50 లక్షల క్యూసెక్కులపై అధ్యయనం చేయం

ABN , First Publish Date - 2022-10-08T09:31:24+05:30 IST

గోదావరికి ఎట్టి పరిస్థితుల్లోనూ 50 లక్షల క్యూసెక్కుల వరద రానేరాదని, దాని ప్రకారం వరద ముప్పుపై అధ్యయనం చేసే ప్రసక్తే లేదని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) తేల్చిచెప్పింది.

50 లక్షల క్యూసెక్కులపై అధ్యయనం చేయం

  • 25.5 లక్షల క్యూసెక్కులకు మించి వరద వచ్చే
  • అవకాశం లేదని అన్ని నివేదికలూ చెప్పాయి
  • 36 లక్షల క్యూసెక్కుల వరదతో భద్రాచలంలో
  • 1.5 అడుగుల దాకానే ముంపు ముప్పు: సీడబ్ల్యూసీ
  • పోలవరం బ్యాక్‌వాటర్‌ ముంపుపై తెలంగాణలో
  • సంయుక్త సర్వేకు తెలుగు రాష్ట్రాల అంగీకారం
  • గోదావరిలో కలిసే నదులపై అధ్యయనం వద్దు: ఏపీ
  • సుప్రీం విచారణలోపు మరో రెండుసార్లు భేటీకి నిర్ణయం
  • వరద ప్రభావం, బ్యాక్‌ వాటర్‌పై అభ్యంతరాల్ని 10రోజుల్లో 
  • రాతపూర్వకంగా తెలపాలని జలశక్తి శాఖ ఆదేశం 

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): గోదావరికి ఎట్టి పరిస్థితుల్లోనూ 50 లక్షల క్యూసెక్కుల వరద రానేరాదని, దాని ప్రకారం వరద ముప్పుపై అధ్యయనం చేసే ప్రసక్తే లేదని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) తేల్చిచెప్పింది. 25.50 లక్షల క్యూసెక్కులకు మించి వరద వచ్చే అవకాశాల్లేవని అన్ని కమిటీల నివేదికల్లోనూ తేలిందని.. అయినప్పటికీ 36 లక్షల క్యూసెక్కుల వరదపై అధ్యయనం చేసి, దానికి అనుగుణంగా రక్షణ చర్యలు తీసుకోవడానికి  సిద్ధమని స్పష్టం చేసింది. ఇక.. వరద ప్రభావం, బ్యాక్‌ వాటర్‌ పై 10 రోజుల్లోగా రాత పూర్వకంగా తమ అభ్యంతరాలు తెలపాలని జలశక్తి శాఖ రాష్ట్రాలకు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. పోలవరంపై సీడబ్ల్యూసీ చైర్మన్‌ ఆర్కే గుప్తా, పోలవరం ప్రాజెక్టు చైర్మన్‌ అథారిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో శుక్రవారం ఢిల్లీలో సాంకేతిక అధికారుల సంయుక్త సమావేశం జరిగింది. దీనికి తెలంగాణ ఈఎన్‌సీలు సి.మురళీధర్‌, బి.నాగేంద్రరావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, గోదావరి బేసిన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్రహ్మణ్య ప్రసాద్‌, కాంటెక్‌ కన్సల్టెన్సీ ప్రతినిధి రౌతు రాకేశ్‌, ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌ బాబు, ఛత్తీస్‌గఢ్‌ ఈఎన్‌సీ వీకే ఇంద్రజిత్‌, ఒడిశా ఈఎన్‌సీ అశుతోష్‌ దాస్‌ తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.


 తెలంగాణలో పోలవరం బ్యాక్‌ వాటర్‌ ముంపుపై సుబ్రహ్మణ్యప్రసాద్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సీడబ్ల్యూసీకి వివరించారు. గోదావరికి గత జూలైలో వచ్చిన వరదతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 7 మండలాలల్లో ఉన్న 150 గ్రామాల్లో ముంపు ప్రభావం కనిపించిందని.. 28 వేల మందిపై ఈ ప్రభావం ఉందని.. ఫొటోలు చూపిస్తూ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు వరదపై జరిగిన అధ్యయనంలోనే లోపాలున్నాయని, నివేదిక ఒక విధంగా ఉంటే.. వాస్తవ పరిస్థితులు మరో విధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే భద్రాచలం వద్ద ఐదు అడుగుల మేర ముంపు ఉంటుందని ఆందోళన వెలిబుచ్చారు. అయితే.. 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ముంపు ముప్పు 1.5 అడుగులకు మించి ఉండదని సీడబ్ల్యూసీ బదులిచ్చింది. 


గోదావరిలో 36 ఉప నదులు కలుస్తున్నాయని, కొన్ని నదులకు 30 నుంచి 40 వేల క్యూసెక్కుల వరద ఉందని పేర్కొనగా.. కోర్టు కేసుల్లో రెండు నదుల ప్రస్తావన మాత్రమే ఉందని సీడబ్ల్యూసీ గుర్తుచేసింది. ఆ కేసు తెలంగాణ ప్రభుత్వం వేయలేదని, పూర్వ ఖమ్మం జిల్లాకు చెందిన వారు వేశారని తెలంగాణ స్పష్టం చేసింది. 36 ఉపనదుల ప్రవాహంపై పోలవరం బ్యాక్‌ వాటర్‌ ముంపు ప్రభావం ఉంటుందని.. వరద వెనక్కి తన్నితే ముంపు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో.. తెలంగాణ, ఏపీ, పీపీఏతో కలిసి సంయుక్త సర్వే చేయించడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ నెల 19లోగా 36 ఉప నదుల వరదపై సవివర నివేదిక అందించాలని, ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని సీడబ్ల్యూసీ తెలంగాణకు స్పష్టం చేసింది. ఇక.. గోదావరి ట్రైబ్యునల్‌, సీడబ్ల్యూసీ అనుమతుల మేరకే పోలవరం నిర్మాణం ఉందని, డిజైన్లు, నీటి సామర్థ్యం విషయంలో నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఏపీ స్పష్టం చేసింది. 


అలా చేయకుంటే..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ డిజైన్‌లోనే లోపాలున్నాయని ఒడిశా స్పష్టం చేసింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని, ఆ ప్రకారం నిర్మాణం చేపట్టాలని తీర్పునిచ్చిందని, అయితే 50 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా పోలవరం స్పిల్‌వే డిజైన్‌లలో మార్పులు చేశారని పేర్కొంది. బచావత్‌ ట్రైబ్యునల్‌కు వ్యతిరేకంగా నిర్మాణం జరుగుతోందని, 58 లక్షల క్యూసెక్కులకు అనుగుణంగా అధ్యయనం చేయకపోతే తమ భూభాగంలో ప్రజాభిప్రాయసేకరణకు, అధ్యయనానికి అంగీకరించే ప్రసక్తే లేదని ఒడిశా తేల్చిచెప్పింది. ఇక.. పోలవరం ప్రాజెక్టుకు 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ-రూర్కీ నివేదిక ఇచ్చిందని ఛత్తీస్‌గఢ్‌గుర్తు చేసింది. ఆ వరదకు అనుగుణంగా అధ్యయనం చేయాలని పట్టుబట్టింది. అయితే తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌రాష్ట్రాలు ఇదివరకే లేవనెత్తిన అభ్యంతరాలన్నీ అంశాల వారీగా తిప్పికొడుతూ సీడబ్ల్యూసీ సవివరంగా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చింది. ఇక గోదావరిలో కలిసే ఉపనదులపై అధ్యయనం అవసరం లేదని ఈ సందర్భంగా ఏపీ స్పష్టం చేసింది. వరద ప్రభావంపై అంచనాకు ఉమ్మడి సర్వే చేయాలని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. అలాగే.. డిసెంబర్‌ 7న సుప్రీంకోర్టులో విచారణ జరిగే లోపు మరో రెండు సార్లు సమావేశం కావాలని ఈ భేటీలో నిర్ణయయించారు.

Updated Date - 2022-10-08T09:31:24+05:30 IST