రైతుల ఆందోళనలో వెన్నెముకలా విద్యార్థి నేతలు

ABN , First Publish Date - 2021-03-19T00:48:09+05:30 IST

రైతుల ఆందోళనలో వెన్నెముకలా విద్యార్థి నేతలు

రైతుల ఆందోళనలో వెన్నెముకలా విద్యార్థి నేతలు

న్యూఢిల్లీ: వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొనసాగిస్తున్న ఆందోళన 100 రోజులను దాటిపోయి కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో బైటాయించి చాలా రోజులుగా వారి నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కాగా, రైతులు చేస్తున్న ఈ ఆందోళనకు విద్యార్థి సంఘాల నేతలు వెన్నెముకగా ఉంటూ వస్తున్నాయి. బయటికి అంతగా ప్రచారం కాలేదు కానీ, రైతులకు వీరు అందిస్తున్న తోడ్పాటు, సహాయ సహకారాలు ఆందోళనకు ఇంధనంగా ఉపయోగపడుతోంది. రాత్రి-పగలు సరిహద్దుల్లో ఉన్న రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ వారికి అవసరమైన ఆహార, ఇతర అవసరాలను తీర్చుతూ వస్తున్నారు. రైతుల ఆందోళనలో ఉన్న విద్యార్థి నేతల్లో స్వతహాగా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయ నేపధ్యం లేని విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలు వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న ఎంతో మంది జీవితాలను కబలిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


హర్యానాకు చెందిన ఓ విద్యార్థి సంఘం నేత వికాష్ కిన్హా, రైతుల ఆందోళనలో మొదటి నుంచి చురుగ్గా పాల్గొంటున్నాడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వికాష్.. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. రైతుల ఆందోళన గురించి అతడు మాట్లాడుతూ ‘‘ఆందోళన ప్రారంభమైన 26 నవంబర్ 2020 నుంచి నేను నిరసనలో ఉన్నాను. ఆందోళన చేస్తున్న రైతులకు ఆహారం అందించడంతో పాటు వారికి నివాస సదుపాయాల్ని ఏర్పాటు చేస్తున్నాను. రకరకాల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆందోళన చేస్తున్న రైతుల ఆరోగ్య పరిస్థితి చాలా వరకు దెబ్బ తింటోంది. శీతాకాలం ముందు ప్రారంభమైన ఈ నిరసన వల్ల చాలా ఆరోగ్య సమస్యల్ని రైతులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రైతుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి వైద్య సదుపాయాలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. శక్తిని పెంపొందించే మందులు, జబ్బుల్ని నయం చేసే మందులను రైతులకు ఉచితంగా అందిస్తున్నాం’’ అని అన్నాడు.


ఇంకా అతడు మాట్లాడుతూ ‘‘నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా కుటుంబానికి ఆదాయ వనరు వ్యవసాయమే. నేను బాగానే చదువుకున్నప్పటికీ దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ కారణంగా ఉద్యోగం లభిస్తుందన్న నమ్మకం లేదు. నేను ఇకపై వ్యవసాయమే చేసుకోవాల్సిన గత్యంతరం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో వ్యవసాయాన్ని కుంటు పరిచే కొత్త చట్టాలను ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని వల్ల ఇప్పటి వరకు కాస్తో కూస్తో ఉన్న భూమిని సాగు చేసుకుని బతుకుతున్నమేము అదే పొలంలో వ్యవసాయ కూలీలుగా మారాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు రైతులు చేస్తున్న ఆందోళన విజయవంతం కాకుంటే రేపు నాకు నా కుటుంబానికి భవిష్యత్ లేదు. అందుకే రైతులు చేస్తున్న ఆందోళనకు నావంతుగా సహాయాన్ని అందించడానికి వచ్చాను’’ అని అన్నాడు.


పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన గుర్పాల్ సింగ్ మాన్ కూడా ఈ ఆందోళనలో మొదటి నుంచి ఉన్న విద్యార్థి నేత. ఈ ఆందోళనలో పంజాబ్ రైతులు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. తను ఢిల్లీ సరిహద్దుకు వెళ్లడానికి ప్రధాన కారణం ఇదేనని గుర్పాల్ చెప్తున్నాడు. ఇక జమిదారా స్టూడెంట్ ఆర్గనైజేషన్‌లతో పాటు మరిన్ని విద్యార్థి సంఘాలు, ఆ సంఘాల నేతలు కూడా రైతుల ఆందోళనలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. హర్యానాలోని విద్యార్థి సంఘాలు కొన్ని ఢిల్లీ సరిహద్దులోని రైతులకు కూరగాయలు, పాలు, పండ్లతో పాటు మరిన్ని నిత్యవసర సరుకులు అందిస్తున్నారు. రైతుల ఆందోళనలో రైతుల కుటుంబాలు కూడా నిరసనలో ఉన్నాయి. ఇలా ఉన్న కుటుంబాల పిల్లలకు తాత్కాలికంగా కొన్ని గుడారాలు ఏర్పాటు చేసి చదువు చెప్తున్నారు. పిల్లలకు పుస్తకాలతో పాటు ఇతర సామాగ్రి ఉచితంగా అందిస్తున్నారు.

Updated Date - 2021-03-19T00:48:09+05:30 IST