పుస్తకాల్లేని చదువులు..

ABN , First Publish Date - 2022-07-21T17:41:12+05:30 IST

వేసవి సెలవుల అనంతరం జూన్‌ 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అప్పటి నుంచీ విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. పలు చోట్ల అడ్మిషన్లు కూడా పెరుగుతున్నాయి.

పుస్తకాల్లేని చదువులు..

‘‘ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం.. నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందిస్తున్నాం.. ఇంగ్లిష్‌ మీడియంతో సర్కారు స్కూళ్లకు సరికొత్త వైభవాన్ని తీసుకొస్తున్నాం..’’  అని గొప్పలు చెబుతున్న పాలకులు ఆచరణలో విఫలమవుతున్నారు. విద్యార్థులకు ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు అందకపోవడమే ఇందుకు నిదర్శనం. 


ఒక్కో తరగతికి రెండు, మూడు సబ్జెక్టులే పంపిణీ

ఉర్దూ మీడియంలో లాంగ్వేజ్‌లు తప్ప.. మిగతావి లేవు

యూనిఫాం ఊసే కరువు


హైదరాబాద్‌ సిటీ: వేసవి సెలవుల అనంతరం జూన్‌ 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అప్పటి నుంచీ విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. పలు చోట్ల అడ్మిషన్లు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఒకటి నుంచి 10వ తరగతి వరకు 1,08,540 విద్యార్థులు చదువుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏటా పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు అంటే ఏప్రిల్‌లో తరగతుల వారీగా విద్యార్థుల సంఖ్యను చూసి కొత్త పుస్తకాలకు ఇండెంట్‌ తీసుకుంటారు. 2021-22 విద్యా సంవత్సరానికి జిల్లా నుంచి 8.40 లక్షల పుస్తకాలు కావాలని కోరగా, ఈసారి 10.20 లక్షలకు ఇండెండ్‌ పెట్టారు. ఏటా మే నెల చివరిలోపు ప్రింటింగ్‌ ప్రెస్‌ల నుంచి ప్రభుత్వ గోదాములకు, అక్కడి నుంచి మండల కేంద్రాల్లోని స్టాక్‌ పాయింట్లకు పుస్తకాలు చేరుతుంటాయి. మండల విద్యాశాఖాధికారులు హెచ్‌ఎంల ద్వారా పాఠశాలలకు పంపిస్తుంటారు.


నేటికీ సగం పుస్తకాలే..

2022-23 విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 1.70 కోట్ల పుస్తకాలను ముద్రించామని చెబుతున్న విద్యాశాఖాధికారులు పాఠశాలలు ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా పంపిణీ చేయకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో తరగతికి రెండు, మూడు సబ్జెక్టులు మాత్రమే ఇవ్వడంతో, మిగతా పుస్తకాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో సగం పుస్తకాలు వచ్చినప్పటికీ, ఉర్దూ మీడియంలో కేవలం లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌, ఉర్దూ) మాత్రమే వచ్చాయి. ఉపాధ్యాయులు చేసేదేమీ లేక తమ వద్ద ఉన్న పాత పుస్తకాలతో క్లాసులు చెబుతున్నారు. బ్రిడ్జి కోర్సులు (బేసిక్స్‌) వెల్లడిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.


సమీపిస్తున్న ఎఫ్‌ఏ-1 పరీక్షలు

విద్యాశాఖ షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 21 నుంచి ఫార్మాటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎఫ్‌ఏ-1) నిర్వహించాల్సి ఉంది. వర్షాల నేపథ్యంలో వాటిని వారం రోజులు పొడిగించారు. ఓ వైపు పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలు పంపిణీ చేయకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పుస్తకాలు పంపిణీ చేయకుండా నాణ్యమైన విద్య సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు. యూనిఫాంలు కూడా ఇవ్వకపోవడంతో సాధారణ దుస్తుల్లోనే విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు.


పుస్తకాలు లేకుండా ఎలా చెప్పాలి 

విద్యా సంవత్సరం ప్రారంభమై నెలన్నర గడిచింది. తరగతుల వారీగా పుస్తకాలు పంపిణీ కాకపోవడంతో బోధన కుంటుపడుతోంది. అసలు పుస్తకాలు ప్రింట్‌ అయ్యాయా, గోదాముల్లో నిల్వ ఉన్నాయా తెలియడం లేదు. పాఠ్య పుస్తకాలు లేకుండా పిల్లలు ఎలా చదువుకుంటారు. 

- ఇఫ్తేకారొద్దీన్‌, ఎస్‌టీయూ, జిల్లా అధ్యక్షుడు


విద్యారంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించడంలేదు. పుస్తకాలు మొదలుకుని యూనిఫాంల వరకు అన్నింటిని గాలికొదిలారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు లేకపోడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. 

-శ్రీహరి, ఏబీవీపీ సెంట్రల్‌ వర్కింగ్‌ కమిటీ మెంబర్‌

Updated Date - 2022-07-21T17:41:12+05:30 IST