కర్నూలు: కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థి నాయకులు
కర్నూలు(ఎడ్యుకేషన్/న్యూసిటీ), నవంబరు 29: అనంతపురం నగరంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగన్న మాట్లాడుతూ మంత్రి బొత్సను కలవడానికి వచ్చిన విద్యార్థి నాయకులను అనుమతించకపోవడంతో అటుగా వస్తున్న మంత్రి కాన్వాయ్‌ను ఆపి సమస్యలు వివరించడానికి ప్రయత్నించిన విద్యార్థి యువజన సంఘాల నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి, నాన్‌బెయిల్ కేసులు నమోదు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, లేనిసమక్షంలో తమపై ఎన్నికేసులు పెట్టినా.. మంత్రులను, ఎమ్మెల్యేలను జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములుగౌడు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సోమన్న, నగర కార్యదర్శి బీసన్న, సూర్యప్రతాప్, మునిస్వామి, రాముడు, ఇషాక్, విజయ్, హరి, కిరణ్, అనిల్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
డోన్(రూరల్): అనంతపురంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి యువజన సంఘాల నేతల అక్రమ అరెస్టును నిరసిస్తూ సోమవారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని గుత్తి రోడ్డులో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులిశేఖర్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో అకాల వర్షాలతో వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను, వరద బాధితులకు ఆదుకోవాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తే పోలీసుల కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం దారుణమన్నారు. వారిపై కేసులను తక్షణమే ఎత్తివేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐవైఎఫ్ నాయకులు, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు రణత్, వెంకటేష్, రామ్మోహన్, ప్రభాకర్ పాల్గొన్నారు.
డోన్: మంత్రి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు