మంజీరాలో భూగర్భ జలాలపై అధ్యయనం

ABN , First Publish Date - 2022-04-29T06:01:45+05:30 IST

ఉమ్మడి జిలా పరిధిలోని మంజీరా నదిలో భూగర్భ జలాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. మంజీరా నదిలో ఇసుక మేటలు, నది జలాలు, ఇసుక తవ్వకాలపై అధికారులు పరిశీలిస్తున్నారు.

మంజీరాలో భూగర్భ జలాలపై అధ్యయనం

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రోలోజి శాస్త్రవేత్తల పరిశోధనలు  

నదిలో ఇసుక తవ్వకాలు, భూగర్భ జలాల ప్రభావంపై సర్వే   

శాంపిళ్లను సేకరిస్తున్న అధికారులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిలా పరిధిలోని మంజీరా నదిలో భూగర్భ జలాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. మంజీరా నదిలో ఇసుక మేటలు, నది జలాలు, ఇసుక తవ్వకాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ బెల్గాంకు చెందిన శాస్త్రవేత్తలు ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చి మంజీర వెంట సర్వేను నిర్వహిస్తున్నారు. నదిలో 15ఏళ్లుగా ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు ఏ మేరకు దెబ్బతిన్నాయో పరిశీలిస్తున్నారు. సర్వే నివేదికను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికి నివేదించనున్నారు. నివేదిక ఆధారంగా భవిష్యత్‌లో మంజీరా నదిపైన ఇసుక తవ్వకాలతో పాటు ఇతర రక్షణ చర్యలు ఎలా చేపట్టాలో వివరించనున్నారు. 

నదిపైనే నిజాంసాగర్‌ నిర్మాణం..

మంజీరా నది కర్ణాటక నుంచి మెదక్‌ జిల్లా మీదుగా కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తుంది. ఈ నదిపైన నిజాంసాగర్‌ను నిజాం పాలనలో నిర్మించారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సింగూర్‌ ప్రాజెక్టు నిర్మాణం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో చేపట్టారు. వర్షాలు తగ్గడం, ఇసుక తవ్వకాలు మంజీరా వెంట ఎక్కువ కావడం వల్ల భూగర్భ జలాలు తగ్గాయి. భారీ వర్షాలు వస్తే తప్ప ఈ రెండు ప్రాజెక్టులు నిండడంలేదు. ప్రస్తుతం నిజాంసాగర్‌కు కాళేశ్వరం నీటిని మల్లింపు కార్యక్రమం కూడా చేపడుతున్నారు. గతంతో పోలిస్తే మంజీరాలో ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు భారీగా తగ్గాయి. చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాల్లో బోర్లతో పాటు ఇతర సాగునీటి వనరులు దెబ్బతిన్నాయి. గతంలో కొద్ది మీటర్ల దూరంలోనే నీరు రాగా ప్రస్తుతం వందల మీటర్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 దెబ్బతింటున్న నీటి పథకాలు..

జాతీయస్థాయిలో కొన్ని నదుల్లో ఇసుక తవ్వకాల వల్ల ప్రవాహనం దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలపైన పడింది. ఎక్కువ మొత్తంలో తవ్వకాలు చేయడం వల్ల భూగర్భ జలాలు ఇంకిపోవడం, భారీ వర్షాలు పడినపుడు నీరు నిలవ ఉండక కిందికి వెళ్లడం వల్ల వాటిపై ఉన్న ఎత్తిపోతల పథకాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ నీటి పథకాలు, బావులు దెబ్బతింటున్నాయి. వరదలు, వర్షాల వల్ల నీరు ఇంకక కిందికి తరలివెళ్లడం వల్ల ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. నదులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జాతీయస్థాయిలో సర్వే నిర్వహిస్తున్న మా దిరిగానే రాష్ట్రంలో మంజీరా నదిని ఈ సర్వే కోసం ఎంపిక చేశారు. గడిచిన నాలుగు రోజులుగా కోటగిరి నుంచి బిచ్కుంద వరకు మంజీరా నది వెంట సర్వేను కొనసాగిస్తున్నారు. కోటగిరి, బీర్కూర్‌, బాన్సువాడ, బిచ్కుంద, మద్నూర్‌ పరిధిలో ఉన్న ఈ మంజీర  నది వెంట జరుగుతున్న తవ్వకాలను పరిశీలిస్తున్నారు. కొన్ని లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను బిచ్కుంద నుంచి బోధన్‌ మండలం వరకు తవ్వకాలు చేశారు. ప్రతి సంవత్సరం వరదల సమయంలో కొంతమేర ఇసుక మేటలు వేస్తున్న భారీగా తవ్వకాలు జరగడంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపైన పడింది. ఇసుక తవ్వకాల వల్ల మంజీరా వెంట భూమి దెబ్బతిందా అనే విషయాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. వరద వచ్చిన సమయంలో ఇసుక ఉన్న మాదిరిగానే నీరు భూగర్భంలోకి ఇంకుతుందా లేదా వరద ఎక్కువగా కిందికే వెళ్తుందా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. అదేకాకుండా భూగర్భ జలాలు ఒకవేళ తగ్గితే ఎంతమేర తగ్గాయో అత్యాధునిక పరికరాల ద్వారా పరిశీలిస్తున్నారు.

శాంపిళ్ల సేకరణ..

ఇసుక పరిమాణం ఎక్కువగా ఉంటే నీళ్లు ఎలా ఉన్నాయి. తక్కువ ఇసుక ఉన్నచోట నీళ్లు ఏ లక్షణాలు కలిగి ఉన్నాయో శాంపిల్స్‌ సేకరించి పరిశోధిస్తున్నారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజికి చెందిన అభిలాష్‌, రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్‌లు తమ సిబ్బందితో కలిసి ఈ వివరాలను సేకరిస్తున్నారు. నదిలో ఇసుక ఏ సైజులో ఉంది. తవ్వకాల వల్ల ఇసుక పరిమాణం తగ్గిందా వరదలు వచ్చిన సమయంలో ఎంతమేర ఇసుక మేటలు వేస్తున్నాయి. తవ్విన చోట వచ్చే ఇసుక పరిమాణం, ఇసుక ఎక్కువగా తవ్వకాలు చేయడం వల్ల నది తన దారిని మార్చుకుంటుందా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు సర్వేను నిర్వహించి పూర్తిస్థాయి నివేదికను ఎన్‌ఐహెచ్‌కు సమర్పిస్తారు. ఇవే నివేదికలను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికి కూడా అందిస్తారు. వీరు ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్‌లో ఇసుక తవ్వకాలకు అనుమతులు, ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం, మంజీరాపైన చేపట్టనున్నారు. ఈ శాస్త్రవేత్తల బృందం మరో సంవత్సరంన్నరపాటు మంజీరాపైన పరిశోధనలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. మంజీరాలో ఇసుక తవ్వకాల వల్ల నది పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకే ఈ సర్వే కొనసాగుతున్నట్లు గ్రౌండ్‌ వాటర్‌ డీఈ సతీష్‌యాదవ్‌ తెలిపారు. నది పరిమాణం, తవ్వకాల వల్ల పరిస్థితులను శాస్త్రవేత్తలు సర్వే ద్వారా తెలుసుకుంటున్నారన్నారు. రాష్ట్ర భూగర్భ జలవనరులశాఖ ఆధ్వర్యంలోనే ఈ సర్వే కొనసాగుతుందని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-04-29T06:01:45+05:30 IST