student suicide: విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-26T15:22:08+05:30 IST

కళ్లకుర్చి విద్యార్థిని శ్రీమతి ఆత్మహత్య(suicide) సంఘటన సృష్టించిన కలకలం సద్దుమణగక ముందే తిరువళ్లూరులో మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో

student suicide: విద్యార్థిని ఆత్మహత్య

- సీబీసీఐడీ విచారణకు ఆదేశం

- స్థానికుల రాస్తారోకో


చెన్నై, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కళ్లకుర్చి విద్యార్థిని శ్రీమతి ఆత్మహత్య(suicide) సంఘటన సృష్టించిన కలకలం సద్దుమణగక ముందే తిరువళ్లూరులో మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనపై వెంటనే స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. తిరువళ్లూరు(Tiruvallur) సమీపం మప్పేడు వద్దనున్న కీళ్‌చేరిలో ప్రభుత్వ సాయంతో నడుపుతున్న ‘సేక్రెడ్‌ హార్ట్‌ బాలికోన్నత పాఠశాలలో తిరుత్తణి సమీపం తక్కలూరు గ్రామానికి చెందిన పూసనం కుమార్తె సరళ (17) ప్లస్‌-2 చదువుతోంది. ఆ పాఠశాల వెనుకవైపున్న హాస్టల్‌లో ఉంటోంది. సోమవారం ఉదయం యూనిఫాం ధరించి హాస్టల్‌ గదినుండి  పాఠశాలకు బయలుదేరింది. స్నేహితులతో కలిసి పాఠశాల క్యాంటీన్‌కు భోజనానికి వెళుతూ హాస్టల్‌ గదికి వెళ్ళి వస్తానని వెళ్ళింది. చాల సేపటివరకు సరళ రాకపోవడంతో స్నేహితురాళ్లు హాస్టల్‌ గదికి వెళ్ళి చూడగా ఆ బాలిక ఉరిపోసుకుని వేలాడుతుండటం చూసి దిగ్ర్భాంతి చెందారు. వెంటనే వారు హాస్టర్‌ వార్డెన్‌(Hoster Warden), పాఠశాల నిర్వాహకులకు సమాచారమిచ్చారు. విషయం తెలిసిన తిరువళ్లూరు డీఎస్పీ చంద్రదాసన్‌(Chandradasan), ఎస్‌ఐ ఇలంగో ఇతర పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సరళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థిని ఆకస్మికంగా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదిలా ఉండగా సరళ ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకుని తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు ఆ పాఠశాల హాస్టల్‌ వద్దకు చేరుకున్నారు. పాఠశాల నిర్వాహకులతో వారు గొడవకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలోపుగా ఆ హాస్టల్‌(Hostel) వద్ద  పోలీసులను మొహరించారు.  బయటి వ్యక్తులెవరినీ లోపలకు వెళ్ళకుండా కట్టుదిట్టం చేశారు. పాఠశాల ప్రాంగణమంతటా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో పాఠశాలకు సెలవు కూడా ప్రకటించారు.


ఒక్కగానొక్క కుమార్తెను కోల్పోయాం...

హాస్టల్‌ భవనం వద్ద సరళ తల్లిదండ్రులు బోరున విలపిస్తూ అల్లారు ముద్దుగా పెంచిన తమ ఒక్కదానొక్క కుమార్తెను పోగొట్టుకున్నామన్నారు. తమ కుమార్తె ఆత్మహత్య వెనుక పలు అనుమానాలున్నాయని ఆరోపించారు. తమ కుమార్తె ఆత్మహత్య(suicide) చేసుకోవడానికి కారణమైనవారిని కనుగొని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా సరళ ఆత్మహత్యకు కారణమైనవారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆమె కుటుంబీకులు, బంధువులు, స్థానికులు పొదట్టూరుపేట - తిరుత్తణి రోడ్డులో వెళుతున్న నాలుగు రవాణా సంస్థల బస్సులను నిలిపివేసి బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీనితో ఆ మార్గంలో గంటకు పైగా వాహనాల రాకపోకలు ఆగిపోయాయి.


డీఐజీ సందర్శన...

విద్యార్థిని ఆత్మహత్య సమాచారం తెలియగానే కాంచీపురం సర్కిల్‌ డీఐజీ సత్యప్రియ ఇతర ఉన్నత పోలీసు అధికారులు కీళ్‌చేరి సేక్రెడ్‌ హార్ట్‌ పాఠశాల వద్దకు చేరుకున్నారు. సరళ ఆత్మహత్య చేసుకున్న హాస్టల్‌ గదిని పరిశీలించారు. హాస్టల్‌ వార్డెన్‌ ఇతర సిబ్బందిని విచారించారు. అనంతరం డీఐజీ సత్యప్రియ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థిని ఆత్మహత్యను అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి సీబీసీఐడీకి సిఫార్సు చేశామని, సీబీసీఐడీ ఎస్పీ త్రిపురసుందరి విచారణ అధికారిగా నియమించామని ఆమె వివరించారు.



Updated Date - 2022-07-26T15:22:08+05:30 IST