ఉపాధ్యాయుడు మందలించాడని!

ABN , First Publish Date - 2022-01-26T04:25:14+05:30 IST

ఉపాధ్యాయుడు మందలించాడని!

ఉపాధ్యాయుడు మందలించాడని!
కొంచాడ వంశీ మృతదేహం

విద్యార్థి బలవన్మరణం

ఎస్‌ఎంపురం ఏపీ గురుకుల పాఠశాలలో ఘటన

ఎచ్చెర్ల, జనవరి 25: ఉపాధ్యాయుడు మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురం ఏపీ గురుకుల పాఠశాలలో మంగళవారం ఉదయం వెలుగుచూసిన ఘటనకు సంబంధించి పోలీసులు, తోటి విద్యార్థులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న   కొంచాడ వంశీ (15) అనే విద్యార్థి సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత తొమ్మిదో తరగతి గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం వేకువజామున 5 గంటలకు విద్యార్థులను లేపేందుకు వెళ్లిన వాచ్‌మెన్‌ అప్పారావుకు ఫ్యాన్‌కు వేలాడుతున్న వంశీ మృతదేహం కనిపించింది. ప్రిన్సిపాల్‌ కిమిడి జగన్మోహనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశ డీఎస్పీ వాసుదేవరావు, జేఆర్‌పురం సీఐ స్వామినాయుడు, ఇన్‌చార్జి ఎస్‌ఐ ఎస్‌.బాలరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అలాగే క్లూస్‌ టీమ్‌ వివరాలు సేకరించింది. వంశీది సంతకవిటి మండలం మిర్తివలస. తల్లిదండ్రులు సింహాద్రి, రమణమ్మ, గ్రామస్థులు పెద్దసంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. కుమారుడి మృతదేహం వద్ద గుండెలలిసేలా రోదించారు. వంశీ బలవన్మరణానికి ఉపాధ్యాయుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో కొద్దిరోజులుగా పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హిందీ పేపర్‌లో తక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో వంశీని హిందీ ఉపాధ్యాయుడు తూలుగు జ్ఞానేశ్వరరావు తోటి విద్యార్థుల ముందు మందలించాడు. అదే సమయంలో ఉపాధ్యాయుల సమావేశంలో ప్రిన్సిపాల్‌ వద్దకు వంశీని తీసుకెళ్లి ఫిర్యాదుచేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సోమవారం రాత్రి పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న తమ్ముడు కిరణ్‌తో వంశీ మాట్లాడినట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత తొమ్మిదో తరగతి గదిలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తుండగా వంశీ తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు అడ్డుకున్నారు. మృతికి గల కారణాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు సర్దిచెప్పడంతో నిరసనను విరమించారు. తండ్రి సింహాద్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాలలో ఇటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదని.. ఇది దురదృష్టకరమని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ) అన్నారు.

Updated Date - 2022-01-26T04:25:14+05:30 IST