విద్యార్థులకు శుభవార్త !

ABN , First Publish Date - 2022-06-07T13:41:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పనుంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ ఉత్తీర్ణులు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆ విద్యార్థుల జాబితా

విద్యార్థులకు శుభవార్త !

- 1 నుంచి 9 వరకు ‘ఆల్‌పాస్‌’

- విద్యాశాఖ నిర్ణయం 

- త్వరలో ఉత్తర్వులు ?


అడయార్‌(చెన్నై), జూన్‌ 6: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పనుంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ ఉత్తీర్ణులు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆ విద్యార్థుల జాబితా తయారు చేయాల్సిందిగా ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించింది. 2020 మార్చిలో కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా పాఠశాలలు తెరుచుకోలేదు. అయితే కరోనా నియంత్రణ కోసం అమలు చేసిన లాక్‌డౌన్‌ ఆంక్షలను దశలవారీగా సడలించిన తర్వాత 2021 సెప్టెంబరు 10 నుంచి కాలేజీలు, ప్లస్‌ వన్‌, ప్లస్‌టూ, టెన్త్‌ విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభించారు. 2021 డిసెంబరులో మరికొన్ని స్కూల్స్‌ తెరిచారు. జనవరి నుంచి పూర్తిస్థాయిలో ఓపెన్‌ చేశారు. మేలో పబ్లిక్‌ పరీక్షలను కేవలం పది, ప్లస్‌ వన్‌, ప్లస్‌టూ విద్యార్థులకు, మిగిలిన తరగతులకు పాఠశాల స్థాయిలోనే పరీక్షలు నిర్వహించారు. ఇదిలావుండగా 2009లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి 14 యేళ్ళలోపు చిన్నారులకు నిర్బంధ విద్య అందించాలి. ఈ తరగతులకు చెందిన విద్యార్థులను ఫెయిల్‌ అయ్యారన్న సాకుతో పాఠశాల నుంచి బయటకు పంపించడానికి వీల్లేదు. ఈ తరహా నిబంధన ఆ చట్టంలో ఉంది. ఈ కారణంగానే ప్రతి యేటా 1 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులందరినీ ఉత్తీర్ణులైనట్టుగా ప్రకటిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా యేటా ఈ తరహా నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ యేడాది కూడా విద్యా హక్కు చట్టం మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. అదేసమయంలో కరోనా కారణంగా పాఠశాలల్లో తరగతులు సక్రమంగా జరగలేదు. దీంతో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించిన పరీక్షలకు హాజరైవుంటే చాలు.. వారిని కూడా ఉత్తీర్ణులుగా ప్రకటించనున్నారు. అలాగే, నిర్బంధ విద్యా హక్కు చట్టం మేరకు ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులను సహజంగానే ఉత్తీర్ణులు చేయాల్సి ఉంది. ఇదే అంశాన్ని తెలియజేస్తూ, అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. తొమ్మిదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత విషయంలో మాత్రం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులే ఒక నిర్ణయం తీసుకునేలా సూచించారు. దీంతో ఒకటి నుంచి 9వ తరగతి చదివే విద్యార్థుల్లో ఉత్తీర్ణులైన వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ జాబితాను త్వరలోనే వెల్లడించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2022-06-07T13:41:01+05:30 IST