విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-08-10T05:30:00+05:30 IST

ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు.

విద్యార్థి ఆత్మహత్యాయత్నం
గాయపడిన విద్యార్థి మురళి

రెండో అంతస్థునుంచి దూకటంతో తీవ్రగాయాలు

మిర్యాలగూడ అర్బన్‌, ఆగస్టు 10: ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారం ఈ సంఘటన జరిగింది. ఏపీ రాష్ట్రం గుంటూరు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన గాదే మురళి(12)అనే విద్యార్థిని ఐఐటీ ఫౌండేషన్‌ కోచింగ్‌  కోసం తల్లిదండ్రులు కొద్దిరోజుల క్రితం మిర్యాలగూడ చర్చీరోడ్డులోని జీవీఆర్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించారు. కోచిం గ్‌ సెంటర్‌లో రేయింబవళ్లు చదివిస్తూ రోజువారీ స్లిప్‌టె్‌స్ట లు పెట్టడం, పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ గ్రూపులుగా విభజించి చదువుపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో విద్యార్థి మురళి కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక మానసిక క్షోభకు లోనయ్యాడు. విద్యార్థి తల్లిదండ్రులు కుమారుడిని చూసివెళ్లేందుకు బుధవారం మిర్యాలగూడకు వచ్చారు. కొంత సమయం కుమారుడితో గడిపి ఆ తర్వాత ఇంటి నుంచి తెచ్చిన దుస్తులు, స్నాక్స్‌ ఇచ్చి కోచింగ్‌సెంటర్‌ నుంచి బయటకు వెళ్లారు. తనను ఒంటరిగా వదిలి వెళ్తున్న తల్లిదండ్రులవైపు దీనంగా చూస్తూ రెండో అంతస్థుకు చేరాడు. ఐఐటీ కోచింగ్‌ సెంటర్‌లో చదువు కోసం ఎదురవుతున్న మానసిక ఒత్తిడి భయాన్ని కలిగించింది. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి మురళి భవనం రెండో అంతస్థు నుంచి కిందకు దూకడంతో తల, ముక్కు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. సెంటర్‌ నిర్వాహకులు గాయపడ్డ విద్యార్థిని సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. ఈ సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు, మీడియా అక్కడికి చేరుకున్నారు. వివరాలు వెల్లడించేందుకు కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు నిరాకరించారు. అప్పటికే విద్యార్థి తల్లిదండ్రులతో రాజీమార్గం కుదుర్చుకొని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక వాహనంలో గుంటూరుకు తరలించినట్లు సమాచారం. గాయపడ్డ విద్యార్థికి తల్లిదండ్రులకు కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుల్లో ఒకరితో సమీప బంధుత్వం ఉండడంతో వారుసైతం వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వన్‌టౌన్‌ సీఐ మాండవ శ్రీనివాస్‌ తెలిపారు. 


అనుమతులపై సందేహాలు

ఓ అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్థులో కొద్దినెలల క్రితమే జీవీఆర్‌ ఐఐటీ కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటైంది. సాధారణంగా కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం విద్యాశాఖ నిబంధనల ప్రకారం విద్యార్థులకు వసతుల కల్పనతోపాటు భద్రత చర్యలు చేపట్టాల్సి ఉంది. అంతేకాక 12ఏళ్లలోపు వయసుగల విద్యార్థులకు భవనం కింది గదుల్లోనే వసతి కల్పించాలి. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలోపం కారణం గా కోచింగ్‌ సెంటర్లలో విద్యార్థులకు మౌలిక సదుపాయలు కొరవడుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-08-10T05:30:00+05:30 IST