Abn logo
May 24 2020 @ 02:11AM

అమెరికాలో చదివితే ప్రాధాన్యం!

Kaakateeya

  • హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాలు కఠినతరం! 
  • అమెరికన్లకు కోత పెట్టడం కుదరదు
  • కంపెనీలో హెచ్‌-1బీలు 50శాతం దాటొద్దు
  • కార్మిక శాఖకు ఉద్యోగుల డేటా ఇవ్వాలి
  • కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టిన సభ్యులు

వాషింగ్టన్‌/హైదరాబాద్‌, మే 23(ఆంధ్రజ్యోతి): అమెరికా తీసుకోబోతున్న మరో నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇంతవరకూ భారతీయులకు ఉపాధి అవకాశం కల్పిస్తున్న హెచ్‌-1బీ వీసాల జారీ ప్రక్రియను అమెరికా కఠినతరం చేయనుంది. ఈ మేరకు హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసా జారీలో సంస్కరణలకు నాంది పలికింది. దీనికి సంబంధించి అమెరికా చట్ట సభలలో బిల్లు ప్రవేశపెట్టారు. కరోనా వైరస్‌ దెబ్బకు అమెరికాలో నిరుద్యోగం తారస్థాయికి చేరిన నేపథ్యంలో రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీల సభ్యులు కలిసి అమెరికన్‌ కాంగ్రె్‌సలో బిల్లును ప్రవేశపెట్టారు. ‘‘హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాల సంస్కరణల చట్టం’’ పేరుతో రూపొందించిన ఈ బిల్లుకు ఇరు పార్టీల మద్దతు ఉంది కాబట్టి చట్ట రూపం దాల్చడం లాంఛన ప్రాయమేనని భావిస్తున్నారు. అర్హులైన అమెరికన్లను పక్కనబెట్టి ఇతర దేశాల వారిని ఉద్యోగాల్లోకి తీసుకోకుండా నిరోధించడం, మరింత ప్రతిభావంతులైన నిపుణులను ఆకర్షించడం బిల్లు ప్రధాన ఉద్దేశం. అమెరికాలో ఉన్నత విద్య చదువుకున్న విదేశీయులకు హెచ్‌-1బీ వీసాల జారీలో ప్రాధాన్యం ఇవ్వాలని బిల్లు చెబుతోంది. అమెరికాలో చదువుకునే విదేశీయుల్లో చైనా వారి తర్వాత భారతీయులే అధికంగా ఉన్నారు. ఆ కోణంలో భారతీయులకు కొంత లబ్ధి చేకూరే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం హెచ్‌-1బీ వీసాల్లో మూడొంతులు భారతీయులకే దక్కుతున్న నేపథ్యంలో కొత్త చట్టం ద్వారా జరిగే నష్టం కూడా భారత్‌కే అధికంగా ఉండబోతోంది. అమెరికాలో చదువుకునే విదేశీయుల వల్ల అమెరికన్‌ విద్యాసంస్థలకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న నేపథ్యంలో వారిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. 


బిల్లులో ముఖ్యాంశాలు

  1. అమెరికా ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాదారులకు ఉద్యోగం ఇవ్వరాదు. వీరివల్ల అమెరికా ఉద్యోగులు, కార్మికుల పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలి.
  2. అవుట్‌సోర్సింగ్‌ కంపెనీలు హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాల ద్వారా విదేశాల నుంచి ఉద్యోగులను పిలిపించి, వారికి స్వల్పకాలం పాటు అమెరికాలో శిక్షణ ఇప్పించి, వెనక్కి పంపించి, వారి సొంత దేశం నుంచి అదే పనిని చేయిస్తున్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి. యాభై మంది ఉద్యోగులు దాటిన కంపెనీల్లో ఇప్పటికే హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాల ద్వారా వచ్చిన ఉద్యోగులు సగం కన్నా ఎక్కువ మంది ఉంటే, అదనంగా హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాల కింద ఉద్యోగులను తీసుకోరాదు. 
  3. అమెరికా కార్మిక శాఖకు కంపెనీల ఉద్యోగ డేటాను ఎప్పుడైనా తనిఖీ చేసే అధికారం.   హెచ్‌-1బీ, ఎల్‌-1 ఉద్యోగుల వివరాలన్నీ ఆ శాఖ కు సమర్పించాలి.
  4. ఎల్‌-1 ఉద్యోగులకు కనీస వేతనాలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
  5. ఎల్‌-1 ఉద్యోగుల ఎంపికను అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షిస్తుంది. వారిని ఒకే కంపెనీలో అనుబంధ సంస్థల మధ్య బదిలీ చేసినపుడు షెల్‌ సంస్థల్లోకి బదిలీ చేయకుండా చూస్తుంది.తెలుగు వారిపై ప్రభావం

తాజా నిర్ణయం ప్రభావం భారతీయులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నిపుణులపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తమ అవసరాలకు కావాల్సిన మానవ వనరులను సమకూర్చుకునేందుకు అమెరికా ఏటా 60 వేల హెచ్‌-1బీ వీసాలను జారీ చేస్తోంది. హెచ్‌-1బీ వీసాలు పొందే వారిలో తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువగా ఉంటారు. తాజా బిల్లు చట్టంగా మారితే తెలుగు రాష్ట్రాలవారిపై ఎక్కువగా ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 


నిరుద్యోగం తీవ్రం 

అమెరికాలో నిరుద్యోగ పరిస్థితిని అధిగమించాలంటే కఠిన చట్టాలు తేవడమే తక్షణ కర్తవ్యమని ట్రంప్‌ సర్కారు భావిస్తోంది. తాజా బిల్లు ప్రతిపాదన లక్ష్యం కూడా ఇదేనని నిపుణులు పేర్కొంటున్నారు. అత్యంత ప్రతిభావంతులైన విదేశీ నిపుణులనే అనుమతించాలని భావిస్తున్నందున భారతీయులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోకపోతే వెనక్కిపంపవచ్చని హైదరాబాద్‌కు చెందిన అమెరికన్‌ లా కన్సల్టెంట్‌ విద్యాసాగర్‌రావు ‘‘ఆంధ్రజ్యోతి’’కి చెప్పారు. 


Advertisement
Advertisement