
వరంగల్: యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, పునరుత్తేజాన్ని మళ్లీ అందిపుచ్చుకుని సీఎం కేసీఆర్ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. కేయూ దూరవిద్య కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రామ్, బీఆర్ అంబేద్కర్ ప్రాంగణంలో బుధవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహాదీక్షను చేపట్టారు. విద్యార్థుల దీక్షకు ఈటల సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగించారు. 2009లో కేసీఆర్ దీక్ష విరమణ చేయగానే కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమాన్ని రగలించారని గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న దోపిడీని, దుర్గార్మమైన పాలనను విద్యార్థులు అంతమెందించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో చెప్పిన త్వరలోనే ఉద్యోగాల భర్తీ అంటూ పూట గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు రాక పిల్లలు తల్లిదండ్రులకు భారంగా మారే పరిస్థితి దాపురించందని, ఇది చాలా ప్రమాదకరమైందని అవేదన వ్యక్తం చేశారు. తరగతిగదిలో విద్యతో వికసించిన యువత ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతోందో సీఎం కేసీఆర్ ఆలోచించాలని హితవు పలికారు. హుజురాబాద్ పేదల ఓట్ల కోసమే సీఎం దళితబంధు ప్రకటించారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.