వసతుల కోసం విద్యార్థుల ధర్నా

ABN , First Publish Date - 2022-06-25T09:41:25+05:30 IST

మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా

వసతుల కోసం విద్యార్థుల ధర్నా

పాలమూరు యూనివర్సిటీ గేటు వద్ద 6 గంటల ఆందోళన

సమస్యలు పరిష్కరిస్తాం: వైస్‌ చాన్సలర్‌.. ధర్నా విరమణ

15 లోగా పరిష్కరించకుంటే మళ్లీ నిరసన: విద్యార్థులు


పాలమూరు యూనివర్సిటీ, జూన్‌ 24: మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తక్షణం వసతులు కల్పించాలంటూ శుక్రవారం యూనివర్సిటీ మెయిన్‌ గేట్‌ వద్ద విద్యార్థులు పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు. ఉదయం 9 గంటలకు ధర్నా ప్రారంభించిన విద్యార్థులు తమ డిమాండ్లను పరిష్కరించాలని నినదిస్తూ 6 గంటల పాటు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. యూనివర్సిటీ హాస్టల్స్‌ గదులకు తలుపులు, కిటికీలు సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు వస్తోందని, చలికాలం తట్టుకోలేని పరిస్థితి ఉందన్నారు. ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌ నెల రోజుల నుంచి పనిచేయకపోవడంతో బోరు నీళ్లే తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.


యూనివర్సిటీ హాస్టల్స్‌లో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిఘా లోపించిందని, విద్యార్థుల మొబైల్‌ ఫోన్లు తరచూ చోరీకి గురవుతున్నాయని తెలిపారు. సరైన భద్రత లేకపోవడంతో నాన్‌బోర్డర్లు రాత్రింబవళ్లు యూనివర్సిటీలోకి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ-గ్రంథాలయంలో కంప్యూటర్లు పనిచేయడం లేదని, అకాడమిక్‌, పోటీ పరీక్షలకు తెలుగు అకాడమీ పుస్తకాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. పోలీసు పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ శిక్షణ కోసం ట్రైనర్లను నియమించాలని కోరారు. యూనివర్సిటీ లోపలి రోడ్లపై లైట్లు వెలగడంలేదని, రాత్రివేళ చీకట్లో వెళ్లాల్సి వస్తోందని, పాములు, తేళ్లతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా విద్యార్థులు వినకపోవడంతో ఎలాంటి అలజడి జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పిండి పవన్‌కుమార్‌, ఓఎ్‌సడీ మధుసూదన్‌రెడ్డి విద్యార్థుల వద్దకొచ్చి సమస్యలు పరిష్కరిస్తామని, ఆందోళన విరమించాలని కోరినా ససేమిరా అన్నారు. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ వచ్చి విద్యార్థులతో చర్చలు జరిపారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని, మిగిలిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. జూలై 15వ తేదీలోగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. వీసీ ఇచ్చిన గడువులోగా సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక ఆందోళన చేస్తామన్న విద్యార్థులు సాయంత్రం 3 గంటలకు ధర్నా విరమించారు.

Updated Date - 2022-06-25T09:41:25+05:30 IST