ఒక్క క్లిక్‌తో ఐఐటీ సీటు ఆవిరి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన అనాథ విద్యార్ధి!

ABN , First Publish Date - 2020-12-01T01:36:33+05:30 IST

పొరపాటున ఓ చిన్న లింక్ మీద క్లిక్ చేసిన కారణంగా ఓ విద్యార్ధి కష్టపడి సంపాదించుకున్న ఐఐటీ సీటు ఆవిరైపోయిన వైనమిది...

ఒక్క క్లిక్‌తో ఐఐటీ సీటు ఆవిరి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన అనాథ విద్యార్ధి!

ముంబై: పొరపాటున ఓ చిన్న లింక్ మీద క్లిక్ చేసిన కారణంగా ఓ విద్యార్ధి కష్టపడి సంపాదించుకున్న ఐఐటీ సీటు ఆవిరైపోయిన వైనమిది.  సీటు దక్కించుకోవాలన్న ఆరాటంలో అతడు క్లిక్ చేసిన లింక్ కాస్తా ‘‘సీట్ విత్‌డ్రా’’కి సంబంధించినది కావడంతో... ఐఐటీ బోంబేలో నాలుగేళ్ల ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్స్ కోసం అతడు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఆగ్రాకి చెందిన సిద్ధాంత్ బాత్రా ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కాగా ఇప్పటికే సీట్లు మొత్తం నిండిపోవడంతో అడ్మిషన్ నిబంధనల ప్రకారం ఇక తాము చేసేదేమీ లేదంటూ ఐఐటీ అధికారులు తేల్చిచెప్పారు. కావాలంటే వచ్చే ఏడాది మళ్లీ జేఈఈ (అడ్వాన్స్డ్) పరీక్ష రాసుకోవాలంటూ సూచించారు. దీంతో బాత్రా తొలుత బోంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ... ప్రస్తుత దశలో తామేమీ చేయలేమనీ, అదనపు సీటు కేటాయించే అధికారాలు కూడా తమకు లేవని ఐఐటీ చేతులెత్తేసింది. 


తన తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో బాత్రా ప్రస్తుతం బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. అతడి తండ్రి చిన్నప్పుడే చనిపోగా, రెండేళ్ల క్రితం తల్లి కూడా మరణించారు. అయితే తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం కష్టపడి చదివి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ఆలిండియా 270వ ర్యాంకు తెచ్చుకున్నాడు. ఆన్‌లైన్‌లో అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుండగా అతడికి ‘‘ఫ్రీజ్’’ అనే ఆప్షన్ కనిపించింది. అది సీటు కన్‌ఫర్మ్ చేసుకోవడానికి సంబంధించిన ఆప్షన్ అనుకుని దాన్ని క్లిక్ చేశాడు. అంతటితో అడ్మిషన్ ప్రక్రియ పూర్తైనట్టు భావించాడు. కానీ ఇటీవల బోంబే ఐఐటీ పోర్టల్‌లో అడ్మిషన్ పొందిన వారి జాబితాలో తన పేరు లేకపోవడం చూసి బాత్రా షాక్ అయ్యాడు. అయితే తాను సీట్ విత్‌డ్రా చేసుకోవాలని ఎట్టిపరిస్థితుల్లోనూ భావించలేదనీ... మానవతా దృక్పథంతో తన కోసం అదనపు సీటు కేటాయించాలని అతడు తన పిటిషన్‌లో అభ్యర్థించాడు. 

Updated Date - 2020-12-01T01:36:33+05:30 IST