ప్లాజ్మా థెరపీతో అత్యధిక కోవిడ్ మరణాలు: అధ్యయనంలో వెల్లడి!

ABN , First Publish Date - 2021-09-13T14:49:19+05:30 IST

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కల్లోలాన్ని సృష్టించింది.

ప్లాజ్మా థెరపీతో అత్యధిక కోవిడ్ మరణాలు: అధ్యయనంలో వెల్లడి!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కల్లోలాన్ని సృష్టించింది. ఆ సమయంలో కరోనా బాధితులకు ప్లాజ్మా థెరపీ అందించారు. ఇది ఎంతో ప్రయోజనకరమని భావించారు. దీంతో ఆ సమయంలో ప్లాజ్మా బ్యాంకుల ఎదుట భారీ క్యూలు కనిపించాయి. అలాగే బాధితులు ఆన్‌లైన్‌లో కూడా ప్లాజ్మా దాతల కోసం వెదుకులాట సాగించారు. అయితే తాజాగా ప్లాజ్మా థెరపీపై ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో దడ పుట్టించే వాస్తవాలు వెల్లడయ్యాయి. ప్లాజ్మా థెరపీ అనేది కరోనా బాధితులకు ఆశించినంత ఉపశమనం కలిగించలేదని, పైగా దీని కారణంగా బాధితుల ఇబ్బందులు పెరిగాయని వెల్లడయ్యింది. 


ఈ అధ్యయనంలో వెలుగు చూసిన మరో వాస్తవమేమంటే... ప్లాజ్మా థెరపీ కారణంగా కరోనా మృతుల సంఖ్య కూడా పెరిగిందని తేలింది. ‘కోవలెంట్ ప్లాజ్మా ఫర్ హాస్పిటలైజ్డ్ పేషెంట్స్ విత్ కోవిడ్-19: ఓపెన్ లేబుల్, రెండోమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్’ శీర్షికతో సాగించిన అధ్యయనంలో 940 బాధితులను చేర్చారు. వీరిని రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఒక గ్రూపులో ప్లాజ్మా చికిత్స చేయించుకున్నవారిని, మరో గ్రూపులో ప్లాజ్మా చికిత్స పొందని వారిని ఉంచారు. ప్లాజ్మా థెరపీ చేయించుకున్న గ్రూపులోని బాధితుల్లో 33.4 శాతం మందిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడంతో పాటు వారు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


అదే రెండో గ్రూపులోని బాధితులలో 26.4 శాతం మందిలోనే ఇటువంటి సమస్యలు కనిపించాయి. ప్లాజ్మా చికిత్స తీసుకున్నవారిలోని  చాలామంది మృత్యువాత పడ్డారు. ప్లాజ్మా థెరిపీ తీసుకున్న బాధితులలో 23 శాతం మంది చికిత్స పొందిన 30 రోజుల లోపునే మృత్యువాత పడ్డారు. మరో గ్రూపులోని 20.5 శాతం మంది బాధితులు మృతి చెందారు. మనదేశంలో కరోనా సెకెండ్ వేవ్ సమయంలో ప్లాజ్మా థెరపీపై చర్చ నడిచింది.  ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ప్లాజ్మా థెరపీని నిలిపివేసింది. 

Updated Date - 2021-09-13T14:49:19+05:30 IST