Pilots: విమానం నడిపేటప్పుడు 66 శాతం మంది పైలట్లు అంతే.. భయంకర నిజం బయటపెట్టేశారుగా..!

ABN , First Publish Date - 2022-09-26T23:45:59+05:30 IST

విమాన ప్రయాణంపై (Flight Journey) కొందరికి సదభిప్రాయం ఉండదు. వాయు మార్గంలో ప్రయాణం అయినందువల్ల రోడ్డు, రైలు మార్గాలపై కంటే కూడా..

Pilots: విమానం నడిపేటప్పుడు 66 శాతం మంది పైలట్లు అంతే.. భయంకర నిజం బయటపెట్టేశారుగా..!

ముంబై: విమాన ప్రయాణంపై (Flight Journey) కొందరికి సదభిప్రాయం ఉండదు. వాయు మార్గంలో ప్రయాణం అయినందువల్ల రోడ్డు, రైలు మార్గాలపై కంటే కూడా ఎక్కువ భయాలు, అపోహలు ఫ్లైట్ జర్నీపై ఉంటుంటాయి. అడపాదడపా జరిగే విమాన ప్రమాదాలు అలాంటి వారి భయాన్ని రెట్టింపు చేసి ‘జీవితంలో విమానం ఎక్కకూడదు బాబోయ్’ అని మెంటల్‌గా ఫిక్స్ అయ్యేలా చేస్తాయి. తాజాగా.. జరిగిన ఓ అధ్యయనంలో విమానాన్ని నడిపే పైలట్లకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. భారత్‌కు చెందిన 542 మంది విమాన పైలట్లను సర్వే చేయగా.. దాదాపు 66 శాతం మందికి పైగా విమానం నడిపే సమయంలో ‘‘Daytime Sleepiness’’ (పగటి వేళ నిద్రమత్తు)లో ఉంటుటారని తేలింది. విమానం నడుపుతుండగా అలా కంటి మీద కునుకు సమస్య ఇబ్బంది పెడుతున్నా కాక్‌పిట్‌లో ఉన్న తోటి పైలట్లను కూడా అలర్ట్ చేయకుండా ఆ నిద్ర మత్తులోనే విమానం నడుపుతుంటారని సర్వేలో వెల్లడైంది.



అయితే.. విమానాన్ని గాలికొదిలేసి పూర్తిగా నిద్రపోతారని కాదు గానీ కొన్ని క్షణాల పాటు రెప్పవాల్చుతుంటారని మాత్రం ఈ అధ్యయనంలో తెలిసింది. కానీ.. చిన్నపాటి కునుకు తీయడం మాత్రం జరుగుతుంటుందని తేలింది. ఈ సర్వేలో రీజనల్, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపే పైలట్లను కవర్ చేశారు. ఆ పైలట్లు వ్యక్తం చేసిన అభిప్రాయాల ఆధారంగా చూస్తే.. 54 శాతం మంది పైలట్లు విమానం నడిపే సమయంలో తీవ్రమైన పగటి నిద్రమత్తుతో ఇబ్బందిపడుతుంటారని, 41 శాతం మంది ఓ మోస్తరు నిద్రమత్తు సమస్యతో ఇబ్బందిపడుతుంటారని తెలిసింది. మొత్తంగా చూసుకుంటే సుమారుగా 66 శాతం మంది విమాన పైలట్లను విధులు నిర్వర్తించే సమయంలో నిద్రమత్తు కమ్మేస్తుందని సర్వేలో వెల్లడైంది. NGO Safety Matters Foundation అనే సంస్థ ఈ సర్వే చేసింది.



ఈ నిద్రమత్తు, రెప్పపాటు కునుకు ఎంత ప్రమాదకమైందంటే.. చాలా వరకూ రోడ్డు ప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం. తెల్లవారుజామున క్షణ కాలం పాటు కన్ను మూయడం వల్ల రోడ్డు ప్రమాదంలో ఛిద్రమైపోయిన జీవితాల అనేకం. విమాన పైలట్లకు తెల్లవారుజామున ఎక్కువగా Back-to-Back Departures ఉండటమే కొందరు ఈ పగటి పూట నిద్రమత్తులోకి జారుకోవడానికి ప్రధాన కారణం అని ఈ ఎన్జీవో ఫౌండర్ కెప్టెన్ అమిత్ సింగ్ తెలిపారు. 6 గంటలకు బయల్దేరాల్సిన విమానానికి విధులు నిర్వర్తించే పైలట్ వేకువజామున 3 నుంచి 3.30 మధ్య నిద్ర లేవాల్సి ఉంటుంది. అంత వేకువజామునే నిద్రలేవడం వల్ల విశ్రాంతి సరిపోక పగటి వేళ చిన్నపాటి కునుకు ఇబ్బంది పెడుతుంటుందనే విషయాన్ని సర్వేలో భాగమైన మెజార్టీ పైలట్లు తమ అభిప్రాయంగా వ్యక్తం చేశారు. ఆ సమయంలో రిపీటెడ్‌‌గా ఫ్లైట్ డ్యూటీ ఉండటం కూడా (దాదాపు 10-12 గంటలు) ఈ నిద్రమత్తుకు కారణమవుతోందని, అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని పైలట్లు ఈ సర్వేలో వెల్లడించారు.

Updated Date - 2022-09-26T23:45:59+05:30 IST