అనుమానాస్పద స్థితిలో విద్యార్ధ్థి మృతి

ABN , First Publish Date - 2022-07-04T05:29:06+05:30 IST

జమ్మికుంట పట్టణంలోని న్యూ మిలీనియం ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

అనుమానాస్పద స్థితిలో విద్యార్ధ్థి మృతి
పాఠశాల ఎదుట ధర్నా చేస్తున్న బందువులు, విద్యార్ధి సంఘాల నాయకులు , తిప్పిరెడ్డి అఖిల (ఫైల్‌)

 - పాఠశాల ఎదుట ధర్నాకు దిగిన తల్లిదండ్రులు, బందువులు

- ఫర్నిచర్‌ ద్వంసం, మెయిన్‌ గేట్‌కు తాళాలు

జమ్మికుంట/జమ్మికుంట రూరల్‌, జూలై 03: జమ్మికుంట పట్టణంలోని న్యూ మిలీనియం ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే తమ కుమార్తె మృతి చెందిందని విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి మల్లారెడ్డి, శ్రీలత దంపతుల కుమార్తె అఖిల (14) హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆదివారం తెల్లవారు జామున తోటి విద్యార్ధులు అఖిలను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా లేవలేదు. అనుమానం వచ్చి పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. స్పందించిన యాజమాన్యం వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హన్మకొండకు తీసుకు వెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. అఖిల మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యం అఖిల తల్లిదండ్రులకు సమాచారం అందించలేదు. గ్రామంలోని ఓ ప్రజా ప్రతినిధి ద్వారా అఖిల మృతి చెందిన వార్త తెలియజేశారు. తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. అఖిల తల వెనుక భాగం, కాలి చేతి వేళ్లకు గాయాలు ఉండడాన్ని వారు గమనించారు. అక్కడి నుంచి జమ్మికుంటలోని పాఠశాల వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. వారికి విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న తమ కుమార్తెకు ఏమైంది, ఎలా చనిపోయింది, ఎక్కడ చనిపోయింది తమకు చెప్పాలని, లేదంటే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ బైఠాయించారు. కరస్పాండెంట్‌ ముసిపట్ల తిరుపతిరెడ్డి సతీమణి ఎంపీపీ అని, తన రాజకీయ పలుకు బడి ఉపయోగించి బయటపడే అవకాశం ఉందన్నారు. పట్టణ సీఐ కె రామచందర్‌రావు స్పందిస్తూ ఫిర్యాదు చేయాలని, స్కూల్‌ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. స్కూల్‌ యాజమాన్యం నుచి స్పందన లేక పోవడంతో ఆగ్రహానికి గురైన బంధువులు పాఠశాల ఫర్నీచర్‌ ద్వంసం చేసి, మెయిన్‌ గేట్‌కు తాళాలు వేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలే ప్రశక్తి లేదని హెచ్చరించారు. పాఠశాలకు చేరుకున్న జిల్లా విద్యాధికారి జనార్ధన్‌రావును బందువులు నిలదీశారు. పాఠశాలపై కనీస పర్యవేక్షణ లేదని మండిపడ్డారు. స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని, ఉపేక్షించబోమని చెప్పడంతో శాంతించారు. సాయంత్రం వరకు విద్యార్ధిని తల్లిదండ్రుల నుంచి తమకు పిర్యాదు రాలేదని పట్టణ సీఐ కె రామ్‌చందర్‌రావు తెలిపారు. 

- అనుమానాలెన్నో..?

విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్ధి సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. అఖిలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఒక్క సారిగా ఆనారోగ్యంతో మృతి చెందిందని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.  జమ్మికుంటలోనే వైద్యులు అఖిల మృతి చెందిందని నిర్ధారించినట్లు తెలుస్తోంది. అలాంటపుడు హన్మకొండకు ఎందుకు తీసుకు వెళ్లారనేది తెలియాల్సి ఉంది. హన్మకొండకు తీసుకు వెళ్తున్న సమయంలోనే తల్లిదండ్రులకు తమ కుమార్తె మృతి చెందిందని సమాచారం అందింది. తమ కుమార్తె వెంట ఎవరు ఉన్నారో తెలుసుకుని తల్లిదండ్రులు అతడికి ఫోన్‌ చేశారు. కొంచెం పల్స్‌ ఉందని, మళ్లీ ఫోన్‌ చేస్తా అంటూ పెట్టేశాడు. కొద్ది సేపట్లోనే మీ కుమార్తె మృతి చెందిందని సదరు వ్యక్తి ఫోన్‌ చేసి చెప్పాడు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు రాకుండా హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు తరలించారనే విషయమై స్పష్టత లేదు.  విద్యార్ధిని తల వెనుక భాగం, కాలి వేళ్లకు గాయాలై రక్తం వస్తుంది. అఖిలను బైక్‌ మధ్యలో కూర్చో బెట్టుకోని ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఆ సమయంలోనే విద్యార్థిని కాలి వేళ్లు కింద తగిలి గాయాలైనట్లు తెలిసింది. తల వెనుక గాయం ఎలా అయిందో తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్‌ వస్తనే మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. 

Updated Date - 2022-07-04T05:29:06+05:30 IST