Abn logo
Mar 27 2020 @ 05:29AM

కరోనా..కన్నీళ్లు!

ఉన్న ఊరు పొమ్మంది.. ఆంధ్ర అడ్డుకుంటుంది...

అడుగడుగునా ఆంక్షలు - అడ్డుకున్న పోలీసులు

543 మంది హోమ్‌ క్వారంటైన్‌కు తరలింపు

ఇతర రాష్ర్టాల నుంచి రావడమే కారణం

కొనసాగుతున్న వైద్య పరీక్షలు

పోలీసుల అనుమతి లేక చిక్కుకుపోయిన విద్యార్థులు


ఉన్న ఊరు పొమ్మంది.. మనకేంలే అనుకుంటూ జన్మభూమికి బయలుదేరారు.. అయితే అడుగడుగునా అడ్డంకులే.. ఎక్కడ నుంచి వచ్చారు.. ఎలా వచ్చారు.. ఎవరు పంపించారు..ఇలా సవాలక్ష ప్రశ్నలు.. సరిహద్దు దాటి రావడానికి వీల్లేదంటూ ఆంక్షలు.. ఇదీ హైదరాబాద్‌, బెంగళూరు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులకు బుధవారం ఆంధ్రలో ఎదురైన చేదు అనుభవం.. ఎందుకంటే కరోనాకు భయపడి అటువారిని ఇటు రానివ్వడం లేదు. కనీసం సొంతింటికి వెళ్లడానికి కూడా దారిలేకుండాపోయింది..దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.. అక్కడ పొమ్మని ఇక్కడ రావద్దంటే ఎలా అంటూ ఆవేదన చెందుతున్నారు. ఆంక్షలు సహించలేక కన్నీటిపర్యంతమవుతున్నారు.. 


నిడదవోలు/తాడేపల్లిగూడెం రూరల్‌/ కొవ్వూరు/ వీరవాసరం/ తాళ్లపూడి / పెనుగొండ, మార్చి 26 :కరోనా కలకలం అంతా ఇంతా కాదు.. ఎక్కడి వారిని అక్కడ బత కనివ్వడంలేదు.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హాస్టళ్లన్నీ మూతపడ్డాయి.ఆంధ్రకు చెందిన వేలాది మంది చదువు నిమిత్తం, ఉద్యోగం నిమిత్తం అక్కడ ఉంటున్నారు.వారందరికీ నిలువ నీడ లేకుండాపోయింది. అయితే హైదరాబాద్‌ నుంచి తెలంగాణ ప్రభుత్వం సరిహద్దు అయిన కోదాడ వరకూ తీసుకువచ్చి వివిధ జిల్లాలకు చెందిన ఆంధ్రకు అప్పగించింది.  అక్కడి నుంచి బస్సులో వారందరినీ తాడేపల్లిగూడెం ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌లలో ఏర్పాటు చేసిన హోమ్‌ క్వారంటైన్‌కు 132 మందిని తరలిం చారు.


హైదరాబాద్‌, బెంగళూరు నుంచి కార్లలో తరలివస్తున్న వివిధ జిల్లాలకు చెందిన సుమారు 76 మంది విద్యార్థులు, ఉద్యోగులను నిడదవోలు వద్ద అడ్డుకుని నిడదవోలు ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌లో ఏర్పాటు చేసిన హోమ్‌ క్వారంటైన్‌కు తరలించారు. తాళ్లపూడి మండలం అన్నదేవరపేట వద్ద, పైడిమెట్ట వద్ద శుక్రవారం ఉదయం విడివిడిగా రెండు వాహనాల్లో  హైదరాబాద్‌ నుంచి వస్తున్న కాకినాడ, రాజ మండ్రికి చెందిన 19 మందిని పోలీసులు అడ్డుకుని వైద్య పరీక్షల నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరితో పాటు కొవ్వూరు పోలీసులు అడ్డుకున్న 27 మంది మొత్తం 46 మందిని కొవ్వూ రులో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ హోమ్‌కు తరలించారు.అదే విధంగా వీరవాసరం బస్టాండ్‌ సెంటర్‌లోనూ హైదరాబాద్‌ నుంచి ఐదు కార్లలో తరలివస్తున్న 24 మందిని అడ్డుకున్నారు.అయితే 24 మందిని పీహెచ్‌ సీకి తరలించి పరీక్షలు చేసి హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఎవరిం టికి వారిని పంపించి వేశారు.తెలంగాణ నుంచి 265 మంది సుమారు 55 మోటారు సైకిళ్లు, 28 కార్లలో తూర్పుగోదావరి జిల్లాకు బయల్దేరారు. ఉదయం 11.30 గంటల సమయంలో పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.


అమలాపురం ఆర్‌డీవో గణేష్‌కుమార్‌, రావులపాలెం, పెనుగొండలు కృష్ణ చైతన్య, అనిల్‌కుమార్‌ సమక్షంలో 12 గంటల పాటు అడ్డుకున్నారు. వారు నడిపిన వాహనాలను సీజ్‌ చేసి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రిపోర్టులు ఆధారంగా ఇంటికి పంపుతామని అధికారులు చెప్పారు.అనంతరం 265 మందిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యేక వాహనంలో రాజమండ్రిలోని బొమ్మూరు వద్ద ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ హోమ్‌కు తరలించారు. కొవ్వూరులో క్వారంటైన్‌ హోమ్‌ను మంత్రి వనిత, డీఎస్పీ రాజేశ్వరరెడ్డి  సందర్శించి ఏర్పాట్లు చేయా లని ఆదేశించారు. 


పోలీసుల అనుమతికి ఎదురుచూపు.. 

వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న 278 మందికి గురువారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలులో ఏర్పాటు చేసిన హోమ్‌ క్వారంటైన్ల వద్ద వైద్య పరీక్షలు చేశారు.అయితే అందరూ ఆరోగ్యంగానే ఉన్నట్టు లెక్క తేల్చారు.బొమ్మూరు తరలించిన 265 మందికి పరీక్షలు చేస్తు న్నట్టు సమాచారం. అయితే పరీక్షల అనంతరం వీరిందరినీ వారి వారి ప్రాంతాలకు తర లించాల్సి ఉంది. పోలీసుల అనుమతి లభించక పోవడంతో గురువారం హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచనున్నారు. దీనిపై ఉద్యోగులు, విద్యార్థులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


తాడేపల్లిగూడెంలో నీళ్లూ లేవు.. ఆహారమూ లేదు.. 

తాడేపల్లిగూడెం ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌లో హోమ్‌ క్వారంటైన్‌ అయితే ఏర్పాటు చేశారు కానీ..ఏర్పాట్లు మాత్రం చేయలేదు. తినడానికి ఆహారం కనీసం తాగడానికి మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అక్కడ పనిచేసే సిబ్బందికి అటువంటి పరిస్థితే ఎదురైంది.దీంతో ఆ ప్రాంతంలో సిబ్బంది ఆందోళనకు దిగే పరిస్థితి ఏర్ప డింది. అయితే ఎట్టకేలకు మంచినీళ్లు ఏర్పాటు చేశారు.సాయంత్రం వరకూ ఆహారం అందక అలమటించారు. కొవ్వూరు, నిడదవోలులో  మంచినీళ్లు, ఆహారం ఏర్పాట్లు చేశారు. నిడదవోలు మునిసిపల్‌ కమిషనర్‌ పద్మావతి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 


సరిహద్దు  నుంచి దారి బంద్‌....

తెలంగాణ ఆంధ్ర సరిహద్దున చింతలపూడి మండలం ఉంది. ఈ మండలంలోని గురుభట్లగూడెం, సీతానగరం, అల్లిపల్లి మూడు రహదారులు ఆంరఽధలోకి రావడానికి మార్గం ఉంది. అయితే ఇక్కడ కూడా చెక్‌ పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి హాస్టల్‌ విద్యార్థులు, ఉద్యోగులను పంపివేయడంతో ఈ మార్గంలో కూడా రాత్రివేళ వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే ఎవరినీ అనుమతించలేదని సమాచారం. 


ఆంధ్ర వాళ్లమే ..దేశద్రోహులం కాదు : శ్రీలక్ష్మి

నా పేరు శ్రీలక్ష్మి.. మాది తూర్పుగోదావరి జిల్లా..  హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నా. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా హాస్టళ్లన్నీ మూసివేయడంతో సొంత ఊరికి వచ్చేందుకు కారులో బయలుదేరా.. ఆంరఽధ బోర్డర్‌కు వచ్చే సరికి మేమేదో దేశద్రోహులమన్నట్టు మాకు అనుమతి లేదంటూ ఆపేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి తినడానికి తిండి, తాగడానికి నీరు లేక నానా అవస్థలు పడ్డాం. నిడదవోలు మునిసిపల్‌ కమిషనర్‌ మాత్రమే ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ఆంధ్రాకు వచ్చే వారిని దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. రెండు ప్రభుత్వాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి.


Advertisement
Advertisement
Advertisement