విద్యార్థీ.. విజయోస్తు

ABN , First Publish Date - 2022-05-22T05:14:31+05:30 IST

విద్యార్థి దశలో కీలకమైన పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ కాలంలో విద్యార్థులను ప్రమోట్‌ చేశారు. దాదాపు రెండు పర్యాయాల తర్వాత పది పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉన్నత చదువులకు బాటలు వేసే పది పరీక్షల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 23 నుంచి 31 వరకు పది పరీక్షలు, జూన్‌ ఒకటో తేదీ వరకు వొకేషనల్‌ పరీక్షలు ముగుస్తాయి.

విద్యార్థీ.. విజయోస్తు

- రేపటి నుంచి పదోతరగతి పరీక్షలు

- పలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు 

-  నిర్వహణకు 650 మంది సిబ్బంది

- జిల్లా వ్యాప్తంగా 6,381 మంది విద్యార్థులు 


(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

విద్యార్థి దశలో కీలకమైన పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ కాలంలో విద్యార్థులను ప్రమోట్‌ చేశారు. దాదాపు రెండు పర్యాయాల తర్వాత పది పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉన్నత చదువులకు బాటలు వేసే పది పరీక్షల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 23 నుంచి  31 వరకు పది పరీక్షలు,  జూన్‌ ఒకటో తేదీ వరకు వొకేషనల్‌ పరీక్షలు ముగుస్తాయి.  జిల్లాలో  పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అఽధికారులు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. విద్యార్థులు ఎన్నో ఆశలతో విజయం సాధించాలనే తపనతో పరీక్షలకు సన్నద్ధమయ్యారు. జిల్లా కేంద్రంలో భద్రపరిచిన పరీక్ష పత్రాలను ఆయా మండలాల పోలీస్‌ స్టేషన్లకు పంపించారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు 6,381 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వారిలో ప్రైవేటు విద్యార్థులు ఐదుగురు (ఫెయిలైన) ఉన్నారు.  ఇందులో బాలురు 3014 మంది, బాలికలు 3367 మంది ఉన్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2,796 మంది విద్యార్థులు ఉండగా బాలురు 1,514 మంది, బాలికలు 1,282 మంది, రెసిడెన్షియల్‌ పాఠశాలలో 958 మంది విద్యార్థులు ఉండగా బాలురు 259 మంది, బాలికలు 699 మంది, ప్రైవేటు పాఠశాలలో 1,421 మంది విద్యార్థులు బాలురు 763,  బాలికలు 658 మంది, బీసీ వెల్ఫేర్‌లో 146 మంది ఉండగా, బాలురు 75, బాలికలు 71 మంది, కేజీబీవీలో 330 మంది విద్యార్థులు, మోడల్‌ స్కూల్‌లో 663 మంది ఉండగా బాలురు 357 మంది, బాలికలు 306 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 59 మంది ఉండగా బాలురు 42 మంది, బాలికలు 57 మంది ఉన్నారు. ప్రైవేటు ఎయిడెడ్‌లో ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు.


35 కేంద్రాలు.. సీసీ కెమెరాల నిఘా

జిల్లాలో పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. గతంలో పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినట్లుగానే ఈ సారి కూడా సీసీ కెమెరాలను కొనసాగిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ధ 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. పోలీస్‌ బందోబస్తు  ఏర్పాటు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్‌ విద్యార్థుల కోసం  34,  ఫెయిలైన విద్యార్థుల కోసం ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం ఐదుగురు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష నిర్వహణకు 650 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇందులో 550 మంది ఇన్విజిలేటర్లు, 35 చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 35 డిపార్ట్‌మెంట్‌ అధికారులు, ఐదు సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, మరో రెండు ఫ్లయింగ్‌ బృందాలు విధులు నిర్వహించనున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంలను అత్యవసర వైద్య సేవలకు నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు.

ఐదు నిమిషాల వరకు ఒకే 

పది విద్యార్థులు  టెన్షన్‌ పడకుండా సమయానికి వెళ్లడం మంచిది. విద్యార్థుల కోసం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకు పరీక్ష రాసే వీలు కల్పించారు. పరీక్ష కేంద్రంలోకి అరగంట ముందు నుంచి పంపిస్తారు. 9.30 తరువాత ఐదు నిమిషాల వరకు విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి వెళ్లడానికి అవకాశం కల్పించారు. 


టైం టేబుల్‌ ఇలా 

ఈ నెల 23 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు పది పరీక్షలు జరగనున్నాయి. 23న తెలుగు, 24న హిందీ, 25న ఇంగ్లీష్‌, 26న గణితం, 27న జనరల్‌ సైన్స్‌, 28న సోషల్‌ స్టడీస్‌, 30న సంస్కృతం, లేదా అరబిక్‌, (మొదటి పేపర్‌), 31న సంస్కృతం లేదా అరబిక్‌ (రెండో పేపర్‌), జూన్‌ 1న ఒకేషనల్‌ కోర్సుకు సంబంధించిన పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరగనుంది.  

విద్యార్థులకు జాగ్రత్తలు

పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికే ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తున్నారు.  పరీక్ష సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సి జాగ్రత్తలు. 

-విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల యూనిఫాం వేసుకోకూడదు.

- ఓఎంఆర్‌ షీట్‌పై కోడ్‌ నంబరును మాత్రమే ఆదనపు జవాబు పత్రంపై వేయాలి. హాల్‌టికెట్‌ నంబరు వేయవద్దు

- సెల్‌ ఫోన్‌లు, కాల్యుక్‌లేటర్‌లు వంటి ఎలక్ర్టానిక్‌ వస్తువులు అనుమతించరు.

- పరీక్ష కేంద్రానికి కాగితాలు, జిరాక్స్‌ పేపర్‌లు తీసుకెళ్లవద్దు

- ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందికి పరీక్ష సమయంలో లోపలికి అనుమతి ఉండదు.

- కేవలం పరీక్షకు ఐదు నిమిషాల ఆలస్యం మాత్రమే సడలింపు ఉంటుంది. 9.30కి పరీక్ష ప్రారంభం కానుంది. ఆ ప్రకారం 9.35 నిమిషాలకు వరకు మాత్రమే అనుమతి ఇస్తారు.

- పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తరువాత 15 నిమిషాలు బార్‌ కోడ్‌ షీట్‌, ఆన్సర్‌ షీట్‌, ఎలా నింపాలో ఇన్విజిలేటర్‌ ద్వారా తెలుసుకోవాలి.

-  గుర్తింపు వివరాలను ఆన్సర్‌ షీట్‌లపై రాయవద్దు

- ఏమైనా ఫిర్యాదులు ఉంటే డీఈవోకు తెలియజేయాలి.

- పరీక్ష హాల్లోకి ప్యాడ్‌, హాల్‌టికెట్‌, పెన్నులు, మర్చిపోవద్దు


ప్రశాంతంగా ఏర్పాట్లు 

- డీఈవో రాఽధాకిషన్‌,   

పదోతరగతి విద్యార్థులకు ఇబ్బందులు కలగ కుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేశారు. మాస్‌  కాపీయింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టాం. మాస్‌కాపీయింగ్‌ నియంత్రణకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, సిట్టింగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్‌ కేంద్రాలను మూసివేతకు ఆదేశించాం. 144 సెక్షన్‌ విధించడమే కాకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వెద్య సేవలు, మంచినీటి  సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశాం. జిల్లాలో 35 కేంద్రాల్లో 6381 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 



Updated Date - 2022-05-22T05:14:31+05:30 IST