హైకోర్టుకు విద్యార్థుల లేఖ

ABN , First Publish Date - 2022-09-28T05:34:39+05:30 IST

నారాయణపేట జిల్లా మొగుల్‌మడ్క ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు హైకోర్టుకు లేఖ రాసిన విషయం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది.

హైకోర్టుకు విద్యార్థుల లేఖ
రాసిన ఉత్తరాలను చూపుతున్న విద్యార్థులు

దామరగిద్ద, సెప్టెంబరు 27 : నారాయణపేట జిల్లా మొగుల్‌మడ్క ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు హైకోర్టుకు లేఖ రాసిన విషయం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ పాఠశాలలో మొగుల్‌మడ్క, అన్నాసాగర్‌, ఉల్లిగుండం, నర్సాపూర్‌, సుద్దబండ తాండతో పాటు దౌల్తాబాద్‌ మండలంలోని తిర్మలాపూర్‌, నాగసారం గ్రామాలకు చెందిన 411 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలకు 13 మంది ఉపాధ్యాయులు అవసరముండగా ఆరుగురు మాత్రమే ఉన్నారు. 317 జీవోలో భాగంగా ఇద్దరు ఉపాధ్యాయులు జనవరిలో ఇక్కడికి వచ్చారు. ఆ ఇద్దరు కూడా ఆగస్టులో బదిలీపై మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. దీంతో జీవశాస్త్రం, ఇంగ్లిష్‌ పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. వారిని తిరిగి పాఠశాలకు రప్పించాలని, లేదా వారి స్థానంలో కొత్త ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ విద్యార్థులు ఆదివారం హైకోర్టుకు పోస్టు ద్వారా లేఖలు పంపారు. ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా పరిష్కారం కాలేదని, హైకోర్టు అయినా తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరారు. 

Updated Date - 2022-09-28T05:34:39+05:30 IST