత్వం నిరూపించుకోవాలి. అలాగే, ఉత్తరాఖండ్‌లో అటవీ సంపద పరిరక్షణ కొరకు జరిగిన చిప్కో ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత భావి తరాలకు ఈ అరుదైన వృక్ష సంపద అందేలా తమవంతు కృషి చెయ్యాలి. 

నాగోతు రమేష్ నాయుడు

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి


Advertisement
Advertisement