పరీక్షలకు సిద్ధమయ్యేదెలా?

ABN , First Publish Date - 2022-05-17T04:46:38+05:30 IST

గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమవు తున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సోషల్‌ వెల్ఫేర్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది.

పరీక్షలకు సిద్ధమయ్యేదెలా?
శిక్షణ కేంద్రానికి హాజరైన అభ్యర్థులు (ఫైల్‌)

- సోషల్‌ వెల్ఫేర్‌ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్స్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

- అభ్యర్థులకు అందని స్టడీ మెటీరియల్‌, మెస్‌ చార్జీలు

గద్వాల క్రైం, మే 16 : గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమవు తున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సోషల్‌ వెల్ఫేర్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది. గద్వాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమినార్‌ హాలులో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా కేంద్రం ఏప్రిల్‌ 29న ప్రారంభమైంది. జూన్‌ 29 వరకు కొనసాగనుంది. అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌తో పాటు మెస్‌చార్జీగా ప్రతీ రోజు రూ.75 రూపాయలు అందిం చాల్సి ఉంటుంది. ఈ శిక్షణ కేంద్రానికి ప్రభుత్వం 100 సీట్లను కేటాయించగా, 73 మంది అర్హత సాధించారు. గత 20 రోజులుగా శిక్షణ తరగతులు కొనసాగుతు న్నాయి. అయితే అభ్యర్థులకు ఇప్పటివరకు స్టడీ మెటీరియల్‌, ప్రతీ రోజు ఇవ్వాల్సిన రూ.75 మెస్‌చార్జీలు ఇవ్వలేదు. దీంతో దూరప్రాంతాల నుంచి వస్తున్న అభ్య ర్థులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు పేద విద్యా ర్థులు సొంతంగా డబ్బు ఖర్చుపెట్టలేక శిక్షణ తరగతులకు హాజరు కావడం లేదు. మొత్తం 73 మందికి గాను ప్రస్తుతం 30 మంది లోపే వస్తున్నారు. స్టడీమెటీరియల్‌, మెస్‌ చార్జీలు వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 


ఇబ్బంది పడుతున్నాం

భానుచందర్‌, జమ్మిచేడు : ప్రతీ రోజు జమ్మిచేడు నుంచి బస్సు లేదా ఆటోలో వస్తాను. అందుకు డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాం. మెస్‌ చార్జీలు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది. మా దగ్గర బ్యాంకు ఖాతా నెంబర్‌ తీసుకున్నారు కానీ, ఇప్పటివరకు డబ్బు జమ చేయలేదు. 


స్టడీ మెటీరియల్‌ ఇవ్వాలి 

వినోద్‌, ఎల్కూరు : గ్రూప్స్‌ కోచింగ్‌ ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా స్టడీ మెటీరియల్‌ ఇవ్వ లేదు. దీంతో ఇంటి వద్ద సాధన చేయలేకపోతున్నాం. వెంటనే స్టడీ మెటీరియల్‌ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.


త్వరలోనే పంపిణీ చేస్తాం

శ్వేతా ప్రియదర్శిని, సోషల్‌ వెల్ఫేర్‌ జిల్లా అధికారి : అటెండెన్స్‌ విషయంలో కొద్దిగా సమస్య ఉండటంతో పాటు, విద్యార్ధులు తక్కువ సంఖ్యలో హాజరౌతున్నారు. ఆటెండెన్స్‌ ఆధారంగా విద్యార్ధులకు డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం 15 రోజులకు ఒకసారి మెస్‌చార్జీలు ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే విద్యార్ధులకు డబ్బుతో పాటు స్టడీ మెటీరియల్‌ కూడా అందిస్తాం.

Updated Date - 2022-05-17T04:46:38+05:30 IST