Abn logo
Oct 26 2021 @ 04:06AM

చదువులతో చెడుగుడు

ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): అందరికీ ఒక్కళ్లమే అన్నం పెట్టలేం...సాయానికి రావాలని పిలవడమే ఆలస్యం భోజనాలను ఏర్పాటుచేశారు. వండటానికి, తినడానికి భవనాలను కూడా సమకూర్చారు. ఈ పనులు చేయడానికి సిబ్బందిని సొంత ఖర్చులతో నియమించారు. ఈ పిలుపునిచ్చిన ప్రభుత్వం ఆలోచించి.. ఆ సిబ్బంది జీతాలు భరిస్తానని చెప్పింది. అలా మొదలైన ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై అకారణంగా రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టడం.. అక్కడ చదువుకునే విద్యార్థులకు కష్టాలను తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 2,500 ఎయిడెడ్‌ పాఠశాలలు, వాటిల్లో చదువుతున్న సుమారు రెండు లక్షల మంది విద్యార్థుల చదువులతో ప్రభుత్వం ఆడుతున్న చెడుగుడు అంతిమంగా విద్యార్థులు, తల్లిదండ్రులపైనే భారం మోపనుంది. విద్యా సంస్థల్ని ఏర్పాటుచేసి, పాఠశాల ఏర్పాటుకు అవసరమైన భవనాలు కట్టి, మౌలిక సదుపాయాలను దాతలు కల్పించారు. కేవలం ఉపాధ్యాయుల జీతాలు మాత్రం ప్రభుత్వాలు ఇస్తూ ఎయిడెడ్‌ పాఠశాలలను కొనసాగిస్తున్నాయి. దీనికి భిన్నంగా మీ ఆస్తులతో సహా మాకిచ్చేయండి....లేకుంటే మా సిబ్బందిని మాకిచ్చేయండి అంటూ రెండే రెండు ఆప్షన్లను జగన్‌ ప్రభుత్వం ముందుపెట్టింది. ఒకవేళ ఉపాధ్యాయుల్ని వెనక్కి ఇచ్చేస్తే ఎయిడెడ్‌ పాఠశాలలు ప్రైవేటుగా మారిపోతాయి. పైగా, విద్యార్థుల నుంచి ఫీజులు కూడా వసూలుచేసుకోవచ్చని ప్రభుత్వమే చెప్పేసింది. గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో రూ.10వేలు నుంచి మొదలుపెట్టి...నగరాల్లో రూ.15వేల వరకు వసూలుచేసుకోవాలని సూచించింది. ఇక ఆరోతరగతి నుంచి పదో తరగతి వరకు అయితే రూ.12వేల నుంచి సుమారు రూ.20వేల వరకు వసూలుచేసుకోవచ్చని చెప్పింది. అయితే వాస్తవానికి ఇవి ప్రైవేటుగా మారాక ప్రభుత్వం అనుమతించిన మేరకే వసూలు చేస్తాయనే నమ్మకం లేదు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రైవే టు పాఠశాలలకు కూడా ఇదేవిధంగా పరిమితి పెట్టి ఫీజులు నిర్ణయించినా...అది ఎక్కడా అమలుకావడం లేదనేది బహిరంగ రహస్యం. 


ఆ రూ.680కోట్ల కోసమేనా? 

ఎయిడెడ్‌ పాఠశాలలకు ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్‌ ఏడాదికి సుమారు రూ.680కోట్లు. ఎయిడెడ్‌ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల జీతాల రూపంలో దీన్ని ఇస్తున్నా రు. వ్యవస్థతో ఆడేస్తున్న ఈ చెడుగుడు వల్ల ప్రభుత్వానికి ఆదా అయ్యేది ఈ రూ.680కోట్లు. అయితే అదే సమయంలో మరో ఆలోచన కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. ఎయిడెడ్‌ పాఠశాలల విలీనం వల్ల సుమారు 6,954మంది ఉపాధ్యాయులు ప్రభుత్వంలో విలీనమైపోయారు. అంటే వీరికి ఎయిడెడ్‌లో ఉండగా ఇచ్చిన జీతాన్నే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేసుకున్నాక ఇస్తారు. అదే సమయంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల్ని భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఉద్యోగాల భర్తీ చేయకుండా ఉండేందుకు ఇదో మార్గమన్నమాట! కానీ ప్రభుత్వం తగ్గించుకున్న ఈ భారం...విద్యార్థుల తల్లిదండ్రులపైనే పడుతుంది. అంతేకాదు..ఈ భారానికి మూడు, నాలుగింతలు వారిపై పడే అవకాశాలున్నాయి.  


అమ్మఒడితో ఒరిగేదెంత?

ఎయిడెడ్‌ పాఠశాలలు ప్రైవేటుగా మారాక...వారికి అమ్మ ఒడి వర్తింపచేస్తామని, అందువల్ల ఫీజులపై ఆందోళన అవసరం లేదని చెప్తోంది. వాస్తవానికి ఇది ఎప్పుడూ నీళ్లుండే బావిని మూసేసి...ట్యాంకర్ల ద్వారా నీటిని ఇవ్వడం లాంటిదే. ఎందుకంటే అమ్మ ఒడి ఇప్పటికే ఒక ఏడాది కోసేశారు. ఐదేళ్లు ఇస్తానన్న దాన్ని నాలుగేళ్లకే పరిమితం చేశారు. మరోవైపు అమ్మ ఒడి కింద ఇచ్చే మొత్తం కంటే మరింత ఎక్కువ ఫీజులనే ప్రసిద్ధి చెందిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు వసూలు చేసే అవకాశాలూ భవిష్యత్తులో ఉంటాయి. 


వందల పాఠశాలల మూత...

ప్రభుత్వ వైఖరితో షాక్‌ తిన్న పలు ఎయిడెడ్‌ విద్యాసంస్థలు తమ పాఠశాలల్ని మూసేస్తామని ప్రకటించా యి. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 300లకు పైగా ఎయిడెడ్‌ పాఠశాలల్ని మూసేశారు. మరోవైపు విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లోను పలు పాఠశాలలు మూసేశారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా మూసేసిన పాఠశాలల్లోని పిల్లల్ని దగ్గరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకుంటామని ప్రభుత్వం అంటోంది. కానీ దగ్గరలో ప్రభుత్వ పాఠశాలలు లేకుంటే దూరాల కు వెళ్లాల్సిందే. వాస్తవానికి ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో చదివే లక్షలమందిని ప్రభుత్వంలో చేర్చుకునేంత సామర్ధ్యం లేదు. కొవిడ్‌ కారణంగా ప్రజల ఆదాయాలు తగ్గి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కట్టలేక  ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. సుమారు 2.6లక్షల మంది పిల్ల లు ప్రభుత్వ పాఠశాలల్లో గతం కంటే ఎక్కువగా చేరారని ప్రభుత్వమే చెప్తోంది. కానీ పిల్లలు పెరిగినా...ఒక ఉపాధ్యాయ పోస్టును కూడా రెండున్నరేళ్లలో భర్తీ చేయలేదు. అలాగే తప్ప కొత్త భవనాలను నిర్మించలేదు. మరి అలాంటప్పుడు పెద్దసంఖ్యలో ఎయిడెడ్‌ పాఠశాలల పిల్లల వస్తే నిజంగా చేర్చుకునే సామర్ధ్యం ప్రభుత్వ పాఠశాలలకు ఉందా? అన్నది ప్రశ్న.