విదేశాల్లో చదువుకుందామన్న భారతీయులకు మిగిలిన నిరాశ

ABN , First Publish Date - 2020-04-06T13:31:59+05:30 IST

భారతదేశం నుంచి ప్రతి ఏడాది లక్షలాది మంది యువకులు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా చాలా మందే విదేశాల్లోని కాలేజీలకు

విదేశాల్లో చదువుకుందామన్న భారతీయులకు మిగిలిన నిరాశ

న్యూఢిల్లీ: భారతదేశం నుంచి ప్రతి ఏడాది లక్షలాది మంది యువకులు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా చాలా మందే విదేశాల్లోని కాలేజీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఐ20 కూడా చేతికొచ్చిన తరువాత ఒక్కసారిగా కరోనా వారి ఆశలను చిదిమేసింది. కొన్ని నెలల పాటు ఏ దేశం కూడా విదేశీ విద్యార్థుల దరఖాస్తులను స్వీకరించే పరిస్థితి కనపడటం లేదు. భారత్ నుంచి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో పరిస్థితి ఇప్పుడప్పుడే మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అమెరికాలో స్థిరపడాలన్న తమ ఆశలకు సంకెళ్లు పడ్డాయంటూ భారతీయులు ఆవేదన చెందుతున్నారు. చాలా మంది విద్యార్థులు విదేశాలు వెళ్దామనే ఆలోచనను మానుకుని స్వదేశంలో చదువుకుందామని నిర్ణయించుకుంటున్నారు. మరి కొంత మంది ఇప్పుడు కాకపోతే వచ్చే ఏడాది వెళ్దామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 


ఆస్ట్రేలియాలోని డీకిన్ యూనివర్శిటీ తనకు యాక్సెప్టెన్స్ లెటర్ కూడా ఇచ్చిందని, ఇంతలో ఇలా జరిగిందంటూ త్రిప్తా అనే 21 ఏళ్ల యువతి తనకు ఎదురైన అనుభవాన్ని వ్యక్తం చేస్తోంది. ఇటలీ, కెనడాల నుంచి తనకు యాక్సెప్టెన్స్ లెటర్స్ వచ్చాయని, కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాను భారత్‌లోనే చదువుకోవాలని నిశ్చయించుకున్నట్టు తారా అనే మరో యువతి చెబుతోంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే వారు డిసెంబర్ నెలలోనే ఐఈఎల్‌టీఎస్, జీఆర్ఈ పరీక్షలు రాసేస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వీరంతా విదేశాల్లోని కాలేజీలకు దరఖాస్తు పెట్టుకుంటారు. సరిగ్గా మార్చిలో ఐ20 వస్తుంది.. వీసాకు దరఖాస్తు పెట్టుకుందాం అనుకుంటుండగా కరోనా మహమ్మారి తెరపైకి వచ్చింది. ఈ కారణంగా విదేశాలు వెళ్లాలనుకునే వారు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే అనేక పరీక్షలకు, కాలేజీ అడ్మిషన్‌లకు చాలా ఖర్చు చేశామనుకునే వారు ఇప్పుడు కాకపోయినా ఆరు నెలల తరువాత విదేశాలకే వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఏదేమైనప్పటికి ఈ ఏడాది భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి.

Updated Date - 2020-04-06T13:31:59+05:30 IST